7 గంటలకు.. ఉరిశిక్ష అమలు | Nagpur Central Jail Memon To Hanging clam | Sakshi
Sakshi News home page

7 గంటలకు.. ఉరిశిక్ష అమలు

Published Fri, Jul 31 2015 1:47 AM | Last Updated on Mon, Aug 27 2018 8:24 PM

మెమన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు జైలుకొస్తున్న ఆయన సోదరులు - Sakshi

మెమన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు జైలుకొస్తున్న ఆయన సోదరులు

నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్‌కు ఉరి బిగింపు    
* కూతుర్ని చూడాలని చివరి కోరిక
* సాధ్యం కాకపోవడంతో.. ఫోన్లో మాట్లాడించిన అధికారులు
* ముందు రోజు రాత్రి అన్నను చూడగానే ఉద్వేగభరితం
* ముంబై పేలుళ్ల కేసులో ఇది తొలి మరణ శిక్ష
* సోదరుడికి మృతదేహం అప్పగింత
* ముంబైలో అంత్యక్రియలు; ముంబై, నాగపూర్‌లలో భారీ భద్రత

నాగపూర్/న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు గురువారం ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మరణశిక్ష అమలు చేశారు.

ఆయన ప్రాణాలు కాపాడేందుకు చివరి నిమిషం వరకు మెమన్ తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో పేర్కొన్న విధంగా జూలై 30 ఉదయం సరిగ్గా ఏడుగంటలకు యాకూబ్ మెమన్(53)ను ఉరి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని యాకూబ్ సోదరుడు సులేమాన్, దగ్గరి బంధువు ఉస్మాన్‌లకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని ముంబై తీసుకువచ్చారు. బంధుమిత్రుల సమక్షంలో ముంబై మెరైన్ లైన్స్‌లోని శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మరణశిక్ష అమలైన మొదటి దోషి యాకూబ్ మెమనే. ఉరిశిక్ష అమలైన జూలై 30వ తేదీ యాకూబ్ మెమన్ జన్మదినం కూడా.
 
‘ఉదయం సరిగ్గా 7 గంటలకు మెమన్‌ను ఉరితీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ప్రతినిధులకు సందేశం పంపించారు. మృతదేహాన్ని తమకు అప్పగించాల్సిందిగా యాకూబ్ సోదరుడు సులేమాన్ నాగపూర్ జైలు అధికారులను బుధవారం రాత్రి లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. మెమన్ ఉరిపై స్టే విధిచేందుకు బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించిన అనంతరం.. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ఇద్దరూ క్షమాభిక్షకు నిరాకరించిన తరువాత.. చివరి ప్రయత్నంగా మెమన్ లాయర్లు బుధవారం అర్ధరాత్రి మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు.

సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి, తెల్లవారుజామున 3.20 నుంచి 4.50 వరకు సాగిన విచారణ అనంతరం ఉరివైపే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. ఉరిశిక్ష అమలును నిలిపేయడం న్యాయ అధిక్షేపణే అవుతుందంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అప్పటికే నాగపూర్ సెంట్రల్‌జైలులో పూర్తి సన్నద్ధంగా ఉన్న అధికారులు మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేశారు.  పుణేలోని ఎరవాడ జైళ్లో పాక్ ఉగ్రవాది  అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన జైలు కానిస్టేబులే మెమన్‌ను కూడా ఉరితీశాడు. నాగపూర్ జైల్లో ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు వారం క్రితం ఎరవాడ జైలు నుంచి వచ్చిన 20 మంది బృందంలో ఆయన కూడా ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా అధికారులు ఆయన వివరాలను వెల్లడించలేదు.

కసబ్ ఉరి సమయంలో ఎరవాడ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న యోగేశ్ దేశాయిని ప్రత్యేకంగా మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసేందుకే నాగపూర్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారని సమాచారం. మహారాష్ట్రలో ఎరవాడ, నాగపూర్ జైళ్లలోనే ఉరిశిక్ష అమలు చేసే సదుపాయం ఉంది. టాడా కోర్టు విధించిన మరణశిక్షను సమర్థిస్తూ 2013లో సుప్రీంకోర్టు .. ‘ముంబై పేలుళ్ల వెనుక చోదకశక్తి’గా మెమన్‌ను అభివర్ణించిన విషయం గమనార్హం. ఇదే కేసులో దోషిగా తేలిన మెమన్ సోదరుడు ఎస్సా, వదిన రుబీనా ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగా.. కీలక సూత్రధారులైన టైగర్ మెమన్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లో తలదాచుకున్నట్లు సమాచారం.
 
ఉరికంబంపై..: 2012 నవంబర్ 21న మహారాష్ట్రలోని ఎరవాడ జైళ్లో కసబ్‌ను ఉరికంబం ఎక్కించారు. కొన్ని నెలల తరువాత 2013, ఫిబ్రవరి 9న ఢిల్లీలోని తీహార్ జైళ్లో పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటగా మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి నాథూరాం గాడ్సే, నారాయణఆప్టేలను ఉరితీశారు. వారిని 1949, నవంబర్ 15న పంజాబ్‌లోని అంబాల జైళ్లో ఉరితీశారు. మాజీ ప్రధాని ఇంది రాగాంధీ హత్య కేసులో దోషులు సత్వంత్ సింగ్, కేహార్ సింగ్‌లకు 1989, జనవరి 6న మరణశిక్ష విధించారు.

భారత్‌లో మరణశిక్షను రద్దు చేయాలంటూ దశాబ్దాలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. 2007లో ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను నిషేధించాలన్న ఐరాస ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 2012లోనూ ఐరాస ముందు అదే వైఖరిని స్పష్టంచేసింది. కాగా మెమన్ ఉరిని కశ్మీర్ వేర్పాటువాద హురియత్ సంస్థ నేతలు ఖండించారు.
 
వారికీ ఇదే గతి పట్టాలి..
సాక్షి, ముంబై: మెమన్‌ను ఉరితీయడంపై 1993 ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది చట్టం సాధించిన విజయమన్నారు. పేలుళ్ల సూత్రధారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌లకు కూడా ఇదే గతి పట్టాలని ఆకాంక్షించారు.
 
ఇప్పటివరకు 24..
1864లో ఆంగ్లేయుల పాలనలో స్థాపించిన నాగపూర్ సెంట్రల్ జైల్‌లో ఉరిశిక్ష అమలైన వారి సంఖ్య నేటికి 24కు చేరింది. ఇక్కడ 1984 నవంబర్ అయిదవ తేదీ చివరిసారిగా ఉరిశిక్ష అమలైంది. ఓ హత్య కేసులో మహారాష్ట్రలోని అమరావతికి చెందిన వాంఖడే సోదరులకు ఇదే జైల్లో ఉరిశిక్ష వేశారు. యాకూబ్ మెమన్ ఉరితో మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 58 మందికి మరణశిక్ష అమలు చేశారు.
 
చివరి 3 గంటలు..!
ఒకవైపు, మెమన్ ఉరిని ఆపేందుకు దేశ రాజధానిలోని అత్యున్నత న్యాయస్థానంలో ఆఖరి ప్రయత్నాలు సాగుతుండగానే.. అక్కడికి 1050 కి.మీ.ల దూరంలో ఉన్న నాగపూర్(మహారాష్ట్ర) సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
 
ఆ టైమ్‌లైన్..

తెల్లవారుజామున 4 గంటలు: ఒంటరిగా జైలుగదిలో ఉన్న యాకూబ్ మెమన్ వద్దకు జైలు అధికారులు వచ్చారు.
 4.15: మెమన్ స్నానానికి వెళ్లారు.
 4.30: ఆయనకు కొత్త దుస్తులు అందించారు.
 4.45: అల్పాహారం అందించారు.
 5.00: డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
 5.30: ప్రార్థన చేశారు. ఖురాన్ పఠించారు.
 6.00: పక్కనున్న మరో సెల్‌లోకి మార్చారు.
 6.15: ఉరికంబాన్ని, అక్కడి పీఠాన్ని, ఉరి బిగించడానికి ఉపయోగించే తాడు సామర్ధ్యాన్ని  జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి, అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ పరీక్షించారు.
 6.30: నల్లని మందపాటి వస్త్రాన్ని ముఖానికి కప్పి, ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు.
 6.45: టాడా కోర్టు తీర్పులోని అమలు భాగాన్ని నాగపూర్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్(సీజేఎం) చదివి వినిపించారు.
 6.50: ఉరితీయడానికి ఉద్దేశించిన పీఠంపై నిల్చోబెట్టారు. మెడ చుట్టూ ఉరితాడు బిగించారు.
 6.55: ఉరికంబంపై అన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా? అని తలారి, జైలుఅధికారులు పరీక్షించారు.
 7.00: ఉరి తీయాలంటూ సీజేఎం సంజ్ఞ చేశారు. వెంటనే తలారి తన చేతిలోని లివర్‌ను లాగారు.
 7.30: నిబంధనల ప్రకారం అరగంట పాటు ఉరి కంబానికి వేలాడదీశాక మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం వైద్యులు పరీక్షించి మరణించినట్లుగా నిర్ధారించారు.

పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శవపేటికలో ఉంచి, యాకూబ్ సోదరుడు సులేమాన్‌కు అప్పగించారు.
 
‘అన్ని అవకాశాలు పొందాడు’
వివిధ వేదికలపై తన వాదనలను వినిపించుకునే అన్ని అవకాశాలను యాకూబ్ మెమన్ పొందారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంలాంటి అంశాల్లో అంతా ఐక్యంగా ఉండాలన్నారు. ‘ఉగ్రవాదాన్ని ఒక సవాలుగా స్వీకరించాలి. ఐక్యగళం వినిపించాలి. అప్పుడే దాన్ని అంతం చేయగలం’ అని గురువారం విలేకరులతో వ్యాఖ్యానించారు. ‘ఒక క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు తెల్లవారుజామున విచారించడం ప్రపంచంలోనే తొలిసారి కావచ్చు. మరే వ్యవస్థలోనూ ఇంత పారదర్శకత ఉండదు.’ అని ఆయన అన్నారు.
 
అంత తొందరేంటి?: ప్రశాంత్ భూషణ్
యాకూబ్ మెమన్‌ను ఉరితీసేందుకు అంత అసాధారణ తొందరపాటు ఎందుకని సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నించారు. ఇది రాజ్యం చేసిన ప్రతిహింస అని అధిక్షేపించారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసే అవకాశం మెమన్‌కు ఇవ్వలేదని ఆక్షేపించారు. మెమన్‌కు మద్దతుగా బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుప్రీంకోర్టులో వాదించిన లాయర్లలో భూషణ్ ఒకరు. ‘దర్యాప్తు అధికారులతో మెమన్ సహకరించాడు. సుప్రీంకోర్టు మెమన్‌కు విధించిన శిక్షను తగ్గిస్తే బావుండేది’ అని అభిప్రాయపడ్డారు.
 
ఆ ముగ్గురికి భద్రత పెంపు
న్యూఢిల్లీ: మెమన్ ఉరిపై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన త్రిసభ్య ధర్మాసనం సభ్యులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్, అమితవ రాయ్‌లకు భద్రతను పెంచారు. వీరి నివాసాల వద్ద బందోబస్తులో ఉండే పోలీసుల సంఖ్య పెంచడమే కాకుండా జడ్జిల నివాసప్రాంతంలో గస్తీని ముమ్మరం చేసినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మొహరించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement