
దూర విద్యకు ‘లైవ్ టెక్నాలజీ’!
సెల్‌ఫోన్లో ప్రొఫెసర్ల క్లాసులు... సందేహాల నివృత్తి
పరీక్షలు, ఫలితాలు, ఫీజుల వంటి
అడ్మినిస్ట్రేషన్ సేవలు కూడా..
రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టిన హెచ్‌ఎన్‌ఐలు
‘స్కూల్‌గురు’ వ్యవస్థాపకుడు శంతను రూజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో; స్కూల్లో చదువులంటే టీచర్లుంటారు, తరగతులుంటాయి కాబట్టి సమస్యలేదు. మరి దూర విద్య సంగతేంటి? అడ్మిషన్ తీసుకోగానే ఆ విద్యా సంవత్సరానికి కావాల్సిన పుస్తకాలు అక్కడికక్కడే విద్యార్థుల చేతికిచ్చేస్తారు. అంతే!! విద్యార్థే సొంతగా చదువుకోవాలి. కొన్నిచోట్ల... అదీ పరీక్షలకు ముందు... వారానికోసారి సందేహాల నివృత్తి కోసం క్లాసులు నిర్వహిస్తుంటారు. అవి విద్యార్థులకు పూర్తిగా పనికొస్తాయని మాత్రం చెప్పలేం. అందుకే దూర విద్యలో విద్యార్థుల సంఖ్యే కాదు.. ఉత్తీర్ణత శాతమూ తక్కువే ఉంటుంది. ఈ టెక్నాలజీ శకంలోనూ ఇలా కొనసాగాల్సిందేనా? ఈ ప్రశ్నకు సమాధానమే స్కూల్‌గురు.
పేరులోనే దూర విద్య కానీ... చదువులు, టెక్నాలజీ విషయంలో ఏమాత్రం కాదని నిరూపిస్తోంది ఈ సంస్థ. 16 ఏళ్ల పాటు టెక్నాలజీ కంపెనీలు నడిపి... ఆ తరవాత విద్య వైపు వచ్చారు దీని వ్యవస్థాపకుడు శంతను రూజ్. 2012 డిసెంబర్‌లో ముంబై కేంద్రంగా ఆరంభించిన ఈ సంస్థ గురించి ‘సాక్షి’ స్టార్టప్ డైరీ ప్రతినిధితో శంతను మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
1997లో పారడైన్ అనే టెక్ కంపెనీని ప్రారంభించా. తర్వాత బ్రాడ్‌లైన్ పేరిట ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ కంపెనీ. 16 ఏళ్ల పాటు ఈ రెండూ నడిపించా. అప్పుడు అనిపించింది.. విదేశాలతో పోలిస్తే మన విద్యా విధానంలో టెక్నాలజీ వాడకం తక్కువని. డిస్టెన్స్‌లో అయితే మరీను!! ఆ ఆలోచనతోనే స్కూల్‌గురును ఆరంభించాం.
ప్రస్తుతం మా సంస్థ 8 రాష్ట్రాల్లో 12 యూనివర్సిటీలతో కలిసి పనిచేస్తోంది. గుంటూరులోని నాగార్జున వర్సిటీ, తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ, హైదరాబాద్‌లోని అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని వివిధ వర్సిటీలతో కలిసి పనిచేస్తున్నాం. పాఠ్యాంశాలను ఇంగ్లిష్‌తో పాటుగా 9 మాతృభాషల్లో అందిస్తున్నాం.
ఎలా పనిచేస్తుందంటే..
ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్ తీసుకోగానే విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలతో పాటు స్కూల్‌గురు రూపొందించిన ఓ పెన్‌డ్రైవ్‌ను కూడా ఇస్తారు. దీన్ని సెల్‌ఫోన్‌లో గానీ, డెస్క్‌టాప్‌లో గానీ ఇన్‌సెర్ట్ చేయగానే యాప్ డౌన్‌లోడ్ అయిపోతుంది. ఇందులో నుంచి సంబంధిత పాఠ్యాంశాలపై ప్రొఫెసర్ల క్లాసులను వీడియోతో సహా చూడొచ్చు. సందేహాలొస్తే నేరుగా ప్రొఫెసర్లతో లైవ్ చాట్ చేయవచ్చు. ఆయా వర్సిటీలకు సంబంధించిన ఫీజులను నేరుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించొచ్చు. పరీక్షల తేదీలు, ఫలితాలు, వర్సిటీ కార్యక్రమాలన్నీ నేరుగా సెల్‌ఫోన్ నుంచే తెలుసుకోవచ్చు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఇది ఇంటర్నెట్ లేకుండానే పనిచేస్తుంది. దీంతో మనం ఎక్కడికెళ్లినా యాప్ ద్వారా చదువుకునే వీలుంటుంది. ఇందుకోసం విద్యార్థులు ఎలాంటి ఛార్జీ చెల్లించనక్కర్లేదు. వర్సిటీలు తాము వసూలు చేసే ఫీజులో 25 శాతం సొమ్మును స్కూల్‌గురుకు చెల్లిస్తాయి.
10 మిలియన్ డాలర్లపై దృష్టి..
ఈ ఏడాది అక్టోబర్‌లో నిధులు సమీకరించాం. ఇండియా, అమెరికాలకు చెందిన ముగ్గురు అధిక నెట్‌వర్త్ కలిగిన వ్యక్తులు (హెచ్‌ఎన్‌ఐలు) కలిసి రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టారు. మరో మూడు నెలల్లో 10 మిలియన్ డాలర్లను సమీకరిస్తున్నాం. వీటితో కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, హరి యాణాలతో పాటు ఆఫ్రికాలోని పలు యూనివర్సిటీలకూ విస్తరిస్తాం. ఈ మేరకు అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయి. దూర విద్యా కేంద్రంలో చదివే విద్యార్థికి స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను కూడా అందించాలని నిర్ణయించాం. ప్రస్తుతం బెంగాల్‌లోని నేతాజీ సుభాష్ ఓపెన్ వర్సిటీలో 16 రకాల స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాం. ఈ విధానాన్ని మిగతా వర్సిటీలకూ విస్తరిస్తాం.
రూ.15 కోట్ల టర్నోవర్
ప్రస్తుతం సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులు స్కూల్‌గురు సేవల్ని వినియోగించుకుంటున్నారు. వచ్చే రెండేళ్లలో 15 లక్షల మంది విద్యార్థులకు చేరాలనేది మా లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో 150 మంది ఉద్యోగులున్నారు. రెండు నెలల్లో మరో 150 మందిని తీసుకుంటాం. గతేడాది రూ.5 కోట్ల టర్నోవర్‌కు చేరుకున్నాం. ఈ ఏడాది రూ.15 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం.