సూపర్‌ 60@ ఐఐటీ | ITDA Officer Saikanth Varma Implemented IIT Programme For Tribal Students In Seethampeta | Sakshi
Sakshi News home page

సూపర్‌ 60@ ఐఐటీ

Published Fri, Jul 12 2019 6:52 AM | Last Updated on Fri, Jul 12 2019 6:53 AM

ITDA Officer Saikanth Varma Implemented IIT Programme For Tribal Students In Seethampeta - Sakshi

సి.ఎం.సాయికాంత్‌ వర్మ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి

సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : గిరిజన విద్యార్థులకు ఐఐటీ కోచింగ్‌ ఇప్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సి.ఎం.సాయికాంత్‌ వర్మ తలపెట్టారు. ‘సూపర్‌ 60’ పేరుతో బ్యాచ్‌ను తయారు చేసి శ్రీకాకుళం డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉన్న వైటీసీలో నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గురువారం తన చాంబర్‌లో విలేకరుల సమావేశంలో పీఓ ఈ విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఐఐటీ, ఎన్‌ఐఐటీ తదితరఇంజినీరింగ్‌కోర్సులకు ఒక్క గిరిజన విద్యార్థి కూడా ఎంపిక కాలేదని, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో కోచింగ్‌ ఇస్తే తప్పక విజయం సాధిస్తారన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అధ్యాపకులను ఈనెల 14న ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో వారికి ప్రత్యేక పరీక్ష, వాకిన్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం సబ్జెక్టులు బోధిస్తున్న అధ్యాపకుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపారు. సబ్జెక్టుకు ఇద్దరు లెక్చరర్లను నియమిస్తామన్నారు. ఎంపికైన అధ్యాపకులకు డిప్యుటేషన్‌ పద్ధతిలో తీసుకుని వారికి వచ్చే జీతానికి అదనంగా రూ.20 వేల పారితోషికం ఇస్తామన్నారు. విద్యార్థులు ఐఐటీకి ఎంపికైతే వారి సంఖ్యను బట్టి ప్రోత్సాహంగా మరికొంత పారితోషికం ఇస్తామన్నారు.

జిల్లాలో ఏ ప్రభుత్వ కళాశాల నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం 9573844699 నంబరుకు ఫోన్‌ చేసి ట్రైబల్‌ వెల్ఫేర్‌ డీడీని సంప్రదించవచ్చన్నారు. గురుకులం, పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక ఎంట్రన్స్‌ టెస్ట్‌ను పెట్టి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న 60మంది, ద్వితీయ సంవత్సరం చదువుతున్న 60 మంది విద్యార్థులను ఎంపిక చేసి కోచింగ్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఏనుగులను కవ్వించొద్దు...
సీతంపేట ఏజెన్సీలో సంచరిస్తున్న ఏనుగులకు ఎటువంటి కవ్వింపు చర్యలు చేపట్టవద్దని ఐటీడీఏ పీఓ సాయికాంత్‌ వర్మ తెలిపారు. చాలామంది యువకులు ఏనుగులను చూడాలని వాటి వద్దకు వెళ్లి ఫొటోలు వంటివి తీస్తున్నారని, ఇది ప్రమాదకరమన్నారు. ఏనుగులు సంచరించే ప్రాంతాలను ట్రాకర్లు ఎప్పటికప్పుడు గమనించి సమాచారాన్ని గిరిజనులకు చేరవేస్తున్నారన్నారు.

దాని బట్టి గిరిజనులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వారు చెప్పిన సూచనలు పాటించాలన్నారు. ఏనుగులను తరలించడానికి ఉన్నతాధికారులతో ఇప్పటికే చర్చించడం జరగిందన్నారు. దీనిపై మరికొన్ని రోజుల్లో పరిష్కారం ఉంటుందన్నారు. గిరిజన అటవీ ఉత్పత్తులైన ఫైనాపిల్, పసుపు, జీడి వంటి వాటికి మార్కెట్‌ సౌకర్యం కల్పించనున్నట్టు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement