‘జల్, జంగిల్, జమీన్ ఔర్ ఇజ్జత్’ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతిని చేయడం ఓ కళ! ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీకారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాశారు. షెడ్యూల్డు కులాల, తెగల సబ్ ప్లాన్ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి.
ఆటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం రూపొందించబడిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి... ‘అటవీ సంరక్షణ నియమాలు– 2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషను విడుదల చేసింది. 2004, 2014, 2017లలో సవరణల తర్వాత రూపొందించిన అటవీ సంరక్షణ నియమాలను ఈ కొత్త సవరణలు మార్పు చేస్తాయి.
రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా... భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్ మాఫియాకు అనుకూలంగా కేంద్రం మార్చింది.
ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2003–06లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమనీ ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
2006 అటవీ హక్కులు చట్టం ప్రకారం మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా... అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. ప్రస్తుత చట్ట సవరణల వల్ల... ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. (క్లిక్: ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?)
కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అటవీ సంరక్షణ నియమావళి 2022’ ఉపసంహరించాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహ రించుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. (క్లిక్: రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం)
- వూకె రామకృష్ణ దొర
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
(ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment