
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ నాపై మోపిన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకున్నప్పటికీ దుర్బేధ్యమైన నాగ్‌పూర్ జైలులో పేరుమోసిన అండా సెల్‌లో 2017 మార్చి 7 నుంచి నన్ను నిర్బంధించారు. అండాసెల్ అనేది నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో అత్యంత అమానుషమైన గరిష్టభద్రతావలయంలోని బ్యారక్. అప్పటికే 90 శాతం అంగవైకల్యంతో కూడిన నా శారీరక ఆరోగ్యం గత 21 నెలలు నిర్బంధకాలంలో మరింతగా క్షీణించిపోయింది. తీవ్ర స్వభావంతో కూడిన 19 వ్యాధులు నన్ను కబళిస్తుండగా జైలులో ఎలాంటి వైద్య చికిత్సను అధికారులు నాకు కల్పించడం లేదు. వైద్య కారణాలతో నేను పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ 2018 మార్చి 8 నుంచి బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందు పెండింగులో ఉంది.
తీవ్రమైన నొప్పితో నేను బాధపడుతున్నప్పటికీ నా శారీరక పరిస్థితి పట్ల అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గత 8 నెలలుగా నా బెయిల్ పిటిషన్‌పై వరుసగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అక్టోబర్ 6న నా బెయిల్ పిటిషన్‌పై విచారణ మరో ఆరు వారాలకు వాయిదా పడింది. ఈ సందర్భంగా నా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వైద్య రికార్డులన్నింటినీ తనకు సమర్పించవలసిందిగా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్ ప్రధాన వైద్యాధికారిని న్యాయస్థానం ఆదేశించింది. నా దిగజారిపోయిన ఆరోగ్య పరిస్థితిని నిగ్గుతేల్చడానికి కోర్టు ఆదేశం ఉపయోగపడవచ్చు. నా ఆరోగ్యానికి సంబంధించి జైలు అధికారులు ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్య ధోరణి, ఎలాంటి పరీక్షలూ జరపకపోవడం, సరైన చికిత్స అందించకపోవడం వంటి అంశాలపై నిజాలు బయటకి రావచ్చు. నా సీనియర్ న్యాయవాదులు, ఫ్యామిలీ డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు నా మెడికల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందించి దాన్ని వీలైనంత త్వరగా హైకోర్టు ముందుంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
నేను ఉంటున్న జైలు గది నిర్మాణం నన్ను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తోంది. ఏ రకంగాకూడా బయటిప్రపంచంతో నాకు సంబంధం లేదు. ముడుతలుపడ్డ చర్మం, క్షీణించిన ఎముకలతో నా పరిస్థితి పడకేసిన ముదుసలి స్థాయికి దిగజారిపోయింది. అండాసెల్ లోపల వీల్ చెయిర్‌తో నేను టాయిలెట్‌కి కూడా పోలేను. మూత్రవిసర్జన చేయాలన్నా, స్నానం చేయాలన్నా సరే ఇద్దరు మనుషులు నన్ను ఎత్తుకెళ్లాల్సి వస్తోంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తితో ఎలా వ్యవహరిం చాలో కూడా జైలు అధికారులకు తెలియకపోవడమే కాకుండా, వారు సరైన చికిత్స విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కదలడానికి కూడా వీలులేని అండా సెల్‌లో మగ్గిపోతున్నాను.
సెప్టెంబర్ 21, 2018న నాకు సీటీ బ్రెయిన్, సీటీ ఆంజియోగ్రఫీ టెస్టులను తులనాత్మక అధ్యయనం కోసం నిర్వహించారు. హైకోర్టు ఆదేశం ప్రకారం తొలిసారిగా నా సహచరి వసంతను ఆసుపత్రిలో నా పక్కన ఉండేందుకు అనుమతించారు. అక్కడ రేడియాలజీ విభాగం వైద్యులు హై రిస్క్ కన్ సెంట్ పేరిట ఒక పత్రంపై సంతకం చేయమని అడిగారు. అంటే మెదడుకు, గుండె వ్యాధికి నేను తీసుకుంటున్న మందులు తీవ్ర పరిస్థితికి దారి తీయనున్నాయని, చివరకు నాకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉందని దాని సారాంశం. చికిత్స ద్వారా తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా నేను సిద్ధంగా ఉండాలని దీనర్థం. దాని రియాక్షన్ గంటలు, రోజుల వ్యవధిలో కూడా ప్రభావం చూపవచ్చు. నా ప్రస్తుత పరిస్థితికి దీర్ఘకాలిక చికిత్స అవసరం కాబట్టి నేను జైలుజీవితం గడిపినంత కాలం నా సహచరి నా పక్కన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో జైలు అధికారులు, హైకోర్టు కూడా తగు న్యాయం చేయాలని అర్థిస్తున్నాను. అత్యంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ప్రాతిపదికన నాకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాను.
(మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్ష గడువుతున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ తన సహచరి వసంతకు ఇటీవల రాసిన లేఖ సంక్షిప్త పాఠం)
వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్, జైలు ఖైదీ
జీఎన్ సాయిబాబ
Comments
Please login to add a commentAdd a comment