గాడి తప్పిన దూరవిద్య
–పర్యవేక్షణలో అధికారులు విఫలం
–పరీక్షల షెడ్యూల్ ప్రకటించని వైనం
ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం గాడి తప్పింది. పరీక్షల షెడ్యూల్ ప్రకటన, నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర అంశాలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం నిర్వహించడంలేదు. ఫలితంగా విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో పూర్తి చేసినా ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు. పీజీ రెండో సంవత్సరం పరీక్షలు, డిగ్రీ రెండు , మూడో సంవత్సరం పరీక్షలు ఎపుడు నిర్వహిస్తారో తెలియదు.
పీసీపీ తరగతులు నిర్వహించని వైనం
రెండు తెలుగు రాష్ట్రాల్లో 233 అధ్యయన కేంద్రాల ద్వారా విద్యార్థులు డిగ్రీ కోర్సును అభ్యసిస్తున్నారు. ద్వితీయ, తతీయ విద్యార్థులకు తప్పనిసరిగా పర్సనల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్‌ను ప్రతి వారాంతంలో నిర్వహించాలి. దీనిని దూరవిద్య అధికారులు పర్యవేక్షించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తరగతుల నిర్వహణకు ఒక్కో డిగ్రీ అడ్మిషన్ మీద 20 శాతం ఖర్చును అధ్యయన కేంద్రాల వారికి దూరవిద్య అధికారులు నేరుగా చెల్లిస్తున్నారు. కానీ ఎలాంటి తరగతులు నిర్వహించలేదు. పీసీపీ తరగతులు ఉన్నాయన్న సంగతి విద్యార్థులకు కూడా తెలియకపోవడం ఇందుకు నిదర్శనం .
కోర్సులు లేకున్నా ప్రాక్టికల్ పరీక్షలు ..
దూరవిద్య అధ్యయన కేంద్రాల నిర్వాహకులు పీసీపీ తరగతులు, ప్రాక్టికల్ , రాత పరీక్షలు ఏ డిగ్రీ కళాశాలో నిర్వహిస్తారో ముందే వెల్లడించాల్సి ఉంది. కొన్ని డిగ్రీ కళాశాల్లో బీఎస్సీ కోర్సులు లేకపోయినప్పటికీ సైన్స్ పరీక్షలకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తుండడం వివాదాలకు దారితీస్తోంది. అధ్యయన కేంద్రాల్లో నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు వర్సిటీ దూరవిద్య అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉన్నా, పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రాక్టికల్ మార్కులు నిర్ధారించి నేరుగా దూరవిద్య విభాగానికి అధ్యయన కేంద్రాల వారు పంపుతున్నారు. ఈ పరీక్షలకు ఎంత విశ్వసనీయత ఉందనే అంశంపై అనుమానాలు లేకపోలేదు. దూరవిద్య ఆదాయంలో 20 శాతం అధ్యయన కేంద్రాల నిర్వాహకులకు చెల్లిస్తున్నపుడు కనీస ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత దూరవిద్య అధికారులపై ఉందని పులువురు అభిప్రాయపడుతున్నారు.