‘బ్లాంకెట్‌’  నిషేధం.. బహుపరాక్‌! | varavara rao writes on professor gn saibaba | Sakshi
Sakshi News home page

‘బ్లాంకెట్‌’  నిషేధం.. బహుపరాక్‌!

Published Wed, Nov 15 2017 12:46 AM | Last Updated on Wed, Nov 15 2017 12:46 AM

varavara rao writes on professor gn saibaba - Sakshi

ఓటర్లను బిచ్చగాళ్లుగా మారుస్తున్న కాలంలో జైల్లో సాయిబాబా కూడా ప్రాణాల్ని కాపాడే మందుల కోసం, చలి నుంచి కాచుకునే దుప్పటి కోసం బిచ్చగాడుగా మళ్లీ మళ్లీ అడుక్కోవాల్సి వస్తున్నది.

చలికాలం ప్రవేశించింది. తనకు కప్పుకోవడానికి బ్లాంకెట్‌ కూడా ఇవ్వడం లేదనీ, తీవ్రమైన జ్వరంతో తాను కువకువ కూయాల్సి వస్తుందనీ, ఈ స్థితి ఇట్లాగే సాగితే తనకింక ఈ చలి కాలం గడవటం కష్టమని నాగపూర్‌ హై సెక్యూరిటీ జైలు అండాసెల్‌లో మార్చ్‌ 8 నుంచి దాదాపు ఎనిమిది నెలలుగా యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్‌ జీఎన్‌ సాయిబాబా రాశాడు. పోలీసులు, ప్రభుత్వాలు, రాజ్యా నికి కాకున్నా మానవ సమాజం కోసం అయినా మళ్లీ మళ్లీ మనం ఆయన తొంభైశాతం వికలాంగుడని, బెయి లుపై బయటికి వచ్చే నాటికే నరాల జబ్బువల్ల ఎడ మచెయ్యి లేపలేని స్థితిలో ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. హృద్రోగం, రక్తపు పోటు, మధుమేహంతో పాటు ఈసారి జైలుకు పోయే ముందు ఆయనకు గాల్‌ బ్లాడర్‌ (పిత్తాశయం)లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. అందుకే శస్త్ర చికిత్స చేయాలని ఢిల్లీలోని రాక్‌లాండ్‌ ఆసుపత్రి వాళ్లు చెప్పారు. ఎడమచెయ్యి శస్త్ర చికిత్స చేయించుకుంటే పనికి వస్తుందేమో తెలుసుకోవడానికి, ఇతర వ్యాధులకు ఆయన బెయిలుమీద ఉన్నప్పుడు హైదరాబాద్‌ కేర్‌ బంజారాలో ఆరు వారాలు చికిత్స పొందాడు. దేశం లోని నిపుణులైన వైద్యులు వచ్చి కూడ అప్పుడే ఆ స్థితి లేదని ఇంకొంత కాలం వేచి చూడాలని చెప్పారు. 

ఆ తర్వాత కోర్టు తీర్పు కోసం ఆయన తిరిగి గడ్చి రోలీ కోర్టుకు వెళ్లేదాకా ఢిల్లీలో ఎయిమ్స్‌ కాకుండా ఉన్న ఒకే ఒక్క సూపర్‌ స్పెషల్‌ ఆసుపత్రి రాక్‌లాండ్‌లో ఫిజియోథెరపీ చేయించుకున్నాడు. ఆ స్థితిలో ప్రయా ణాలు చేయకూడదని ఆ ఆసుపత్రి వైద్యులు ఆయనకు సూచించారు. కానీ ఆ రోజుల్లో ఆయన గడ్చిరోలీ కోర్టుకు విచారణకు తిరగక తప్పలేదు. తన స్వీయ వాంగ్మూలం ఇవ్వడానికి వెళ్లక తప్పలేదు.

అయితే విచారణకు వెళ్లిన కాలమంతా కోర్టులో వాదోపవాదాలుగానీ, జడ్జి వైఖరి, మాటలుగానీ, ముఖ్యంగా తన న్యాయవాదులు కేసు నిర్వహించిన తీరుగానీ ఆయనకు ఈ కేసు నుంచి తప్పకుండా తాము నిర్దోషులుగా బయటపడతామనే విశ్వాసాన్ని కలిగిం చాయి. నూటికి నూరుపాళ్లు నమ్మకంతోనే తీర్పు వెలువ డగానే వచ్చి కేర్‌ ఆసుపత్రిలో చూపించుకొని ఢిల్లీలో ఉద్యోగంలో చేరడానికి సిద్ధమై వచ్చాడు. గడ్చిరోలీ జిల్లా జడ్జి ఎనిమిదివందల యాభై పేజీల ఇంగ్లిష్‌ (సాధా రణంగా హిందీలో ఇస్తారు) తీర్పులో ‘సాయిబాబా తొంభైశాతం వికలాంగుడే కావచ్చుగానీ, మానసికంగా క్రియాశీలంగా ఉన్నాడు గనుక యావజ్జీవ శిక్ష విధిస్తు న్నానన్నాడు. విజయటిర్కె అనే ఒక ఆదివాసీకి మినహా పాండు, మహేశ్‌ అనే మరో ఇద్దరు ఆదివాసులకు, ప్రశాంత్‌రాహీ అనే జర్నలిస్టుకు, హేమ్‌ మిశ్రా అనే జేఎన్‌యూ విద్యార్థికి యావజ్జీవ శిక్ష వేశాడు. హేమ్‌ మిశ్రా కూడా చెయ్యి వికలమై బాధపడుతున్నాడు. జేఎన్‌యూలో సాంస్కృతిక కళాకారుడు. ఈ తీర్పులో మూడు వందల యాభై పేజీలకు పైగా జీఎన్‌ సాయి బాబాపై ప్రాసిక్యూషన్‌ ఆరోపణలన్నింటికీ జడ్జి ఆమో దం ఉంది. అంతేకాదు ‘సాయిబాబాకు ఇంతకన్న కఠిన శిక్ష వేయలేకపోవడానికి’ చట్టం తన చేతులు కట్టి వేసిం దని రాశాడు.

గడ్చిరోలి, బస్తర్‌లలో ఆల్‌ అవుట్‌ వార్‌లో ఆది వాసులు కేవలం ఎన్‌కౌంటర్‌లలో చనిపోవటం మాత్రమే కాదు. రాయపూర్‌ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలలోనూ చనిపోతున్నారు. కంటి శస్త్ర చికిత్సలలో గుడ్డివాళ్లవుతున్నారు. డయేరియా, మలే రియాతో చనిపోతున్నారు. సామూహిక లైంగిక అత్యా చారాలకు గురవుతున్నారు. మార్కెట్‌ కొనుగోలు శక్తి లేని ఆదివాసీ, ముస్లిం, దళిత, బడుగు వర్గాలందరూ  నేరపూరిత నిర్లక్ష్యానికి గురై చనిపోవడం రాజ్యం లక్ష్యం. వాళ్ల పక్షం వహించే ప్రజాస్వామ్య శక్తుల, వ్యక్తుల విష యంలో కూడా రాజ్యం వైఖరి అదే. వాళ్లు సహజ మర ణాలకు గురవుతారు. కోర్టు హత్యలకు గురవుతారు. జైళ్లలో చంపబడతారు.

ఒక్కరోజు ఓటు బిచ్చగాడు అధికారానికి వచ్చి మిగిలిన కాలమంతా ఓటర్లను బిచ్చగాళ్లుగా మార్చాలని పథకాలు రచిస్తున్న కాలంలో జైల్లో సాయిబాబా కూడా తన డాక్టర్లు రాసిచ్చిన, తనవాళ్లు తెచ్చిన ప్రాణాల్ని కాపాడే మందుల కోసం, చలి నుంచి కాచుకునే దుప్పటి కోసం బిచ్చగాడుగా మళ్లీ మళ్లీ అడుక్కోవాల్సి వస్తున్నది. మందులు, ఉన్ని దుప్పటి జైలు గేటుకు చేరుతాయి. అవి ఆయన కుటుంబ సభ్యులు, ప్రతివారం కలిసే న్యాయ వాది తెచ్చి ఇస్తారు. కానీ అవి జైలు ఆఫీసు గేటు దాటి అండాసెల్‌లోని సాయిబాబాకు చేరవు. అండాసెల్‌ 2వ ప్రపంచ యుద్ధకాలపు గ్యాస్‌ చాంబర్‌ ఏమీ కాదు. జీవిత ఖైదు అయినా సరే ఎంతటి తీవ్రవాది, దేశ ద్రోహి అయినా జీవించే హక్కును సుప్రీంకోర్టు ఆఖరున రాష్ట్ర పతి కూడా అట్లా ఆదేశిస్తే తప్ప కోల్పోరు. బతికి ఉన్న సాయిబాబాపై ఈ బ్లాంకెట్‌ నిషేధాన్ని, బతికే హక్కును హరిస్తున్న అతి తీవ్రమైన నేరంగా ఎంచి ప్రతిఘటించ డానికి ప్రజాస్వామ్య శక్తులన్నీ సంఘటిత పోరాటం చేయాలి. సాయిబాబా వంటి వాళ్లను కాపాడుకోవాలి. బ్లాంకెట్‌ అనే మాట తెలుగులో ఉన్ని దుప్పటి అని వాడు తాము. నాగపూర్‌ జైల్లో ఆరడుగుల మూడు అంగుళాల బెడ్‌షీట్‌ మాత్రమే అనుమతిస్తారు. (పెద్దదైతే ఉరి పెట్టు కుంటారనే భయంతో) ఉన్ని దుప్పటి ఇవ్వరు. ఇంగ్లిష్‌లో బ్లాంకెట్‌–శబ్దానికి మొత్తంగా అనే అర్థం కూడా ఉంది. మొత్తంగానే ఈ నిరాకరణ సాయిబాబా జీవించే హక్కునే నిరాకరిస్తున్నది, నిషేధిస్తున్నది.

వరవరరావు
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement