Sugar cane season
-
రాజస్థాన్ టు నల్లగొండ
సాక్షి, నల్లగొండ టౌన్ : రాజస్థాన్ రాష్ట్ర నుంచి నల్లగొండ పట్టణానికి ఉపాధి కోసం వచ్చి యవకులు డిజిల్ ఇంజన్‌తో తయారు చేయించిన మొబైల్ చెరుకు బండ్లతో స్వయం ఉపాధి పొందుతున్నారు. రూ.50వేల పెట్టుబడితో సొంతంగా డిజిల్ మొబైల్ చెరుకు బండ్లను తయారు చేయించుకున్న యువకులు ప్రతి రోజు సుమారు రూ.3 వేల వరకు సంపాదిస్తున్నారు. ఖర్చులు పోను ప్రతి రోజు రెండు వేల వరకు సంపాదిస్తున్నారు,. వేసవికాలం సీజన్ ముగిసేంత వరకు వ్యాపారాన్ని కొనసాగిస్తూ తరువాత ఇతర సీజన్ వ్యాపారాలను చేసుకుంటున్నారు. సంపాదించిన డబ్బులను వారి స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులకు పంపిస్తూ వారికి కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్న రాజస్థాన్ యువత ఆదర్శంగా తీసుకోవాలి. మంచి ఉపాధి పొందుతున్నాం.. నల్లగొండ పట్టణంలో మొబైల్ చెరుకు రసం బండ్లతో మంచి ఉపాధిని పొందుతున్నాము. వ్యాపారం బాగానే సాగుతోంది. ఈ సీజన్ ముగియగానే మరో సీజన్ వ్యాపారం చేస్తాం. నెలనెల సంపాదించిన డబ్బులను కొంత ఇంటికి పంపిస్తాం. వ్యాపారం బాగా ఉంది. – గోపాల్, రాజస్తాన్ -
చెరకు సీజన్లో ‘బడి’ని వదిలేస్తున్న గిరిజన విద్యార్థులు
జోగిపేట మార్కెట్ గంజ్ ఆవరణ.. సేదతీరుతున్న గిరిజన కుటుంబాలు..పుల్కల్ మండలంలో చెరకు కొట్టేందుకు వెళుతూ మార్గమధ్యలో వారు ఆగారు. అలా ఆగిన వారిని ‘సాక్షి’ పలకరించింది. ఆ వలసజీవులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పిల్లల్ని పాఠశాలకు పంపాలని ఉందని..అయినా తాము ఒక చోట పిల్లలు మరోచోట కష్టమనే ఇలా వెంట తీసుకె ళ్తున్నామన్నారు. చదువు మానేసిన బడిపిల్లల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో మానేసిన బడిపిల్లల కోసం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి చెరుకు సీజన్లో గిరిజన పిల్లలు వారి చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో దూరం అవుతున్నారు. వీరి భవిష్యత్తుపై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యావంతులు అంటున్నారు. ప్రతి సీజన్లో ఇలా విద్యకు దూరం కావడం వల్ల భవిష్యత్తులో వారు పూర్తి స్థాయిలో విద్యావంతులు కావడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. చెరకు సీజన్లో గిరిజనులు తమ కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలివెళుతుంటారు. అయితే ఇంట్లోని వారందరూ నెలల పాటు ఉండరు కాబట్టి పిల్లల్ని ఎక్కడ ఉంచేందుకు అవకాశం లేక వారిని వెంట తీసుకువెళుతున్నారు. దీంతో వారు రెండు నెలల పాటు పాఠశాలలకు డుమ్మా కొట్టాల్సి వస్తుంది. రెండో తరగతి నుంచి 8,9 తరగతులకు చెందిన విద్యార్థులు కూడా వీరిలో ఉన్నారు. ఎక్కువగా ఈ వలసజీవులు ఎడ్లబళ్లపై అందోలు, పుల్కల్ మండల ప్రాంతాల్లో చెరకును కొట్టేందుకు వెళుతుంటారు. పాఠశాలలకు డుమ్మా ప్రతి చెరకు సీజన్లో గిరిజన ప్రాంతాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలకు దూరం అవుతున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని కంగ్టి, కల్హేర్, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గం పరిధిలోని రేగోడ్ మండలానికి చెందిన వందల సంఖ్యలో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లకుండా తమ తల్లిదండ్రుల వెంట చెరకు కొట్టే ప్రాంతాలకు తరలివెళుతున్నారు. దీంతో ఆయా విద్యార్థులు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. తల్లిదండ్రులకు తోడుగా.. చెరకు కొట్టేందుకు వెళ్లి ఆ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివసిస్తారు. చెరకు కొట్టే సమయంలో తండ్రులకు, వంట పనులు చే సే సమయంలో తల్లులకు ఆ విద్యార్థులు సహకరిస్తుంటారు. తండ్రులు చెరకును కొట్టి ఎడ్లబళ్లపై ఫ్యాక్టరీకి తరలించే సమయంలో తల్లుల వద్ద వారి పిల్లలు తోడుగా ఉంటున్నారు. కొంత మేరకు తల్లిదండ్రులకు చేదోడుగా వాదోడుగా ఉంటున్నా పాఠశాలను వదిలి చదువుకు దూరంగా వెళ్లడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మా పిల్లలు చదువుకోవాలని ఉన్నా.. మా పిల్లలు చదువుకోవాలనే మాకుంటుంది, కానీ సీజన్లో కేవలం పిల్లలను ఇంటి వద్ద వదిలేసి రావడం కుదరదు. మా తండాల్లో హాస్టళ్లు లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకు వెళ్తున్నాం. పెద్ద తండాలో 60 మంది విద్యార్థులున్నా ఒకే టీచర్ ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో కూడా పిల్లలకు సరైన ఆహారాన్ని అందించడం లేదు. -
‘మద్దతు’ తేలేనా?
సాక్షి, సంగారెడ్డి: చెరకు మద్దతు ధరపై నెలకొన్న ప్రతిష్టంభన తొలగడం లేదు. చెరకు సీజన్ ఆరంభానికి ముందే ధర ఖరారు చేయాలంటూ రైతులు పట్టుబడుతుండగా, వారు కోరినంత ధర చెల్లించడం సాధ్యం కాదని ఫ్యాక్టరీల యాజమాన్యాలు చెబుతున్నాయి. టన్ను చెరకుకు రూ.3,500 ఇవ్వాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుండగా, అంత మొత్తం చెల్లిస్తే తమకు నష్టాలు తప్పవని చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు చెబుతున్నాయి. మద్దతు ధర ఖరారు కానప్పటికీ సంగారెడ్డి మండలంలోని గణపతి షుగర్స్ గురువారం నుంచి క్రషింగ్ ప్రారంభించనుంది. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్స్, మెదక్‌లోని నిజాం దక్కన్ షుగర్స్ సైతం క్రషింగ్ సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెరకు మద్దతు ధర అంశంపై రైతులు పట్టును బిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే మద్దతు ధరపై గణపతి షుగర్స్‌తో రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి జేసీ శరత్ ను కలిసి మద్దతు ధర విషయమై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జేసీ శరత్ గురువారం జిల్లాలోని మూడు చక్కెర పరిశ్రమల యాజమాన్యాలు, చెరకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ప్రస్తుతం చెరకు రైతుల దృష్టంతా గురువారం జరగనున్న చర్చలపై పడింది. జేసీతో జరిగే చర్చల్లో తాము ఆశించిన మద్దతు ధర ఖరారు అవుతుందేమోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు... చెరకు మద్దతు ధర ఖరారుపై మూడేళ్లుగా జిల్లాలో ఇదే తంతు కొనసాగుతోంది. చెరకు క్రషింగ్ సీజన్ ప్రారంభానికి ముందే తాము కోరిన మేర మద్దతు ధర చెల్లించాలని పట్టుబట్టడం, చక్కెర పరిశ్రమ యాజమాన్యాలు నిరాకరించడం జరుగుతూ వస్తోంది. పలు సందర్భాల్లో రైతులు చెరకు ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలకు సైతం దిగారు. కాగా ఈ ఏడాది చెరకు రైతులు టన్నుకు రూ.3,500 చెల్లించాలని కోరుతున్నారు. గతంలో కంటే సాగు వ్యయం పెరగడం, వర్షాభావం, కరెంటు కోతల కారణంగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో రైతులు తాము ఆశించిన ధర చెల్లించాలని కోరుతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం రూ.2,600 చెల్లించేందుకు సముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.