IGNOU: అత్యున్నత ఓపెన్‌ వర్సిటీ | Indira Gandhi National Open University Formation Day: History, Courses | Sakshi
Sakshi News home page

IGNOU: అత్యున్నత ఓపెన్‌ వర్సిటీ

Published Sat, Nov 19 2022 12:22 PM | Last Updated on Sat, Nov 19 2022 12:23 PM

Indira Gandhi National Open University Formation Day: History, Courses - Sakshi

ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన ‘ఇందిరా గాంధి నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ’ (ఇగ్నో) సమాజంలోని వెనుకబడిన వర్గాలకు దూర విద్య ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తోంది. భారతదేశంలో సార్వత్రిక దూర విద్యను ప్రోత్సహించటం, సమ న్వయం చేయడం, మంచి ప్రమాణాలను నెల కొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారత దేశ మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన – పరిశోధనలతో పాటు... విస్తరణ, శిక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఇగ్నో పని చేస్తోంది. 

భారత మొదటి మహిళా ప్రధాన మంత్రి  ఇందిరా గాంధీ పేరు మీద ఆమె జన్మదినం నవంబర్‌ 19న 1985లో నెలకొల్పిన ఈ యూనివర్సిటీ... ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సేవలు అంది స్తోంది. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్థులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో ప్రవేశాలు పొందినవారే. 226కు పైగా అకాడెమిక్‌ ప్రోగ్రాంలు, మరికొన్ని ఆన్‌ లైన్‌ ప్రోగ్రాములే కాకుండా ‘స్వయం’ మూక్స్‌ ద్వారా కూడా విద్యను అందిస్తోంది ఇగ్నో. భారత దేశ దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్‌ జి. రామ్‌ రెడ్డి ఇగ్నో మొదటి ఉపకులపతిగా సేవలు అందిచటం మన తెలుగువారికి గర్వకారణం. 

మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీలకు (ఎంపిక చేసిన) సంబంధిచిన ట్యూషన్‌ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇస్తూ... మామూలు రెగ్యులర్‌ విద్యా లయాల్లో చేరి చదువుకోలేని లక్షలాదిమంది బడుగు, బలహీన, పేద విద్యార్థులకు ఇగ్నో ఉదారంగా విద్యనందిస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్, ఉపాధిని కలిపించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్‌ ప్రోగ్రాములను అభ్యసించిన ఇగ్నో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు పొందు తున్నారు.

ఢిల్లీలోని మెయిన్‌ క్యాంపస్‌లోనే కాక... వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్‌ క్యాంపస్సుల్లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి, అనేక కంపెనీలు ఇగ్నో విద్యార్థులను రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. ఈ విధంగా రెగ్యులర్‌ యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోకుండా... కొన్నిసార్లు వాటికన్నా మిన్నగా విద్యా, ఉపాధి అవకాశాలను అందిస్తోంది ఇగ్నో. మార్చి 2022 లో వెబ్‌మెట్రిక్‌ ప్రమాణాల ర్యాంకింగ్‌లో ఇగ్నో 247వ స్థానంలో నిలిచి తన సత్తా చాటడం ముదావహం. (క్లిక్ చేయండి: ‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?)

- డాక్టర్‌ శ్రవణ్‌ కుమార్‌ కందగట్ల 
అకడమిక్‌ కౌన్సిలర్, ఇగ్నో          
(నవంబర్‌ 19న ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ ఆవిర్భావ దినం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement