outsource jobs
-
ఓయూ ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపక, అధ్యాపకేతర ఉద్యోగాలకు ఇక నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయనున్నారు. గతంలో పర్మినెంట్ ఉద్యోగాలకు కూడా రాతపరీక్ష ఉండేది కాదు. ఈనేపథ్యంలో ఓయూలో కొత్తగా రాత పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కాలేజీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పార్ట్‌టైం అధ్యాపక పోస్టుకు ఈనెల 23న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. (చదవండి: మూడు వందల కాలేజీలకు ముప్పు) 13న దూరవిద్య ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ ఫలితాలు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ఈనెల 10న శుక్రవారం జరిగిన ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఈనెల 13న (సోమవారం) విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షకు 836 మంది దరఖాస్తు చేయగా 677 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు ఈనెల 15 వరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐసెట్–2021 అర్హత సాధించిన విద్యార్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. (చదవండి: మద్యం తాగాడు.. విద్యార్థులను బాదాడు) పీజీ రిపోర్టింగ్ గడువు 15 వరకు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్‌లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు ఈనెల 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, శుక్రవారం నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (చదవండి: బయోపిక్‌లు ‘భయో’ పిక్‌లు, కాకూడదు) -
ఏపీ: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అండ
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటకు అనుగుణంగానే ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) కార్యరూపం దాలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా సీఎం 47 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ జారీ చేస్తారు. (ఉపాధి కల్పనే.. గీటురాయి) ‘వన్ – స్టాప్ – షాప్’... పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం. వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక. చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)తో పాటు ఈఎస్ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్, వాహనాల అద్దె లాంటి కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలను గుర్తించి అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను ఆప్కాస్ ద్వారా అందించడం. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ప్రక్రియకు సంబంధించి ‘వన్–స్టాప్–షాప్’గా ఆప్కాస్ పని చేస్తు్తంది. 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఈ కార్పొరేషన్ పని చేస్తుంది. ఇది నూటికి 100 % రాష్ట్ర ప్రభుత్వ సంస్థ. ఇప్పటికే ఉన్నవారు కార్పొరేషన్ పరిధిలోకి.. ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్ పరిధిలోకి మార్చారు. ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ మాత్రమే ప్లేస్మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఇప్పుడు ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్ కోడ్ ఇస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు. కార్పొరేషన్ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు. కార్పొరేషన్ పరిధిలోకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. వాటన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి. అవసరమైతే కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి. ఆప్కాస్‌లో ఎవరెవరు? ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్‌కు చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో పాటు ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు. ఆర్థిక శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి, ఏపీ హెచ్ఆర్డీ సంస్థ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌తో పాటు మానవ వనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులు ఈ కార్పొరేషన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్‌కు సూచనలు, సలహాలు అందించేందుకు నలుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్‌తో ప్రయోజనాలు.. ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ సంస్థలు, దళారులు తొలగిపోతారు. అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు జరుగుతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి. ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి ఠంచనుగా బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెలా పూర్తి వేతనాలు అందుతాయి. ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలుంటాయి. వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి. వేతనాల చెల్లింపు ఇలా.. ఆప్కాస్కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ ఆ కార్పొరేషన్ ద్వారానే చెల్లిస్తారు. ఆయా శాఖలు, విభాగాలు సంస్థలు, కార్యాలయాలు నేరుగా వేతనాలు చెల్లించవు. ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకున్న సంస్థలు, శాఖలు, విభాగాలు, కార్యాలయాలు ప్రతి నెలా వేతనాలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన బిల్లులను ఏపీసీఓఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి పారదర్శకంగా సాగే ఈ విధానం వల్ల ఎక్కడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది వేతనాల్లో కోత పడదు. అవినీతికి తావుండదు. ప్రైవేట్ ఏజెన్సీలు, దళారీలు తొలగిపోతారు కాబట్టి లంచాలు, కమీషన్లకు తావుండదు. -
నిరుద్యోగులను నట్టేట ముంచిన ‘ఆది’
సాక్షి, కర్నూలు : ఒక్కొక్కరు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరారు. ఉద్యోగంలో చేరిన సంతోషం వారికి ఎంతో కాలం లేదు. చేరినప్పటి నుంచి ఇంతవరకు వేతనాలు లేవు. ముడుపులు పుచ్చుకొని ఉద్యోగాలు ఇప్పించిన టీడీపీ మాజీ మంత్రి పత్తా లేకుండా పోయారు. పశుసంవర్ధకశాఖలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు, మెగా పశుగ్రాస క్షేత్రాలు, గోకులాలను టీడీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకు సంబంధించి డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అవసరం ఏర్పడింది. తొలుత అవసరాలకు తగిన విధంగానే నియమించారు. ఎన్నికల ముందు గత ఏడాది చివరిలో మార్కెటింగ్, పశుసంవర్ధకశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సిఫారసులతో అవసరం లేకపోయినా అడ్డుగోలుగా టెక్నికల్ మానిటర్, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వీరికి ఆశచూపి పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేసుకొని అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా గుంటూరుకు చెందిన రెడ్డి ఏజెన్సీ ద్వారా నియమితులయ్యారు. ఉద్యోగం వచ్చిందనే సంతోషం కొద్ది రోజులకే ఆవిరయ్యింది. ఆరు నెలలుగా వీరికి జీతాలు లేవు. ఉన్నతాధికారులను సంప్రదిస్తే ‘బిల్లు అయితే పెట్టాము... అది ఆర్డినరీ బిల్లు కావడంతో మంజూరు అయినప్పటికీ సంబంధిత నిధులు లేకపోవడంతో ఏమీ చేయలేము’ అని చెప్పినట్లు తెలిసింది. డీఎల్‌సీఈ, టీఎం, టీఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్లు జిల్లాలో 45 మందికి పైగా ఉన్నారు. వీరిలో 30 మందికి పైగా ముడుపులు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినట్లు సమాచారం. అయితే ఒక్క నెల జీతం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 13 నుంచి విధులకు హాజరు కాలేమని, సోషల్ అడిట్ నిర్వహించలేమని చేతుతెత్తేశారు. జీతాలు లేనందున ముడుపుల కింద ఇచ్చుకున్న నగదును వెనక్కి ఇచ్చే విధంగా టీడీపీ నేతపై ఒత్తిడి పెంచేందుకు నిర్ణయించారు. -
ప్రసవ వేదనలో 108
మెదక్‌రూరల్: ఆపద వస్తే వెంటనే అందరికి గుర్తుకు వచ్చేది 108. ఇప్పుడు ఆ 108 వాహనం ప్రసవ వేదనతో బాధపడుతోంది. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడే ఆపద్బాంధవులు తమ హక్కుల సాధన కోసం రోడ్డెక్కారు. కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పనిదినాలను కల్పించడంతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పద్నాలుగు రోజులుగా సమ్మె బాట పట్టారు. జిల్లాలో మొత్తం ఎనిమిది 108 వాహనాలునాయి. ఇందులో 36 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 18 మంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్(ఈఎమ్‌టీ), 18 మంది పైలెట్స్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు ప్రతి పల్లెకు అందాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2005లో 108 వాహనాలను ప్రవేశపెట్టారు. 24 గంటల అత్యవసర వైద్య సేవలను ప్రాణాపాయ, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వారికి అందించాలనే లక్ష్యంతో ఈ వాహనాలను ప్రారంభించారు. సమాచారం అందుకున్న 20 నిమిషాల వ్యవధిలోనే ఈ 108 వాహనం సంఘటన స్థలానికి చేరుకొని ప్రథమ చికిత్స అందించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం. అలాగే ఎంతో మంది గర్భిణులకు అంబులెన్స్‌లోనే పురుడుపోసి తల్లీబిడ్డలను సురక్షితంగా కాపాడుతున్న సిబ్బంది సమస్యలను పట్టించుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవులకు కనీస వేతన చట్టాల విషయంలో అటు ప్రభుత్వం, ఇటు జీవీకే యాజమాన్య పట్టింపులేని దోరణి వ్యవహరిస్తుండటంతో సిబ్బంది కుటుంబ పోషణ భారమైంది. దీంతో ఈ నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హక్కుల సాధన కోసం108 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టారు. చాలీచాలని వేతనాలతో 12 గంటలు రెండు షిఫ్ట్‌లల్లో వెట్టిచాకిరి చేస్తున్నామని సిబ్బంది వాపోతున్నారు. ఆపదలో ఉన్న ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న వారికి కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పనిదినాలను కల్పించి వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. జీఓ నంబర్ 3ను వెంటనే అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 108 వ్యవస్థను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్న జీవీకే సంస్థను తొలగించి 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవాలని పలువురు సిబ్బంది కోరుతున్నారు. కరువైన ప్రథమ చికిత్స గర్భిణులు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, పాముకాటుకు గురైన వ్యక్తులను, ఒంటికి నిప్పంటించున్న వారికి అత్యవసర ప్రథమ చికిత్స చేసే 108 సిబ్బంది సమ్మెబాట పట్టడంతో అత్యవసర సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సిబ్బంది సమ్మె చేస్తుండటంతో తాత్కాలిక సిబ్బందిని నియమించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. అడ్డమీద నుంచి డ్రైవర్లను పైలట్లుగా, ఇటీవల శిక్షణ పొందిన ఎలాంటి అనుభవం లేని సిబ్బందిని నియమించారు. దీంతో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుభవం లేని డ్రైవర్లు వాహనాలను నడిపిస్తుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందించడంలో తాత్కాలిక సిబ్బంది అవగాహన లేమితో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అనుభవం లేని డ్రైవర్ల కారణంగా జిల్లాలోని పలు చోట్ల 108 వాహనాలు ప్రమాదాలు జరిగి దెబ్బతిన్నాయనే సమాచారం ఉంది. సమ్మె నేపథ్యంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలకు అత్యవసర సేవలు కరువయ్యాయనే చెప్పాలి. కార్మిక చట్టాన్ని అమలు చేయాలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రజలను కాపాడే మాకు కార్మిక చట్టం ప్రకారం న్యాయం చేయాలి. ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలి. జీఓ నంబర్ 3ను అమలు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకొని ప్రభుత్వమే 108 వ్యవస్థను నడిపించాలి. న్యాయమైన మా డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం చేస్తాం. –కె. పాండు, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర 108 ఉద్యోగుల సంఘంఉద్యోగ భద్రత కల్పించాలి పదమూడేళ్లుగా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియమిస్తూ కార్మిక చట్టం ప్రకారం ఎనిమిది గంటల పని దినాలను కల్పించాలి. జీఓ నంబర్ 3ను అమలు చేయాలి. 108 నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే చేపట్టాలి. వెంటనే వేతనాన్ని కూడా పెంచి ఆదుకోవాలి. –ప్రసాద్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ -
భారత్ వైపు చూస్తున్న మెక్ డొనాల్డ్
వాషింగ్టన్ : అమెరికాలో ఇబ్బందులు పడుతున్న ఫుడ్ సప్లయ్ జెయింట్ మెక్ డొనాల్డ్ కంపెనీ భారత ఉద్యోగులవైపు మళ్లుతున్నట్టు తెలుస్తోంది. అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఈ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ చైన్..500 మిలియన్ల డాలర్ల కాస్ట్ కటింగ్ లో భాగంగా ఇండియానుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం చూస్తున్నట్టు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టీవ్ ఈస్టర్ బూక్ నేతృత్వంలో 500 మిలియన్ డాలర్ల కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగించబోతుందని పేర్కొంది. 2015లో అమెరికాలో 400 మంది ఉద్యోగులను తొలగించిన మెక్‌డొనాల్డ్ అభివృద్ధి స్తంభించిందని తెలిపింది. ఇప్పటికే వివిధ రకాలుగా భారత్ మార్కెట్ లోకి ఎంటరైనా సంస్థ అక్కడి ఉద్యోగులకోసం చూస్తోందని పేర్కొంది. అయితే అకౌంటింగ్ ఫంక్షన్ సహా తమ వ్యాపారాన్ని అనేక కోణాల్లో శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మించుకునే క్రమంలోనే ఈ చర్యలని సంస్థ ప్రతినిధి టెర్రీ హికీ చెప్పారు. 2017లో తమ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో ఉన్నామన్నారు. అలాగే ఖర్చును తగ్గించుకోనున్నామని సంస్థ వెల్లడించింది. అయితే మెక్ డొనాల్డ్ అమెరికాలో ఉన్న ప్రాంతీయ ఆఫీసులను క్రమేపీ తగ్గించుకుంటూ వస్తోంది. గతంలో 40 గా ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 25కి చేరడం విశేషం. కాగా కనీస వేతన చట్టాన్ని అమలుచేయాలని, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గతంలో ఉద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. తమకు చాలీ చాలని జీతాలు ఇస్తూ.. ఉద్యోగులను సంస్థ వేధిస్తోందని ఆరోపించిన సంగతి తెలిసిందే.