రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత
ఆరిలోవ (విశాఖ తూర్పు): మత్తు పదార్థాలకు అలవాటుపడి ఖైదు అనుభవిస్తున్నవారి కోసం జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఆమెకు జైలు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్, అదనపు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి ఆమె జైలు లోపల పర్యవేక్షించారు. ఖైదీలు ఉండే బేరక్‌లను పరిశీలించారు.
అనంతరం జైలు బయట ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. జైలు గంజాయి ముద్దాయిలతో నిండిపోయిందన్నారు. వారిలో మంచి మార్పు తీసుకురావడానికి జైళ్లలో 20 నుంచి 30 పడకలతో కూడిన డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుపై దృష్టి పెడతామని చెప్పారు. అసలైన గంజాయి సరఫరా చేయించిన వారిని వదిలేసి అమాయక గిరిజనులను పోలీసులు పట్టుకుని జైళ్లలో పెట్టారన్నారు. గంజాయి ముద్దాయిలకు బెయిల్ మంజూరులో ఆటంకంగా నిలిచిన షూరిటీ గురించి లీగల్‌గా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చిస్తానన్నారు.
జైలు సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జోనల్ ట్రాన్స్‌ఫర్లకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగేటట్లు చర్యలు చేపడతామన్నారు. ఖైదీలకు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా క్షమాభిక్ష ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది ఖైదీలకు క్షమాభిక్ష కలి్పస్తామన్నారు. ఖైదీల ఆరోగ్యంపై మరింత దృష్టిపెడతామని, ఆరోగ్యశ్రీ సక్రమంగా వర్తించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టిన వారిపైన, ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిపైన దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment