IGNOU
-
IGNOU: అత్యున్నత ఓపెన్ వర్సిటీ
ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన ‘ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ’ (ఇగ్నో) సమాజంలోని వెనుకబడిన వర్గాలకు దూర విద్య ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తోంది. భారతదేశంలో సార్వత్రిక దూర విద్యను ప్రోత్సహించటం, సమ న్వయం చేయడం, మంచి ప్రమాణాలను నెల కొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారత దేశ మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన – పరిశోధనలతో పాటు... విస్తరణ, శిక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఇగ్నో పని చేస్తోంది. భారత మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరు మీద ఆమె జన్మదినం నవంబర్ 19న 1985లో నెలకొల్పిన ఈ యూనివర్సిటీ... ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సేవలు అంది స్తోంది. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్థులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో ప్రవేశాలు పొందినవారే. 226కు పైగా అకాడెమిక్ ప్రోగ్రాంలు, మరికొన్ని ఆన్ లైన్ ప్రోగ్రాములే కాకుండా ‘స్వయం’ మూక్స్ ద్వారా కూడా విద్యను అందిస్తోంది ఇగ్నో. భారత దేశ దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి ఇగ్నో మొదటి ఉపకులపతిగా సేవలు అందిచటం మన తెలుగువారికి గర్వకారణం. మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీలకు (ఎంపిక చేసిన) సంబంధిచిన ట్యూషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇస్తూ... మామూలు రెగ్యులర్ విద్యా లయాల్లో చేరి చదువుకోలేని లక్షలాదిమంది బడుగు, బలహీన, పేద విద్యార్థులకు ఇగ్నో ఉదారంగా విద్యనందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధిని కలిపించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్ ప్రోగ్రాములను అభ్యసించిన ఇగ్నో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు పొందు తున్నారు. ఢిల్లీలోని మెయిన్ క్యాంపస్‌లోనే కాక... వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్ క్యాంపస్సుల్లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి, అనేక కంపెనీలు ఇగ్నో విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ విధంగా రెగ్యులర్ యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోకుండా... కొన్నిసార్లు వాటికన్నా మిన్నగా విద్యా, ఉపాధి అవకాశాలను అందిస్తోంది ఇగ్నో. మార్చి 2022 లో వెబ్మెట్రిక్ ప్రమాణాల ర్యాంకింగ్‌లో ఇగ్నో 247వ స్థానంలో నిలిచి తన సత్తా చాటడం ముదావహం. (క్లిక్ చేయండి: ‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?) - డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల అకడమిక్ కౌన్సిలర్, ఇగ్నో (నవంబర్ 19న ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావ దినం) -
ఇగ్నోలో కోర్సులకు ఫీరియింబర్స్‌మెంట్
సాక్షి, హైదరాబాద్ : ఇగ్నో (ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం) 2018 విద్యాసంవత్సరానికి దూరవిద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజును రీయింబర్స్ చేయనున్నట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ ప్రొగ్రాంలకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఫీరీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. దరఖాస్తులకు చివరి తేది జనవరి 31. అభ్యర్థులు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రం ఫీజును ముందుగా చెల్లించాలనీ, ప్రవేశాల ప్రక్రియ ముగిసిన తరువాత వారి ఫీజును తిరిగి చెల్లిస్తామని ఇగ్నో అధికారులు తెలిపారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్నుంచి అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తుతో పాటు కులధ్రువీకరణ పత్రాలను జత చేసి పంపాలి. మిగతా వివరాలకు www.ignou.ac.in ను సంప్రదించవచ్చు. -
రవి అయ్యగారికి ఇగ్నో ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ టెలివిజన్ నిర్మాత, రీసెర్చ్ స్కాలర్ రవి అయ్యగారిని వరించింది. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో ప్రొఫెసర్ డీ.పీ సింగ్ చేతుల మీదుగా రవికి ఈ అవార్డును బహూకరించారు. అన్లైన్లోనే బోధించడం, నేర్చుకోవడం అనే అంశంపై సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ)లో వినూత్న అప్లికేషన్ని డెవలప్ చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలో నామినేటెడ్ సభ్యుడు గా రవి కొనసాగుతున్నారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో విజన్ 2020 ప్రాజెక్టులో కలిసి పని చేశారు. -
ఇగ్నో నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న ఖైదీ
న్యూఢిల్లీ: కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. అన్న చందంగా పదేళ్ల జైలు శిక్ష పడిన ఓ ఖైదీ.. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) నుంచి బంగారు పతకం సాధించాడు. వారణాసి సెంట్రల్ జైల్లో 2012 ఫిబ్రవరి నుంచి శిక్ష అనుభవిస్తున్న అజిత్ కుమార్ సరోజ్ (23) అనే ఖైదీ ఇగ్నో నిర్వహించిన పర్యాటక విద్యా డిప్లొమాలో ప్రథమస్థానంలో నిలిచాడు. శనివారం జరిగిన వర్సిటీ స్నాతకోత్సవంలో అజిత్‌కు పసిడి పతకాన్ని బహూకరించారు. ఇదే కాకుండా అజిత్ శిక్షాకాలంలో మానవ హక్కులు, విపత్తు నిర్వహణ, ఎన్జీవో మేనేజ్మెంట్, ఫుడ్, న్యూట్రిషన్ తదితర కోర్సులు పూర్తి చేశాడు. వీటిలో దాదాపు 65 శాతం పైన మార్కులు తెచ్చుకున్నాడని అధ్యాపకులు అభినందించారు. ఇగ్నోకు సంబంధించి వారణాసి రీజియన్‌లో ఉన్న 20 జిల్లాల్లోని ఆరువేల మంది విద్యార్థుల్లో అజిత్‌కు మాత్రమే గోల్డ్ మెడల్ దక్కడం విశేషమని ప్రశంసించారు. -
ఇగ్నోలో ఇక ఆన్లైన్ అడ్మిషన్లు
న్యూఢిల్లీ: విద్యార్థులకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు గాను ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ఆన్లైన్ అడ్మిషన్ వ్యవస్థ(ఓఏఎస్)ను ప్రారంభించింది. ఈ ఆన్లైన్ వ్యవస్థను గురువారం ఇగ్నో తాత్కాలిక ఉప కులపతి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇగ్నోలో వివిధ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవస్థ ద్వారా ఇక ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇగ్నోలోని 148 కోర్సులకు జూలై 2015 అడ్మిషన్ సెషన్లో ప్రవేశాలకు ఈ వ్యవస్థ అందుబాటులో ఉంటుందన్నారు. ఇగ్నో వెబ్సైట్ (www.ignou.ac.in) ద్వారా ఆన్లైన్ ప్రవేశాలు పొందవచ్చని, పీజీ కోర్సులకు జూన్ 15 ఆఖరు తేదీ అని, ఆలస్య రుసుముతో జూన్ 30 వరకూ గడువుందని తెలిపారు.