ఉట్నూర్ : పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత విద్య అందిస్తున్న విషయం తెలిసిందే. 2014-15 విద్యా సంవత్సరానికి గాను ఐటీడీఏ పరిధిలో 92 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత వి ద్య అందించడానికి ప్రభుత్వం అనుమతించింది. దీం తో గిరిజన సంక్షేమ శాఖ పదో తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించడానికి చర్యలు చేపట్టింది. కార్పొరేట్ కళాశాలలకు ఎంపికైన విద్యార్థులకు రెండేళ్లపాటు ఇంటర్మీడియెట్ ఉచిత విద్య, ఇతర సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది.
అర్హులెవరంటే..
ఎస్టీ(గిరిజన) విద్యార్థులై ఉండాలి.
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.రెండు లక్షలలోపు ఉండాలి.
పదో తరగతలో సాధించిన ప్రతిభ ఆధారంగా కార్పొరెట్ కళాశాలల్లో ఎంపిక విధానం ఉంటుంది.ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీల్లో చదివిన వారికి 50 శాతం, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారికి 20శాతం, జెడ్పీఎస్‌ఎస్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివిన వారికి 25 శాతం, బెస్టుఅవైలబుల్ పాఠశాలల్లో చదివిన వారికి 5 శాతం చొప్పున సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుంది.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలకు ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు ఈ-పాస్ అంతర్జాలంలో దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ తెరువగానే కార్పొరేట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫారం కనిపిస్తుంది. అందులో విద్యార్థి పదో తరగతి హాల్‌టికెట్ నంబరు, పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీంతో సదరు విద్యార్థికి సంబంధించిన పూర్తి వివరాలతో దరఖాస్తు ఫారం వస్తుంది.
దరఖాస్తు ఫారంలో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థి పదో తరగతిలో సాధించిన గ్రేడింగ్, కులం, ఉప కులం, తల్లిదండ్రుల వృత్తి, చిరునామా వంటి వివరాలు పొందుపర్చాలి.
దరఖాస్తులో విద్యార్థి ఫొటో ముందుగానే ఉంటుంది. దానికి ముందు ఆధార్ కార్డు(యూఐడీ), ఈఐడీ, రేషన్‌కార్డు నంబర్లు జత చేయాలి.
మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు స్కానింగ్ చేసి అంతర్జాలంలో అప్‌లోడ్ చేయాలి.
గడువు..
జూన్ 13వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి ఉప సంచాలకులు భీమ్ తెలిపారు. జిల్లాలో ఉన్న కళాశాలలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఉన్న కార్పొరేట్ కళాశాలల వివరాలు అంతర్జాలంలో కనిపిస్తాయి. విద్యార్థులు ఏ కళాశాలలో చదవాలనుకుంటున్నారో దరఖాస్తులో ఆ కళాశాలను ఎంపిక చేసుకోవచ్చు. విద్యార్థులో పదో తరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా అధికారులు 23వ తేదీన ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి కళాశాలలు కేటాయిస్తారు.
ఉపకార వేతన దరఖాస్తు కోసం..
కార్పొరేట్ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో సీటు రాని విద్యార్థుల దరఖాస్తు ఉపకార వేతన దరఖాస్తుగా మారిపోతుంది. ఇంటర్మీడియెట్‌లో విద్యార్థి ఏ కళాశాలలో చేరినా అందుకోసం మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే ఉపకార వేతనం పొందే అవకాశం ఉంది.
గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్య
Published Tue, Jun 10 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
Advertisement
Advertisement