ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్‌’ | History of Mandalay Prisons in Burma | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్‌’

Published Tue, Oct 15 2024 4:06 AM | Last Updated on Tue, Oct 15 2024 5:00 PM

History of Mandalay Prisons in Burma

సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌: దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అండమాన్‌లోని ‘కాలాపానీ’, బర్మా (ప్రస్తుతం మయన్మార్‌)లో ‘మాండలే’ జైళ్లు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌కు నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఒక్కసారి ‘కాలాపానీ’, ‘మాండలే’ జైలులో ప్రవేశిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అత్యంత దారుణ మైన చావుని మూటగట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి.  కాలాపానీ, మాండలే జైళ్ల తరహాలోనే ఇప్పుడు అండా సెల్స్‌ కూడా చాలా పాపులర్‌. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా అక్టోబర్‌ 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఆయన నాగపూర్‌ సెంట్రల్‌ జైలులో తొమ్మిదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. అందులోనూ ‘అండా సెల్‌’లో అత్యంత కఠినమైన కారాగార శిక్షను  ఎదుర్కొన్నారు. ఈయనకు ముందు నకిలీ స్టాంప్‌ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్‌ కరీం తెల్గీ, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిషేధిత ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నందుకు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ను అండా సెల్‌లో ఉంచారు. రోజులో ఉన్న 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధం తప్పదని  తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఈ నేపథ్యంలో ఈ అండా సెల్‌ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఇందులో ఉంచుతారు? ఇప్పటివరకు ఇందులో ఎవరెవరు శిక్షను అనుభవించారు? అనే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.  

గుడ్డు ఆకారంలో..
అండా సెల్‌ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50్ఠ50 అడుగుల కంపార్ట్‌మెంట్లుగా విభజితమై ఉంటుంది.

మహారాష్ట్రలోని ఎరవాడ (పుణే), నవీ ముంబైలోని తలోజా,  నాగపూర్‌ సెంట్రల్‌ జైళ్లలో ఈ అండా సెల్స్‌ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనదేశంలోని పలు సెంట్రల్‌ జైళ్లలోనూ ఈ అండా సెల్స్‌ ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాల ప్రజా పనుల విభాగాలు నిర్మించాయి.

1990లో పుణేలోని ఎరవాడలో అండా సెల్‌ను నిర్మించారు.

అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్‌ వాండెట్‌ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్‌స్టర్‌లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఈ అండా సెల్స్‌లో ఉంచుతారు.

అమృత్‌సర్‌లో గోల్డెన్‌ టెంపుల్‌ వద్ద ఆపరేషన్‌ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ వైద్యను హత్య చేసిన ఉగ్రవాదులు హర్జీందర్‌ సింగ్‌ జిందా, సుఖ్‌దేవ్‌ సుఖాలను ఉరితీసే ముందు 1992లో పుణేలోని ఎరవాడలో ఉన్న అండా 
సెల్‌లో తొలిసారిగా ఉంచారు.

అండా సెల్స్‌ ఎందుకు?
అత్యంత కరడు గట్టిన నేరస్తులను సులువుగా పర్యవేక్షించడానికి, అధిక ప్రమాదం ఉన్న ఖైదీలను సురక్షితంగా ఉంచడానికి 
ప్రత్యేకంగా ఈ అండా సెల్స్‌ను నిర్మించారు. గుడ్డు ఆకారంలో రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్‌ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.

ఇనుప కడ్డీలే స్నేహితులు.. ఊచలే తోబుట్టువులు
అండా సెల్స్‌లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్‌లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్‌ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్‌.. అండా సెల్‌. అందులో ఉండే ఖైదీ అన్ని వైపులా ఇనుప కడ్డీలతో కప్పబడి ఉంటాడు.

ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. పచ్చదనం ఏమాత్రం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని కాంక్రీట్‌తో నిర్మితమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గదిలో ఉన్న ఖైదీ చుట్టూ కాంక్రీట్‌ను తప్ప మరేమీ చూడలేడు. స్వచ్ఛమైన ఆక్సిజన్‌ కూడా అందదు. ఖైదీలు ఇతర ఖైదీలను చూడలేరు.. మాట్లాడలేరు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్‌ కూడా అండా సెల్‌లోనే అటాచ్డ్‌గా ఉంటాయి. అండా సెల్‌ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్‌ కావడానికి అంతగా అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement