సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్‌సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు)
13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు)
పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు)
Comments
Please login to add a commentAdd a comment