జైళ్లలో ‘పే ఫోన్’ సౌకర్యం | Jails facility 'pay phone' | Sakshi
Sakshi News home page

జైళ్లలో ‘పే ఫోన్’ సౌకర్యం

Published Fri, May 2 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 AM

Jails facility  'pay phone'

 సాక్షి, ముంబై : జైలులో గడిపే ఖైదీలకు వారి కుటుంబీకులతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఫే ఫోన్’ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఠాణే, తలోజా సెంట్రల్ జైళ్లలో ప్రవేశపెట్టిన ఈ పథకం సఫలీకృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో అమలుచేయనున్నారు. ఈ విషయంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ముంబై హైకోర్టుకు అన్ని వివరాలు తెలిపింది. హై కోర్టుకు అందించిన వివరాల మేరకు పశ్చిమ బెంగాల్, కర్ణాటక  రాష్ట్రాల్లో జైళ్లలోని ఖైదీలకు తమ కుటుంబీకులతో మాట్లాడేందుకు ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఖైదీలకు కూడా ఇలాంటి సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ముందుగా ప్రయోగాత్మకంగా ఠాణే, తలోజా జైళ్లలో మూడు నెలల కోసం ఈ పే ఫోన్ పథకాన్ని అమలుచేస్తోంది. అదేవిధంగా తొందర్లోనే నాగపూర్ సెంట్రల్ జైల్లో కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు, నాసిక్ జైలులోని అఫ్తాబ్ సయ్యద్ శేఖ్, జావేద్ అహ్మద్ మాజిద్ అనే ఇద్దరు ఖైదీలు ప్రజావ్యాజ్యం వేశారు. ఈ విషయం న్యాయమూర్తి అనుజా ప్రభుదేశాయ్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పే ఫోన్ పథకం గురించి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలు అందించింది. అయితే ఈ పే ఫోన్ సౌకర్యాన్ని ప్రస్తుతం కొందరు ఖైదీలు మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.  స్వల్ప నేరారోపణలున్న ఖైదీలకు మాత్రమే ఈ పే ఫోన్ వినియోగించుకునేందుకు అనుమతించారు. కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్ర నేరారోపణలు ఉన్న ఖైదీలను ఈ పథకానికి దూరంగా ఉంచారు. కాగా, ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే సదరు ఖైదీ ముందు తాను ఎవరెవరికి ఫోన్ చేస్తాననేది జైలు అధికారులకు సమాచారమివ్వాల్సి ఉంటుంది. అలాగే రోజూ నిర్ణీత సమయంలోనే ఖైదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఈ పే ఫోన్ విషయంపై మళ్లీ ఆగస్టులో విచారణ జరగనుంది. దీంతో అంతవరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం సఫలీకృతమయ్యిందా లేదా అనేది కూడా తెలియనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement