సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటకు అనుగుణంగానే ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్’ (ఆప్కాస్) కార్యరూపం దాలుస్తోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆప్కాస్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఉద్యోగాలు పొందుతున్న వారితో మాట్లాడతారు. ఈ సందర్భంగా సీఎం 47 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్స్ జారీ చేస్తారు. (ఉపాధి కల్పనే.. గీటురాయి)
‘వన్ – స్టాప్ – షాప్’...
- పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం. వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక. చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)తో పాటు ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం.
- హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, కేటరింగ్, వాహనాల అద్దె లాంటి కార్యకలాపాలు నిర్వహించే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలను గుర్తించి అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను ఆప్కాస్ ద్వారా అందించడం.
- రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ప్రక్రియకు సంబంధించి ‘వన్–స్టాప్–షాప్’గా ఆప్కాస్ పని చేస్తు్తంది.
100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ
ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఈ కార్పొరేషన్ పని చేస్తుంది. ఇది నూటికి 100 % రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.
ఇప్పటికే ఉన్నవారు కార్పొరేషన్ పరిధిలోకి..
- ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్ పరిధిలోకి మార్చారు. ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఆప్కాస్ మాత్రమే ప్లేస్‌మెంట్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
- ఇప్పుడు ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్ కోడ్ ఇస్తారు.
- రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.
- కార్పొరేషన్ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు.
- కార్పొరేషన్ పరిధిలోకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ మెంబర్ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.
- ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. వాటన్నింటిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉంటుంది. రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి. అవసరమైతే కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి.
ఆప్కాస్‌లో ఎవరెవరు?
- ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్‌కు చైర్మన్‌గా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి వ్యవహరిస్తారు. మేనేజింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో పాటు ఆరుగురు డైరెక్టర్లు ఉంటారు.
- ఆర్థిక శాఖకు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి లేదా ప్రభుత్వ కార్యదర్శి, ఏపీ హెచ్‌ఆర్‌డీ సంస్థ డీజీ, న్యాయశాఖ కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్‌తో పాటు మానవ వనరుల రంగానికి చెందిన ఇద్దరు నిపుణులు ఈ కార్పొరేషన్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్‌కు సూచనలు, సలహాలు అందించేందుకు నలుగురు సభ్యులతో అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు.
కార్పొరేషన్‌తో ప్రయోజనాలు..
- ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ సంస్థలు, దళారులు తొలగిపోతారు. అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకాలు జరుగుతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి.
- ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి ఠంచనుగా బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెలా పూర్తి వేతనాలు అందుతాయి. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలుంటాయి. వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి.
వేతనాల చెల్లింపు ఇలా..
- ఆప్కాస్‌కు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ ఆ కార్పొరేషన్ ద్వారానే చెల్లిస్తారు. ఆయా శాఖలు, విభాగాలు సంస్థలు, కార్యాలయాలు నేరుగా వేతనాలు చెల్లించవు. ఉద్యోగులు, సిబ్బందిని నియమించుకున్న సంస్థలు, శాఖలు, విభాగాలు, కార్యాలయాలు ప్రతి నెలా వేతనాలు, ఇతర సదుపాయాలకు సంబంధించిన బిల్లులను ఏపీసీఓఎస్‌కు చెల్లించాల్సి ఉంటుంది.
- పూర్తి పారదర్శకంగా సాగే ఈ విధానం వల్ల ఎక్కడా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది వేతనాల్లో కోత పడదు. అవినీతికి తావుండదు. ప్రైవేట్ ఏజెన్సీలు, దళారీలు తొలగిపోతారు కాబట్టి లంచాలు, కమీషన్లకు తావుండదు.
Comments
Please login to add a commentAdd a comment