హైదరాబాద్, న్యూస్‌లైన్: ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారికి దూరవిద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు డా. బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆన్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటాయని డీఆర్‌డీఓ ఆర్‌ఏసీ చైర్మన్, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ డీఎన్ రెడ్డి సూచించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 31వ వ్యవస్థాపక దినోత్సవంసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపన్యాసం ఇస్తూ, దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో సైతం మానవ వనరుల కొరత తీవ్రంగా ఉందని చెప్పారు. ఫలితంగా విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యమైన శిక్షణ తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
మన దేశంలో పరిశోధనలకు కొదవ లేదని, ఏ దేశంతో పోల్చినా పీహెచ్‌డీ పూర్తి చేసినవారు ఇక్కడే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. అయితే వారిలో సాంకేతిక, పారిశ్రామిక నైపుణ్యాలు చాలా తక్కువగా ఉంటున్నాయని అభిప్రాయపడ్డారు. అంబేద్కర్ వర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలనూ ఆన్‌లైన్‌లో నిర్వహించడం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమేనని అన్నారు. అంతకుముందు వర్సిటీలో నిర్మించతలపెట్టిన పరీక్షల విభాగం, సీఎస్‌టీడీ భవన నిర్మాణాలకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా భూమిపూజ చేశారు. వైస్ చాన్‌సలర్ డాక్టర్ పి.ప్రకాశ్, అకాడమిక్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.వెంకటనారాయణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎ.సుధాకర్ పాల్గొన్నారు.
వర్సిటీల్లో మానవ వనరుల కొరత
Published Tue, Aug 27 2013 6:43 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement