వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే.
ఎల్‌ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో..
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి.
పోడు పంటలే ప్రధానం
గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు.
ఐకమత్యమే బలం..
గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు.
కట్నం ఉండదు
గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు.
జిల్లాల విభజన తర్వాత..
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?)
మరింత ప్రోత్సాహం ఇవ్వాలి..
గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి.
– పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment