Professor Gn Saibaba
-
ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్’
సాక్షి, సెంట్రల్ డెస్క్: దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అండమాన్‌లోని ‘కాలాపానీ’, బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో ‘మాండలే’ జైళ్లు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఒక్కసారి ‘కాలాపానీ’, ‘మాండలే’ జైలులో ప్రవేశిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అత్యంత దారుణ మైన చావుని మూటగట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. కాలాపానీ, మాండలే జైళ్ల తరహాలోనే ఇప్పుడు అండా సెల్స్ కూడా చాలా పాపులర్. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్టోబర్ 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో తొమ్మిదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. అందులోనూ ‘అండా సెల్’లో అత్యంత కఠినమైన కారాగార శిక్షను ఎదుర్కొన్నారు. ఈయనకు ముందు నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీ, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిషేధిత ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అండా సెల్లో ఉంచారు. రోజులో ఉన్న 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధం తప్పదని తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఈ నేపథ్యంలో ఈ అండా సెల్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఇందులో ఉంచుతారు? ఇప్పటివరకు ఇందులో ఎవరెవరు శిక్షను అనుభవించారు? అనే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుడ్డు ఆకారంలో..⇒ అండా సెల్ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50్ఠ50 అడుగుల కంపార్ట్మెంట్లుగా విభజితమై ఉంటుంది.⇒ మహారాష్ట్రలోని ఎరవాడ (పుణే), నవీ ముంబైలోని తలోజా, నాగపూర్ సెంట్రల్ జైళ్లలో ఈ అండా సెల్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనదేశంలోని పలు సెంట్రల్ జైళ్లలోనూ ఈ అండా సెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాల ప్రజా పనుల విభాగాలు నిర్మించాయి.⇒ 1990లో పుణేలోని ఎరవాడలో అండా సెల్‌ను నిర్మించారు.⇒అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్ వాండెట్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్స్టర్లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఈ అండా సెల్స్‌లో ఉంచుతారు.⇒ అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ వద్ద ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అరుణ్‌కుమార్ వైద్యను హత్య చేసిన ఉగ్రవాదులు హర్జీందర్ సింగ్ జిందా, సుఖ్‌దేవ్ సుఖాలను ఉరితీసే ముందు 1992లో పుణేలోని ఎరవాడలో ఉన్న అండా సెల్లో తొలిసారిగా ఉంచారు.అండా సెల్స్ ఎందుకు?అత్యంత కరడు గట్టిన నేరస్తులను సులువుగా పర్యవేక్షించడానికి, అధిక ప్రమాదం ఉన్న ఖైదీలను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ అండా సెల్స్‌ను నిర్మించారు. గుడ్డు ఆకారంలో రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.ఇనుప కడ్డీలే స్నేహితులు.. ఊచలే తోబుట్టువులుఅండా సెల్స్‌లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్.. అండా సెల్. అందులో ఉండే ఖైదీ అన్ని వైపులా ఇనుప కడ్డీలతో కప్పబడి ఉంటాడు.ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. పచ్చదనం ఏమాత్రం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని కాంక్రీట్‌తో నిర్మితమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గదిలో ఉన్న ఖైదీ చుట్టూ కాంక్రీట్‌ను తప్ప మరేమీ చూడలేడు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందదు. ఖైదీలు ఇతర ఖైదీలను చూడలేరు.. మాట్లాడలేరు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్ కూడా అండా సెల్లోనే అటాచ్డ్గా ఉంటాయి. అండా సెల్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్ కావడానికి అంతగా అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
‘బ్లాంకెట్’ నిషేధం.. బహుపరాక్!
ఓటర్లను బిచ్చగాళ్లుగా మారుస్తున్న కాలంలో జైల్లో సాయిబాబా కూడా ప్రాణాల్ని కాపాడే మందుల కోసం, చలి నుంచి కాచుకునే దుప్పటి కోసం బిచ్చగాడుగా మళ్లీ మళ్లీ అడుక్కోవాల్సి వస్తున్నది. చలికాలం ప్రవేశించింది. తనకు కప్పుకోవడానికి బ్లాంకెట్ కూడా ఇవ్వడం లేదనీ, తీవ్రమైన జ్వరంతో తాను కువకువ కూయాల్సి వస్తుందనీ, ఈ స్థితి ఇట్లాగే సాగితే తనకింక ఈ చలి కాలం గడవటం కష్టమని నాగపూర్ హై సెక్యూరిటీ జైలు అండాసెల్‌లో మార్చ్ 8 నుంచి దాదాపు ఎనిమిది నెలలుగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా రాశాడు. పోలీసులు, ప్రభుత్వాలు, రాజ్యా నికి కాకున్నా మానవ సమాజం కోసం అయినా మళ్లీ మళ్లీ మనం ఆయన తొంభైశాతం వికలాంగుడని, బెయి లుపై బయటికి వచ్చే నాటికే నరాల జబ్బువల్ల ఎడ మచెయ్యి లేపలేని స్థితిలో ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. హృద్రోగం, రక్తపు పోటు, మధుమేహంతో పాటు ఈసారి జైలుకు పోయే ముందు ఆయనకు గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అందుకే శస్త్ర చికిత్స చేయాలని ఢిల్లీలోని రాక్లాండ్ ఆసుపత్రి వాళ్లు చెప్పారు. ఎడమచెయ్యి శస్త్ర చికిత్స చేయించుకుంటే పనికి వస్తుందేమో తెలుసుకోవడానికి, ఇతర వ్యాధులకు ఆయన బెయిలుమీద ఉన్నప్పుడు హైదరాబాద్ కేర్ బంజారాలో ఆరు వారాలు చికిత్స పొందాడు. దేశం లోని నిపుణులైన వైద్యులు వచ్చి కూడ అప్పుడే ఆ స్థితి లేదని ఇంకొంత కాలం వేచి చూడాలని చెప్పారు. ఆ తర్వాత కోర్టు తీర్పు కోసం ఆయన తిరిగి గడ్చి రోలీ కోర్టుకు వెళ్లేదాకా ఢిల్లీలో ఎయిమ్స్ కాకుండా ఉన్న ఒకే ఒక్క సూపర్ స్పెషల్ ఆసుపత్రి రాక్లాండ్లో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. ఆ స్థితిలో ప్రయా ణాలు చేయకూడదని ఆ ఆసుపత్రి వైద్యులు ఆయనకు సూచించారు. కానీ ఆ రోజుల్లో ఆయన గడ్చిరోలీ కోర్టుకు విచారణకు తిరగక తప్పలేదు. తన స్వీయ వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లక తప్పలేదు. అయితే విచారణకు వెళ్లిన కాలమంతా కోర్టులో వాదోపవాదాలుగానీ, జడ్జి వైఖరి, మాటలుగానీ, ముఖ్యంగా తన న్యాయవాదులు కేసు నిర్వహించిన తీరుగానీ ఆయనకు ఈ కేసు నుంచి తప్పకుండా తాము నిర్దోషులుగా బయటపడతామనే విశ్వాసాన్ని కలిగిం చాయి. నూటికి నూరుపాళ్లు నమ్మకంతోనే తీర్పు వెలువ డగానే వచ్చి కేర్ ఆసుపత్రిలో చూపించుకొని ఢిల్లీలో ఉద్యోగంలో చేరడానికి సిద్ధమై వచ్చాడు. గడ్చిరోలీ జిల్లా జడ్జి ఎనిమిదివందల యాభై పేజీల ఇంగ్లిష్ (సాధా రణంగా హిందీలో ఇస్తారు) తీర్పులో ‘సాయిబాబా తొంభైశాతం వికలాంగుడే కావచ్చుగానీ, మానసికంగా క్రియాశీలంగా ఉన్నాడు గనుక యావజ్జీవ శిక్ష విధిస్తు న్నానన్నాడు. విజయటిర్కె అనే ఒక ఆదివాసీకి మినహా పాండు, మహేశ్ అనే మరో ఇద్దరు ఆదివాసులకు, ప్రశాంత్రాహీ అనే జర్నలిస్టుకు, హేమ్ మిశ్రా అనే జేఎన్‌యూ విద్యార్థికి యావజ్జీవ శిక్ష వేశాడు. హేమ్ మిశ్రా కూడా చెయ్యి వికలమై బాధపడుతున్నాడు. జేఎన్‌యూలో సాంస్కృతిక కళాకారుడు. ఈ తీర్పులో మూడు వందల యాభై పేజీలకు పైగా జీఎన్ సాయి బాబాపై ప్రాసిక్యూషన్ ఆరోపణలన్నింటికీ జడ్జి ఆమో దం ఉంది. అంతేకాదు ‘సాయిబాబాకు ఇంతకన్న కఠిన శిక్ష వేయలేకపోవడానికి’ చట్టం తన చేతులు కట్టి వేసిం దని రాశాడు. గడ్చిరోలి, బస్తర్‌లలో ఆల్ అవుట్ వార్‌లో ఆది వాసులు కేవలం ఎన్కౌంటర్లలో చనిపోవటం మాత్రమే కాదు. రాయపూర్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలలోనూ చనిపోతున్నారు. కంటి శస్త్ర చికిత్సలలో గుడ్డివాళ్లవుతున్నారు. డయేరియా, మలే రియాతో చనిపోతున్నారు. సామూహిక లైంగిక అత్యా చారాలకు గురవుతున్నారు. మార్కెట్ కొనుగోలు శక్తి లేని ఆదివాసీ, ముస్లిం, దళిత, బడుగు వర్గాలందరూ నేరపూరిత నిర్లక్ష్యానికి గురై చనిపోవడం రాజ్యం లక్ష్యం. వాళ్ల పక్షం వహించే ప్రజాస్వామ్య శక్తుల, వ్యక్తుల విష యంలో కూడా రాజ్యం వైఖరి అదే. వాళ్లు సహజ మర ణాలకు గురవుతారు. కోర్టు హత్యలకు గురవుతారు. జైళ్లలో చంపబడతారు. ఒక్కరోజు ఓటు బిచ్చగాడు అధికారానికి వచ్చి మిగిలిన కాలమంతా ఓటర్లను బిచ్చగాళ్లుగా మార్చాలని పథకాలు రచిస్తున్న కాలంలో జైల్లో సాయిబాబా కూడా తన డాక్టర్లు రాసిచ్చిన, తనవాళ్లు తెచ్చిన ప్రాణాల్ని కాపాడే మందుల కోసం, చలి నుంచి కాచుకునే దుప్పటి కోసం బిచ్చగాడుగా మళ్లీ మళ్లీ అడుక్కోవాల్సి వస్తున్నది. మందులు, ఉన్ని దుప్పటి జైలు గేటుకు చేరుతాయి. అవి ఆయన కుటుంబ సభ్యులు, ప్రతివారం కలిసే న్యాయ వాది తెచ్చి ఇస్తారు. కానీ అవి జైలు ఆఫీసు గేటు దాటి అండాసెల్లోని సాయిబాబాకు చేరవు. అండాసెల్ 2వ ప్రపంచ యుద్ధకాలపు గ్యాస్ చాంబర్ ఏమీ కాదు. జీవిత ఖైదు అయినా సరే ఎంతటి తీవ్రవాది, దేశ ద్రోహి అయినా జీవించే హక్కును సుప్రీంకోర్టు ఆఖరున రాష్ట్ర పతి కూడా అట్లా ఆదేశిస్తే తప్ప కోల్పోరు. బతికి ఉన్న సాయిబాబాపై ఈ బ్లాంకెట్ నిషేధాన్ని, బతికే హక్కును హరిస్తున్న అతి తీవ్రమైన నేరంగా ఎంచి ప్రతిఘటించ డానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ సంఘటిత పోరాటం చేయాలి. సాయిబాబా వంటి వాళ్లను కాపాడుకోవాలి. బ్లాంకెట్ అనే మాట తెలుగులో ఉన్ని దుప్పటి అని వాడు తాము. నాగపూర్ జైల్లో ఆరడుగుల మూడు అంగుళాల బెడ్‌షీట్ మాత్రమే అనుమతిస్తారు. (పెద్దదైతే ఉరి పెట్టు కుంటారనే భయంతో) ఉన్ని దుప్పటి ఇవ్వరు. ఇంగ్లిష్‌లో బ్లాంకెట్–శబ్దానికి మొత్తంగా అనే అర్థం కూడా ఉంది. మొత్తంగానే ఈ నిరాకరణ సాయిబాబా జీవించే హక్కునే నిరాకరిస్తున్నది, నిషేధిస్తున్నది. వరవరరావు వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు -
నాడు ఎమర్జెన్సీ.. నేడు గ్రీన్‌హంట్!
ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ని వ్యతిరేకించడం లేదని రెండు వాక్యాలు రాసివ్వనందుకే రెండేళ్లు నన్ను జైల్లో పెట్టారు. వీల్ చైర్లో నుంచి కదలలేని నాకు ఏడుసార్లు బెయిల్ నిరాకరించారు. ఆదివాసీల తరఫున మాట్లాడ్డం ఈ దేశంలో ఇంత పెద్ద నేరమని అంతకు ముందెన్నడూ నేనెరగను. అసమానతలు, ప్రజాస్వామ్యం ఒకే ఒరలో ఒదగవు. కానీ మన దేశంలో అసమానతలు రాజ్యమేలుతుంటాయి. అణచివేత అడుగడుగునా తాండ విస్తుంటుంది. వివక్ష విధ్వంసాలను సృష్టిస్తుంటుంది. అయినా మనం దేశంలో ప్రజాస్వామ్యం ఉందనే భావిస్తాం. ప్రజాస్వామ్యం లేదని ‘నమ్మడం’ ఇక్కడ నేరం. విశ్వాసాలు మూఢంగా ఉన్నా ఫరవాలేదు. కానీ అవి బలమైన భావజాలాలు కాకూడదు. పాలకులను ప్రశ్నించే ఆయు ధాలు కాకూడదు. అలా ఒక భావజాలాన్ని నమ్మినందుకే నాపైనా, నాలాంటి లక్షలాదిమందిపైనా అప్రకటిత అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తున్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సాక్షి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అత్తలూరి అరుణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ఒక్క పెన్నుపోటుతో రాజ్యాంగం ఇచ్చే అన్ని హక్కులను హరించివేసే అవకాశం ఉన్నదంటే అది ఎటువంటి ప్రజాస్వామ్యం అను కోవాలి? కచ్చితంగా ఎమర్జెన్సీ ప్రకటనని ఇలానే అర్థం చేసుకోవాలి. 1975 జూన్ 25 అర్ధరాత్రి మన దేశంలో ఎంతోమందికి ప్రజా స్వామ్యం మీదున్న భ్రమలు పటా పంచలయ్యాయి. ‘అత్యవసర పరి స్థితి’ అని ప్రకటిస్తూ ఇందిరమ్మ చేసిన ఒకే ఒక్క సంతకంతో రాజ్యాంగం కల్పించిన సర్వ పౌర హక్కులూ హరించింది రాజ్యం. అప్పటివరకు ప్రజాస్వామ్యం మీదున్న ప్రజల విశ్వాసం ఒక్కసారిగా సన్నగిల్లింది. నిజం చెప్పాలంటే ఎమర్జెన్సీ వెనుకా... ముందూ కూడా ఎమర్జెన్సీనే. ఎందుకంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే నేడూ కొనసాగుతున్నాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి అని ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించ కుండానే దానిని అమలు చేస్తున్నారు. 1975కి ముందు కూడా అదే నిర్బంధం అమలులో ఉంది. ఆ రోజు ఎమర్జెన్సీలో లక్షమంది రాజకీయ ఖైదీలుండగా, ఈ రోజుకీ లక్షలాది మంది రాజకీయ ఖైదీలుగా గుర్తింపు పొందకున్నప్పటికీ, చిన్నా చితకా నేరాలకి కూడా నిర్బంధాన్ని అనుభవి స్తున్నారు. జైలు జీవితం అనుభవిస్తున్న, అప్రకటిత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు, ఓబీసీలు అంతా నా దృష్టిలో రాజకీయ ఖైదీలే. ఎందుకంటే వారు రాజకీయ కారణా లతోనే నిర్బంధాన్ని అనుభవిస్తున్నారు. అందుకే ఈ దేశంలో ప్రజా స్వామ్యం ఒట్టిమాట. నియంతృత్వమే అసలు మాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న జాతుల ఉద్యమాలను కూడా రాజకీయ కారణాలతోనే అణచివేస్తున్నారు. మన దేశంలో కూడా ఇలాగే జరుగుతోంది. కశ్మీర్లో, పంజాబ్‌లో, ఈశాన్య రాష్ట్రాల్లో, మనపక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో, జార్ఖండ్‌లో అమలు చేస్తున్న నిర్బంధం ఎవరి ప్రయోజనం కోసం? అడవిలో పుల్లలేరుకున్నందుకు, వాళ్ళ ప్రపం చంలో వాళ్ళు బతుకుతున్నందుకు ఆదివాసీలను, దళితులను, ముస్లిం లను జైళ్లలో పెట్టారు. ఇలా నిర్బంధాన్ని అనుభవిస్తున్న ఆదివాసీలు దేశవ్యాప్తంగా 10 లక్షలమంది ఉంటారని ఒక అంచనా. ఈ దేశంలో రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజునే ఆదివాసీల హక్కులను సంపూర్ణంగా హరించివేశారని బి.డి. శర్మ అంటారు. ఆ రోజే చీకటిరోజన్న ఆయన అభిప్రాయం వాస్తవమని నా భావం. నిజానికి మనకన్నా ప్రజాస్వామ్యయుతమైన, చైతన్యమైన ప్రపంచం ఆదివాసీ లది. ప్రేమించే హక్కు, సహజీవనం చేసే హక్కు మన సమాజంలో లేదు. కానీ ఆదివాసీ సమాజంలో ఉంది. ఇద్దరూ విడిపోవాలనుకుంటే వారి ద్దరికీ శిక్ష ఉండదు. పెళ్ళికి ముందు పిల్లలు పుడితే వారి బాధ్యత సమాజం తీసుకుంటుంది. హిందూ, ముస్లింల మతపరమైన చట్టాల్ని మన లౌకిక రాజ్యాంగం ఆమోదిస్తున్నది. కానీ వారిదైన ఒక ప్రత్యేక సంస్కృతి, భూభాగం, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదివాసీలకు తమ దైన రాజ్యాంగం, చట్టం ఉన్నాయన్నది అంగీకరించదు. భీల్ ఆదివాసీలు నివసించే గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని ఆదివాసీల ప్రాంతం భీల్ కండ్. దాన్నంతా కలి పితే అది ఒక రాష్ట్రం అవుతుంది. జార్ఖండ్ జాతులకు సంబంధించిన ఆదివాసీలు నివసిస్తున్న భూభాగాన్ని కలిపితే అదీ ఒక రాష్ట్రం అవు తుంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సాల్లో నివసించే గోండు జాతి ఆదివాసీలు నివసించే ప్రాంతాన్ని గోండ్వానా అంటారు. వాళ్లందరినీ వారి వారి ప్రాంతాలనుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఏ పేరు పెట్టుకున్నా జరుగుతున్నది మాత్రం వారిని వారి ప్రాంతాలనుంచి తరిమి వేయడమే. ప్రైవేటు సైన్యం అరాచకాలను ఆదివాసీలు తిప్పికొట్టడంతో గ్రీన్ హంట్‌ని ప్రయోగించారు. దీంతో పారామిలిటరీ దళాలే ఆదివాసీ ప్రాంతాలకు వచ్చాయనుకున్నారు. కానీ నిజానికి అక్కడ మిలిటరీని దింపారు. గ్రీన్‌హంట్ పేరుతో జరు గుతున్నది మావోయిస్టులను తరిమి వేసేందుకు కాదు. మావోయిస్టులను తరిమి వేసినా మైనింగ్ సాధ్యం కాదని వారికి తెలుసు. ఆదివాసీలే వారి అసలు టార్గెట్. ఆస్ట్రేలియాలో ఆదివాసీలను, అమెరికాలో రెడ్ ఇండియన్స్‌ని తుడిచిపెట్టినట్టుగానే ఇక్కడా ప్రయత్నం జరుగుతోంది. ఆదివాసీలను తుడిచిపెట్టే మానవ హననంగా మేం ఆపరేషన్ గ్రీన్ హంట్‌ని భావించి, దాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే, దానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించింది. ఆ ఉద్యమానికి నేను నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాను. ఢిల్లీలో నన్ను అరెస్టు చేసినప్పటి నుంచి మేజిస్ట్రేట్ దగ్గర హాజరుపరిచే వరకు ఒకే ప్రశ్న నన్ను వెంటా డింది. ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ని వ్యతిరేకించడం లేదని రెండే రెండు వాక్యాలు రాసివ్వమన్నారు. పోలీస్ ఒత్తిడిని నిరాకరించిన ఫలితంగా.. వీల్ చైర్లోనుంచి కదల్లేని నాకు 7 సార్లు బెయిల్ నిరాకరించారు. అలా నేను రాసిస్తే నేనేమంత ప్రమాదకరమైన వ్యక్తిని కాకపోదును. 2 ఏళ్ళ పాటు జైల్లో ఉండి నేనిదే ఆలోచించాను. ఆదివాసీలకోసం మాట్లాడ్డం ఈ దేశంలో ఇంత పెద్ద నేరమని అంతకు ముందు నేనెరగను. గాంధేయవాదంలాగే మావోయిస్టు భావజాలాన్ని కలిగి ఉండడం తప్పు కాకూడదు. కానీ ఇక్కడ ఒక పౌరుడు ఏ భావజాలాన్ని కలిగి ఉండాలో రాజ్యం నిర్ణయిస్తుంది. పౌరుల ఆలోచనల్ని నియంత్రించే విధానం ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. కానీ ఇప్పుడదే జరుగు తోంది. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజసంపదను కొల్లగొట్టేందుకు ఆది వాసీలను తరిమికొట్టడమే ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఏకైక లక్ష్యం. ఆదివాసీలను సమూలంగా నిర్మూలిస్తే దేశంలో మిగిలిన వారి ప్రాణా లకు మాత్రం రక్షణ ఏమిటి? ఎప్పుడో కాదు ఇప్పుడే మన దేశంలో ఫాసిజం అమలులో ఉన్నది. ఎక్కడ చైతన్యం ఉంటుందో అక్కడ దాడులు జరుగుతాయి. ఒక కన్హయ్య, మరో రోహిత్, ఇంకో ఆదివాసీనో, మరెవ్వరో... దీన్నే అత్యవసర పరిస్థితి అంటారు. నిజానికి ఎమర్జెన్సీని మించిన యుద్ధ పరిస్థితి ఇది. (జూన్ 25, 1975న ఎమర్జెన్సీ ప్రకటన సందర్భంగా) -
సాయిబాబా అరెస్ట్ అప్రజాస్వామికం
విజయవాడ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా అరెస్ట్ అప్రజాస్వామికమని విరసం నేత కల్యాణరావు అన్నారు. సాయిబాబా విడుదల కోరుతూ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మాట్లాడుతూ ప్రపంచం గుర్తించిన మేధావి సాయిబాబాకు నక్సల్స్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. అంగవైకల్యంతో బాధపడే వ్యక్తిని అరెస్ట్ చేసి చీకటి గదిలో నిర్బంధించడం అమానవీయ చర్యగా అభివర్ణించారు. అరెస్ట్ సమయంలో కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం అందించకుండా గోప్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. సాయిబాబాను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.