మాట్లాడుతున్న గీతం వీసీ ప్రసాదరావు.
సాగర్‌నగర్ (విశాఖ తూర్పు): ఉన్నత విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఏపీలోని విశాఖపట్నంలో ఉన్న గీతం యూని వర్సిటీకి అటానమస్ (స్వయంప్రతిపత్తి) హోదా కల్పించింది. అలాగే కేటగిరీ– 1 విద్యా సంస్థగా గుర్తింపు ఇచ్చిందని గీతం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎం.ఎస్. ప్రసాదరావు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 60 విద్యా సంస్థలకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించగా డీమ్డ్ వర్సిటీల్లో గీతం కేటగిరీ–1 కింద స్వయంప్రతిపత్తి హోదా పొందిందన్నారు.
2007లో డీమ్డ్ వర్సిటీ హోదాను పొందిన గీతం విశాఖతోపాటు హైదరాబాద్, బెంగళూరుల్లో ప్రాంగణాలను నెలకొల్పిందని, మొత్తం 190 యూజీ, పీజీ కోర్సులను నిర్వహిస్తోందని తెలిపారు. ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, మెడిసిన్, నర్సింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, సైన్స్, సోషల్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో 21వేల మందికిపైగా విద్యార్థులు అభ్యసిస్తున్నారని వివరించారు. దూర విద్య విభాగం ద్వారా 80వేల మంది వివిధ కోర్సులు చదువుతున్నారని పేర్కొన్నారు. బార్క్, డీఆర్‌డీవో, డీబీటీ, డీఎస్‌టీ వంటి వాటి సహకారంతో 150కి పైగా పరిశోధన ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామన్నారు.
అటానమస్ హోదాతో పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రారంభించొచ్చని, యూజీసీ అనుమతుల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉండదన్నారు. అటానమస్ హోదాతో ఇతర రాష్ట్రాల్లో గీతం ప్రాంగణాలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తామని, పరిశోధన కేంద్రాలు, ఇంక్యుబేషన్ సెంటర్‌లను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో రష్యాలోని సెయింట్‌బర్గ్ మెరైన్ టెక్నికల్ విశ్వవిద్యాలయంతో కలసి నౌకా నిర్మాణం, సముద్ర వాహక నౌకల తయారీపై కోర్సులు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment