World Tribal Day
-
మణిపూర్ మంటలు మోదీకి ఇష్టం
జైపూర్: అధికార బీజేపీ సైద్ధాంతిక భావజాలమే మణిపూర్‌ను మంటల్లోకి నెట్టిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమాయక ప్రజలను చంపేశారని, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రధాని మోదీ నిజంగా తలచుకొంటే రెండు మూడు రోజుల్లో మణిపూర్ మంటలు ఆరిపోతాయని చెప్పారు. కానీ, ఆ మంటలు అలాగే చెలరేగాలని మోదీ కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా రాజస్తాన్‌లోని మన్‌గఢ్ ధామ్‌లో బుధవారం కాంగ్రెస్ ప్రచార సభలో రాహుల్ ప్రసంగించారు. మణిపూర్‌ను ప్రధాని మోదీ రెండు విభజించారని ఆరోపించారు. గత మూడు నెలలుగా మణిపూర్ భారతదేశంలో ఒక భాగంగా లేనట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనులను బీజేపీ నేతలు ‘ఆదివాసీ’ అని కాకుండా ‘వనవాసీ’ అని సంబోధిస్తూ అవమానిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. గిరిజనులకు చెందిన అడవులను బలవంతంగా లాక్కొని అదానీకి కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనులకు హక్కులు దక్కాలని, వారి ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ కోరుకుంటోందని వివరించారు. -
సహపంక్తి భోజనం.. రాత్రి బస
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది. ‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు. నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు. భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు. 13న గాంధీభవన్‌లో సభ: మల్లురవి యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఆదివాసీ దినోత్సవం (ఫొటోలు)
-
కట్నం ఉండదు.. ఉత్కృష్టమైన సంస్కృతికి వారసులు, వారధులు
వారే వారసులు.. అనాది జీవన విధానానికి, అపురూప సంస్కృతికి, అరుదైన సంప్రదాయాలకు శాశ్వత చిరునామా వారు. వారు వారధులు కూడా.. నిన్నటి తరం వదిలిపెట్టిన వన సంపదను రేపటి తరానికి అందించే బాధ్యతను మోస్తున్నారు. పచ్చటి కొండకోనలను వేల ఏళ్లుగా రక్షిస్తూ, బతుకులను అడవి తల్లి సంరక్షణకు అర్పిస్తూ ఆదివాసీలు అందరికీ మేలు చేస్తున్నారు. అడవి ఇంకా బతికి ఉందంటే అదంతా వారి పుణ్యమే. అందుకే ఓ చల్లటి గాలి వీచినా, వెచ్చటి చినుకు పడినా మొదటి కృతజ్ఞత వారికే దక్కాలి. నేడు ఆదివాసీ దినోత్సవం. ఆహారం నుంచి ఆహార్యం వరకు అన్నింటా విభిన్నంగా కనిపించే వారి జీ‘వన’శైలి ఎప్పటికీ ప్రత్యేకమే. ఎల్ఎన్ పేట: కళ్లు తెరిస్తే పచ్చటి అడవి. తలెత్తి చూస్తే కొండ శిఖరం. అడుగు మోపితే ఆకుల తివాచీలు. ఆదివాసీల జీవనం ఎంత విశిష్టమో అంతే విభిన్నం కూడా. ఉద్యోగాలు వచ్చి కొందరు వనం వదలి వచ్చేసినా ఇంకా ఆ అడవి ఒడిలో ఎందరో బతుకుతున్నారు. కొండపోడు చేసుకుంటూ అడవి తల్లికి కాపు కాస్తున్నారు. వారి కట్టు, బొట్టు పరిశీలిస్తే అనాది సంప్రదాయాలు ఇంకా బతికే ఉన్నాయనడానికి సాక్ష్యం లభిస్తుంది. ఉమ్మడి జిల్లాలో.. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్ ప్లాన్ మండలాలు ఉన్నాయి. మన్యం జిల్లాగా విడిపోయిన తర్వాత సీతంపేట, వీరఘట్టం, పాలకొండ, భామిని ఈ నాలుగు మండలాలు మన్యం జిల్లాకు వెళ్లగా.. మిగిలిన 16 మండలాలు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో 74వేల గిరిజన కుటుంబాలు, సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. 301 గిరిజన గ్రామ పంచాయతీల్లో 103 షెడ్యుల్ గ్రామాలు కాగా, 1282 నాన్ షెడ్యూల్ గ్రామాలు ఉన్నాయి. పోడు పంటలే ప్రధానం గిరిజనులకు పోడు పంటలే జీవనాధారం. జొన్నలు, సజ్జలు, రాగులు, గంటెలు, కంది, అరటి, బొప్పాయి, జీడి, సీతాఫలం, పైనాపిల్, పనస, పసుపు, అల్లం, కొండ చీపుర్లు, ఆగాకర, కర్రపెండ్లం, చీమ మిరప, జునుములు వంటి అనేక పంటలు పండిస్తారు. ఉదయాన్నే పనిచేసుకునేందుకు కుటుంబమంతా పోడు వద్దకు చేరుకుని సాయంత్రానికి ఇంటికి వస్తారు. రసాయన ఎరువులు, పురుగుల మందులు లేని పంటలు పండిస్తారు. ఐకమత్యమే బలం.. గిరిజనుల్లో ఎన్ని మూఢ నమ్మకాలు ఉన్నా.. అంతా కలిసికట్టుగా బతకడమే వారి బలం. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే అంతా ఒక చోట కు చేరి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, కార్యక్రమం చేయాలన్నా అందరూ తలో కొంత సాయం చేసుకుంటారు. ఒకరు మాట ఇచ్చారంటే ఊరంతా ఆ మాటకు కట్టుబడి ఉంటారు. కట్నం ఉండదు గిరిజనుల ఇంట పెళ్లి జరిగితే కట్నం అనే మాట ఉండదు. కట్నం ఎందుకు తీసుకోవటం లేదని ఎవరైనా వారిని ప్రశ్నిస్తే.. ‘ఆడపిల్ల తల్లిదండ్రులు అప్పులు చేసి డబ్బులు ఇస్తారు. అప్పు కోసం వారు ఎన్నో బాధలు పడాలి. అలాంటి డబ్బు తీసుకోక పోవటమే మంచిది’ అంటారు. అయితే సారె సామాన్లు మాత్రం స్వీకరిస్తారు. జిల్లాల విభజన తర్వాత.. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత శ్రీకాకుళంలో ఉన్న సీతంపేట ఐటీడీఏ మన్యం జిల్లాలోకి వెళ్లింది. ఐటీడీఏను ఉమ్మడిగా కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో ఇటు శ్రీకాకుళం, అటు మన్యం జిల్లా పార్వతీపురంతో కలిసి సీతంపేట ఐటీడీఏ కొనసాగుతోంది. మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించుకోవటం ఇదే మొదటిసారి. ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు అటు అధికారులు, ఇటు గిరిజన సంఘాల నాయ కులు ఏర్పాట్లు చేస్తున్నారు. (క్లిక్: కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?) మరింత ప్రోత్సాహం ఇవ్వాలి.. గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం ఇవ్వాలి. ఇంకా అనేక మంది గిరిజనులు అమాయకంగానే జీవిస్తున్నారు. పోడు భూమికి పట్టాలు ఇచ్చి పూర్తి హక్కు కల్పించాలి. పోడు పంటలు పండించే గిరిజన రైతులను గుర్తించి అంతరించి పోతున్న పంటల సాగును ప్రోత్సహించాలి. – పడాల భూదేవి, చిన్నయ్య ఆదివాసీ వికాస్ సంఘం అధ్యక్షురాలు, శ్రీకాకుళం -
ఆదివాసీలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
-
World Tribal Day: ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 'గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం' అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం.#WorldTribalDay — YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2022 చదవండి: (ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ?) -
కార్పొరేట్లకు ఆదివాసీలను బలిపెడతారా?
‘జల్, జంగిల్, జమీన్ ఔర్ ఇజ్జత్’ కోసం పోరాడే ఆదివాసీ ప్రజలను ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ పేరిట అంతం చేస్తూనే ఆ తెగ బిడ్డనే రాష్ట్రపతిని చేయడం ఓ కళ! ప్రస్తుత కేంద్రప్రభుత్వ పాలనలో దళితులు, ఆదివాసీలు తీవ్రమైన దాడులకు గురవుతున్నారు. వారి హక్కులు హరించివేయబడుతున్నాయి. రాజ్యాంగం 5వ షెడ్యూల్లోని భూమిని వినియోగించుకునేందుకు గిరిజనుల అంగీకారం కావాలన్న క్లాజును తొలగించారు. గనులపై ఉన్న గిరిజన హక్కులను కాలరాశారు. షెడ్యూల్డు కులాల, తెగల సబ్ ప్లాన్ నిధులు భారీకోతలకు గురవుతున్నాయి. ఆటవీ సంరక్షణ చట్టం –1980 ప్రకారం రూపొందించబడిన ప్రస్తుత అటవీ సంరక్షణ నియమాలను సవరించడానికి... ‘అటవీ సంరక్షణ నియమాలు– 2022’ పేరుతో కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2022 జూన్ 28న నోటిఫికేషను విడుదల చేసింది. 2004, 2014, 2017లలో సవరణల తర్వాత రూపొందించిన అటవీ సంరక్షణ నియమాలను ఈ కొత్త సవరణలు మార్పు చేస్తాయి. రియల్ ఎస్టేట్ చేపట్టే భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు, ప్రాజెక్టులు, చెట్ల నరికివేత, ఇతర అభివృద్ధి పనులకు నిబంధనల్ని సడలించారు. అడవుల్లో నివసించే ఆదివాసీలు, గిరిజనులు, ఇతరుల అనుమతి అవసరం లేకుండా... భూముల కేటాయింపు జరగనున్నది. వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ ఇకపై ఇష్టానుసారంగా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. ఆదివాసీలకు నష్టపరిహారం చెల్లించే విధానం రియల్ మాఫియాకు అనుకూలంగా కేంద్రం మార్చింది. ఉదాహరణకు 5 నుంచి 40 హెక్టార్ల అటవీ భూములపై స్క్రీనింగ్ కమిటీ 60 రోజుల్లో కచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రం నోటిఫై చేసిన కొత్త నిబంధనావళిపై పర్యావరణ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అటవీ హక్కుల చట్టానికి తూట్లు పొడుస్తూ కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందని ఆదివాసీ లు ఆరోపిస్తున్నారు. అటవీ హక్కుల చట్టం 2003–06లో పేర్కొన్న నిబంధనావళి స్థానంలో కొత్త నిబంధనావళిని కేంద్రం తీసుకొచ్చిందనీ, ఇది అత్యంత ప్రమాదకరమైన విధానమనీ ఆదివాసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2006 అటవీ హక్కులు చట్టం ప్రకారం మౌలిక వసతులు, అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కట్టడం చేపట్టాలన్నా, ఇతర పనులు చేపట్టలన్నా... అక్కడ నివసించే అడవి బిడ్డల అనుమతి, అంగీకారం తప్పనిసరి. అటవీ భూముల్ని ప్రభుత్వాలు ఏకపక్షంగా వేరే అవసరాలకు వాడటానికి వీల్లేదు. ప్రస్తుత చట్ట సవరణల వల్ల... ఏదైనా ప్రయివేటు ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇవ్వగానే, ఇకపై ప్రయివేటు డెవలపర్స్ భూముల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రాజెక్టు నిర్వాసితులు, బాధితులకు నష్టపరిహారం అందజేస్తుంది. ఇదంతా అయిన తర్వాత బాధితుల పునరావాసం, వారి అటవీ హక్కుల పరిరక్షణ జరిగిందా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆదివాసీలు, గిరిజనుల అంగీకారంతో సంబంధం లేకుండా, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. (క్లిక్: ఆర్టికల్ 370 రద్దు చట్టబద్ధమేనా?) కేంద్ర ప్రభుత్వం తెస్తున్న ‘అటవీ సంరక్షణ నియమావళి 2022’ ఉపసంహరించాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహ రించుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఆదివాసీ అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. (క్లిక్: రక్తక్షేత్రం వెలుగులో దళిత ఉద్యమ ప్రజ్వలనం) - వూకె రామకృష్ణ దొర ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ (ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం) -
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
-
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
సాక్షి, పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసుల దినోత్సవం: అడవితల్లి బిడ్డల అగచాట్లు
కష్టం ఎంతైనా తరగని చిరునవ్వు.. తరాలు మారినా మారని సంస్కృతి ఆదివాసీలకే సొంతం. అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు నేటికీ అద్దం పడుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఆధునిక సమాజంలోనూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ తరువాత తరాలకు అందిస్తున్నారు. గుస్సాడీ ఉత్సవాలతో గ్రామాల మధ్య ఐక్యతను చాటుతూ దండోరా సంబరాలతో ఆకట్టుకుంటున్నారు. గుస్సాడి వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వారి ఆహార అలవాట్లు వారి ఆరోగ్యానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి అలవాట్లు, వేషభాషలపై ప్రత్యేక కథనం... సంప్రదాయానికి ప్రతీక వాయిద్యాలు నార్నర్(ఆసిఫాబాద్): ఆదివాసీ గిరిజనులు అనా దిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఆచారాలు నేటికీ పాటిస్తున్నారు. ప్రస్తుతకాలంలో డీజేలు, వివిధ రకాల సౌండ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ వి వాహాలు, ఇతర కార్యక్రమాల్లో సంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర కన్వీనర్, గుంజాల గోండిలిపి అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల్‌రావు ఆదివాసీ తెగలకు సంబంధింన 40 రకాల వాయిద్యాలు సేకరిం 2019 వర్చి 2, 3 తేదీల్లో హైదరాబాద్‌లో ఆదివాసీల ‘రేలపూల రాగం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమం ద్వారా సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాకృతిక జానపదం వినిపించడం లేదు. కళాకారులు బతికితే సంగీతం బతుకుతుందనే ఉద్దేశంతో ఆదివాసీలు నేటి యువతరానికి పరిచయం చేస్తున్నారు. ఆదివాసీ వాయిద్యాలు : డోల్ (డోలు) : డోలు, డ ప్పులను ఆదివాసీలు దైవ కార్యక్రమంతో పాటు ఇత ర శుభకార్యాల్లో వాయిస్తారు. గ్రామపెద్ద లేదా సమాజంలో గుర్తింపు పొందిన ఆదివాసీ వ్యక్తి మరణిస్తే అతని దహన సంస్కారాల్లో వాయిస్తారు. ఒ క్కో కార్యానికి ఒక్కోతీరు (బాజా) ఉంటుంది. పెళ్లిలో 10 రకాల డోలు వాయిస్తారు. అవసరాన్ని బట్టి డోల్యల్, చెడ్యంగల్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయా రకాల్లో వాయిస్తారు. డప్ (డప్పు) : దండారీ, దేవి ఉత్సహాల్లో డప్పులు వాడుతారు. ఇది కూడా పలు రకాలుగా ఉంటుంది. బాజాల తీరు, కార్యాన్ని బ ట్టి వాయిస్తారు. ఆదివాసీల సంస్కృతిలో భాగంగా వారి ఆచారం ప్రకారం వాయిస్తూ నృత్యం చేస్తారు. పెప్రే(సన్నాయి) : పెప్రేలను ప్రధాన్, తోటిలు వాయిస్తారు. డోలు, డప్పులకు తోడు పెప్రే అవసరం ఉంటుంది. సన్నాయి లేకపోతే ఏ ఉత్సవమైనా ఘనంగా జరగదు. ఈ రెండు ఉంటేనే ఉత్సవంలో జోస్ వస్తుంది. కాలికోం(కొమ్ము) : పెప్రేతో పాటు కాలికోం ఉంటుంది. వీటిని ప్రధాన్‌లు వాడతారు. దీనిని ఉత్సవం ప్రారంభంలో లేదా ఏదైనా కార్యక్రమం ప్రారంభంలో అప్పుడప్పుడు ఊదుతూ ఉంటారు. తుడుం : డోలు, డప్లలో తుడుం ఉంటుంది. తుడుంను కేవలం దైవ, పూజా కార్యక్రమంలో మాత్రమే ఉపయోగిస్తారు. దేవుళ్లకు సంబంధించిన కార్యంతో పాటు అతిథుల స్వాగతానికి వత్రమే దీనిని వాడతారు. కిక్రీ : ఇది తోటి, ప్రధాన్‌లలో ఉంటుంది. పెర్సాపెన్, పెద్ద దేవుల పురణ కథలను కిక్రీ సమేతంగా పాడి వినిపిస్తారు. డోల్కి : ఇది ఆదివాసీలు వివాహ సమయంలో గుడికి వెళ్లేటప్పుడు ఉపయోగిస్తారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత రాత్రి డెంసా కార్యక్రమంలో దీనిని వాడతారు. ఆకట్టుకునే సంస్కృతి,సంప్రదాయాలు.. దండేపల్లి(మంర్యాల): ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ఏటా దసరా తర్వాత ఆశ్వీయుజ పౌర్ణమితో దండారీ ఉత్సవాలు ప్రారంభిం దీపావళి అమావాస్యతో ముగిస్తారు. ఈ సమయంలో గుస్సాడీ వేషధారణ చేసి ఒక గ్రామం వారు మరో గ్రామానికి వెళ్తారు. దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి ఒడ్డున గల పద్మల్‌పురి కాకో ఆలయంలో నిర్వహించే వేడుకలకు ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. ఆదివాసీల ఆరాధ్య దేవతలకు బియ్యంతో పాయసం, పప్పుతో రుబ్బిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. దండారీ, పెర్సాపెన్ ఉత్సవాల సమయంలో ఆదివాసీలు గోదారమ్మకు శాంతి పూజలు నిర్వహిస్తారు. ఇప్పపరక నూనెకు ప్రాధాన్యం ఇంద్రవెల్లి(ఖానాపూర్): ఆదివాసీలు సంస్కృతి, సంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. సహజవనరులైన భమి, నీరు, అడవిలో దొరికే ఫలా లపై ఆధారపడి ఎంతో ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. చెట్టు, పుట్ట, నీరు వంటివాటికి పూజలు చేస్త వాటితో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఆదివాసీలు ఆషాఢవసంలో నిర్వహించే తొలి పండుగ అకాడి(వన)దేవతలకు పూజలు. సాగు పూజలు, శుభకార్యాలు, పెర్పపేన్, తదితర పూజలకు ఇప్పపరకనూనెకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. అడవిలో సేకరించిన ఇప్ప పరకలతో తీసిన నూనెతో నైవేద్యం తయారుచేసి దేవతలకు సమర్పించడంతో పాటు దీపారాధనకు వినియోగిస్తారు. ఆదివాసీ గ్రామాల్లో టేకు మొద్దులతో తయారు చేసిన గాన దర్శనమిస్తుంది. ఈనెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి గ్రామంలో నిర్వహించేందుకు ఆదివాసీలు సిద్ధమవుతున్నారు. మారని బతుకులు ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4లక్షల 95వేల 794 మంది అదివాసీ గిరిజనులున్నారు. వీరందరి అభివృద్ధికి బాటలు వేసేందుకు 1975లో ప్రభుత్వం ఉట్నూర్ కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు చేసింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీల అభివృద్ధికి బాటలు వేసేందుకు ఏర్పాటైన ఐటీడీఏ నాలుగు దశాబ్దాలు దాటినా వారి జీవన విధానంలో ఎలాంటి మార్పులను తీసుకురాలేదు. నేటికి చాలా అదివాసీ గిరిజన ప్రాంతాలు కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయి. విద్య, వైద్యం, తాగునీటి సౌకర్యం అందని ద్రాక్షగానే మిగిలింది. ఏటా జ్వరాలు, వ్యాధులతో వందల సంఖ్యలో మృత్యుఒడి చేరుతున్నారు. పండుగల్లో ప్రత్యేక ఆకర్షణగా.. జన్నారం(ఖానాపూర్): అడవితల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనుల సంప్రదాĶæలు నేటికీ అద్దం పడుతున్నాయి. జన్నారం మండలంలోని లోతొర్రే, అలీనగర్, కొలాంగూడ, హాస్టల్ తండా, నర్సింగాపూర్, తదితర ఆదివాసీ గ్రావల్లో అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా జరుపుకుంటారు. దండోరా సంబరాల్లో గుస్సాడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మా సంప్రదాయం మారదు మేమంతా ఒకేతాటిపై ఉంటాం. మా తండ్రులు, తాతలు నేర్పిన సంప్రదాయాలు వర్చుకోం. సంప్రదాయం ప్రకారం నడుచుకుంటే మా దేవుళ్లు మమ్మల్ని కాపాడుతారు. గూడెంలో చదువుకున్నోళ్లు ఉన్నా మేము చెప్పిన విధంగానే నడుచుకుంటారు. – గంగరాం, లోతొర్రే గూడెం పటేల్ లక్ష్యం సాధించాలి... ఆదిలాబాద్‌రూరల్: నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఎంతగానో శ్రమించాలి. ఇబ్బందులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించా. ఆదివాసీ తెగలో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే స్పందించి చికిత్స అందిస్తున్నా. క్రీడల్లో రాణించే వారికి సైతం ఆర్థికంగా చేయూత అందజేస్తున్నా. – డాక్టర్ సుమలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, ఆదిలాబాద్ దుకాణం నడుపుతూ చదివా ఆదిలాబాద్‌రరల్: వది బేల మండలంలోని దహేగాం. చదువుకునే రోజుల్లో సాంగిడిలో చిన్న కిరాణా షాపు నడిపించా. మా నాన్నకు పోలీస్ ఉద్యోగం అంటే ఇష్టం లేదు. సర్పంచ్ చెప్పడంతో ఒప్పుకున్నారు. ఆ రోజుల్లో మాగ్రామానికి న్యూస్‌పేపర్ వచ్చేది కాదు. కిరాణా సామాను కోసం ఆదిలాబాద్‌కు వచ్చినప్పుడు పేపర్ చదివేవాడిని. 1985లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చేసుకుని ఎస్సైగా ఉద్యోగం సాధించాను. సీఐ, డీఎస్పీ, ఏఎస్పీ, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్థాయికి ఎదిగా. – డీజీపీకి పుష్పగుచ్ఛం అందిస్తున్న మడావి బాపురావ్,డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. ఆదిలాబాద్‌రరల్: ఆ రోజుల్లో ఏజన్సీ ప్రాంతాల్లో చదువుకునేందుకు అవకాశాలు లేవు. సౌకర్యాలు అంతంత వత్రమే. మా తల్లిదండ్రులు టీచర్లు కావడంతో ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వారి లక్ష్యానికి అనుగుణంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యం సాధించవచ్చు. తల్లిదండ్రులు వారి పిల్లల ను ప్రోత్సహించాలి. - కుడ్మేత మనోహర్, ఏజెన్సీ డీఎంహెచ్‌వో, ఉట్నూర్ పట్టుదలతో ఉద్యోగం సాధించా ఆదిలాబాద్‌రూరల్: నేను ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే రోజుల్లో అంతగా పోటీ ఉండేది కాదు. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివా. ఏకకాలంలో ఆర్టీసీలో, మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగాలు వచ్చాయి. అందులో మెడికల్ ఫీల్డ్ ఎంచుకున్నా. ఉద్యోగం సాధించాలంటే తప్పనిసరిగా కష్టపడాలి. ఉన్నత స్థాయిలో రాణించిన వారు పేదవారికి సహాయం చేస్తే వారు కూడా ఉద్యోగం సాధించే ఆస్కారం ఉంటుంది. – సిడాం వామన్‌రావు, డెప్యూటీ పారామెడికల్ ఆఫీసర్, ఆదిలాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. బేల(ఆదిలాబాద్): మండలంలోని సోన్కాస్లో నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన మేస్రం జనార్దన్, శాంతబాయి దంపతుల కుమారుడు మేస్రం నాగేశ్వర్ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే చదువు పూర్తి చేశాడు. 2013 ఫిబ్రవరిలో ఉస్మానియా యూనివర్సిటీలో జంతుశాస్త్రం విభాగంలో చేరి 2018 జూన్‌లో పట్టా సాధించాడు. సోడియం ఫ్లోరైడ్ అనే టాక్సికేట్ను ఎలుకలకు ఇచ్చి ప్లురోసిస్ అనే వ్యాధిని గుర్తించాడు. వ్యాధిని నయం చేసేందుకు అల్లనేరేడు, జామ, ఉసిరి, అడవిబెండ వంటి ఫలాల నుంచి క్యూరే్సటిన్ అనే ఔషధాన్ని తయారు చేశాడు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో డాక్టరేట్ పొందాడు. ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఫర్ ఉమెన్స్, కోఠిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదర్శంగా నాగోరావు తాంసి: భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన మేస్రం నాగోరావు ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగం సాధించి ఆరేళ్లుగా విధులు నిర్వహిస్త తమ ప్రాంతంలోని గిరిజనులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిపాని గ్రామంలోని గిరిజన కుటుంబం చెందిన మేస్రం భంబాయి, దేవరావ్ల కుమారుడు మేస్రం నాగోరావు. మొదటి ప్రయత్నంలోనే ఎఫ్‌సీఐలో ఉద్యోగం సాధించి 2016లో విధులలో చేరాడు. -
ఆదివాసీ దినోత్సవం.. టీడీపీ ప్రచార ఆర్భాటం
సాక్షి,విశాఖపట్నం/పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం గురువారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం తెలుగుదేశం పార్టీ ప్రచారసభగా సాగింది. జూనియర్ కళాశాల మైదానంలో ఆదివాసీ దినోత్సవం నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి దాదాపు రూ.3 కోట్ల వెచ్చించినట్లు అంచనా. ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం సభా ప్రాంగణాన్ని శక్తి వంచన లేకుండా పచ్చదనంతో నింపింది. పాడేరు, అరకు నియోజకవర్గాల 11 మండలాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. డ్వాక్రా రుణాలు, హక్కు పత్రాల పంపిణీ, ట్రైకార్, ఎన్ఎస్ఎఫ్డీసీ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులందరినీ సభకు తీసుకువచ్చారు. వెలుగు అ«ధికారులు ద్వారా అన్ని ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేసి ఉదయం 11గంటలకే సభా ప్రాంగణానికి మహిళల్ని, గిరిజనుల్ని తరలించారు. మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పచ్చ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. మొత్తం మీద ఆదివాసి దినోత్సవ సభ టీడీపీ ప్రచారవేదికగా సాగింది. ఎన్నికల్లో ఈ అభిమానంచూపించండి: సీఎం ఎన్టీరామారావును, ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని, తెలుగుదేశం పార్టీపై అభిమానం చూపించాలని, ఆదివాసి దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరారు. తాను పాడేరు చాలా సార్లు వచ్చానని ఇంతటి ఆనందం ఎప్పుడు కలగలేదన్నారు. ఎన్నికల్లో టీడీపీ పట్ల ఆదరాభిమానాలు చూపించాలన్నారు. గిరిజన సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంతో తపన పడుతోందని, గిరిజనుల అభివృద్ధిని, హక్కుల్ని సాధించడంలో ముందుం టానని గంటన్నరసేపు ప్రసంగం కొనసాగించారు. విద్యార్థినుల తిప్పలు ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి వచ్చిన పలు పాఠశాలల విద్యార్థినులు అవస్థలకు గురయ్యారు. నృత్య ప్రదర్శనలు ఇవ్వడానికి ఉదయం 9గంటలకే ఉత్సాహంగా బాలికలు సిద్ధమై సభా ప్రాంగణానికి వచ్చారు. మధ్యాహ్నం 2గంటలకు ఈ ప్రదర్శనలు ముగిసినా సీఎం పర్యటన కారణంగా భద్రతా వలయాన్ని దాటుకుని సభా ప్రాంగణం నుంచి ఎటూ కదల్లేకపోయారు. సీఎం ప్రసంగం ముగిసేవరకు దాదాపు నాలుగున్నర గంటల వరకు వారు ఆకలిదప్పులతో సభా ప్రాంగణంలోనే తిప్పలు పడ్డారు. నిర్వాహకులు ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో సుమారు 50 మంది విద్యార్థినులు అవస్థలకు గురయ్యారు. మూతపడిన దుకాణాలు, షాపులు సీఎం పర్యటన పుణ్యమాని పాడేరులోని పాతబస్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్సులోని షాపులు, దుకాణాలు మూతపడ్డాయి. రోడ్డుకు ఇరువైపులా బారీకేడ్లు వేసి సీఎం పర్యటన ముగిసే వరకు ఈ ప్రాంతంలో షాపులన్నీ మూసివేయించారు. సీఎం పర్యటన దృష్ట్యా వాహనాల్ని అనుమతించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వారు అడారిమెట్ట నుంచి సుమారు 4 కిలోమీటర్లు నడిచి సభా ప్రాంగణానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం కాన్వాయ్ అడ్డగింపు సీఎం చంద్రబాబు పాల్గొన్న ఆదివాసీ దినోత్సవంలో గిరిజన నాయకులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. సీఎం కాన్వాయ్‌కు అడ్డుకున్నారు. బాక్సైజ్ జీవో నంబరు 97ను రద్దు చేయాలని, ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, గిరిజన వర్సటీ ఏర్పాటు చేయాలని నినదించారు. -
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా హన్మకొండ అర్బన్ : లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని ఆది వాసీ సంక్షేమ పరిషత్ జాతీయ అ«ధ్యక్షుడు దాట్ల నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో బాలసముంద్రంలోని ఏకశిలాపార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లంబాడీలను రాజకీయ లబ్ధికోసమే ఎస్టీ జాబితాలో చేర్చాయని అన్నారు. దీంతో ఆది వాసీలకు కోలుకోలేని అన్యాయం జరగుతోందన్నారు. ఆదివాసీల కోసం ప్రభుత్వాలు చట్టాలు తీసుకువచ్చినప్పటికీ సరిగా అమలు చేయడంలేదని అన్నారు. ఆదివాసీలను అడవి, భూమి, నీటి నుంచి దూరం చేసే కుట్ర జరగుతోందని, దీన్ని గుర్తించి మేధావులు, యువత పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాయకులు ఈసం ధర్మయ్య, మల్లెల కృష్ణ, ఈక నాగేశ్వర్రావు, రామకృష్ణ, ఈసం పాపయ్య పాల్గొన్నారు. -
బాలారిష్టాల్లో గిరిపుత్రిక!
సీతంపేట: నిరుపేద కుటుంబాలకు చెందిన అవివాహిత యువతులు వివాహం చేసుకుంటే ఆర్థికసాయం కింద వారికి రూ. 50 వేలు ఇస్తామని 2014 ఆగస్టు తొమ్మిదో తేదీన విశాఖలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి నిధులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని వివాహం చేసుకున్న గిరిజన యువతులంతా ఎప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇలా.. ఐటీడీఏ పరిధిలో 20 ట్రైబుల్ సబ్‌ప్లాన్ మండలాలున్నాయి. వీటిలో ఇప్పటివరకు ఈ పథకం కింద 132 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారిలో 71 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. అయితే ప్రభత్వం నుంచి కేవలం పన్నెండున్నర లక్షల రూపాయల నిధులు మాత్రమే మంజూరయ్యాయి. 71 మంది అర్హులకు రూ.35 లక్షల 50 వేలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. దానిలో సగం కూడా నిధులు విడుదల కాకపోవడం గమనార్హం. విడుదలైన అరకొర నిధులు ఎవరికి ఏ ప్రాతిపదికన పంపిణీ చేస్తారోనని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. కేవలం 25 మంది వరకు సరిపడా నిధులు మాత్రమే విడుదల కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఈ పథకానికి సంభందించిన సర్వర్ కూడా నిలిచిపోయినట్టు సమాచారం. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్ వద్ద ప్రస్తావించగా వచ్చిన నిధులను ఎంతమందికి సరిపోతే అంతమందికి పంపిణీ చేస్తామన్నారు. -
నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగాలి
మన్ననూర్: నల్లమలలో మళ్లీ కిన్నెరనాదం మార్మోగించి చెంచులకు సేద తీర్చడమే తన ఉద్దేశమని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జయధీర్ తిరుమల్‌రావు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా నల్లమల లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్, రాంపూర్, బౌరాపూర్ చెంచులతో ఆదివారం అప్పాపూర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను చెంచుపెంటకు వచ్చినప్పుడు కిన్నెర వాయిద్యం గురించి గొప్పగా చెప్పినట్లు వివరించారు. అదే ఉద్దేశంతో మక్తల్‌కు చెందిన కిన్నెర వాయిద్యకారుడు పోషప్పతో తయారు చేయించిన రెండింటిని అప్పాపూర్ పెంటకు చెందిన గురువయ్య, రాంపూర్‌కు చెందిన బయ్యన్నకు ఇచ్చిన్నట్లు చెప్పారు. చెంచుల కళలు, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చెంచులను అడవులకు దూరం చేయాలనుకోవడం భావ్యం కాదని చెప్పారు. ఓయూ ప్రొఫెసర్ కృష్ణయ్య మాట్లాడుతూ బంగారు తెలంగాణ గురించి హైదారాబాద్‌లో కార్యక్రమాలు చేపట్టడం కాకుండా మారుమూల ప్రాంతాల్లో దుర్భరమైన జీవితాలను గడుపుతున్న వారికి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందే విధంగా కృషి చేయాలని కోరారు. చెంచులకు వైద్యపరీక్షలు కడప మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ రాంకిషన్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా రాంకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుతో అమాయకులైన చెంచులు కూడా ఏదో వస్తుందని.. తమ బతుకులు బాగుపడుతాయని ఆశించారని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడే చెంచులు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భూమిక తెలుగు మాసపత్రిక సంపాదకులు సత్యవతి, పీయూ ప్రొఫెసర్ మనోజ, ప్రముఖ కవి బెల్లి యాదయ్య, జీసీసీ మేనేజర్ చందర్లాల్, రచయితల సంఘం సభ్యులు నర్సన్, శ్రీధర్, వహీద్, గురువయ్య, చందునాయక్, ప్రసన్నకుమార్, నాగభూషణం, రాజు, యాదగిరి పాల్గొన్నారు. -
'అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదు'
ఖమ్మం(అశ్వారావుపేట): ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆదివారం అశ్వారావుపేటలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదివాసీల అభివృద్ధికి కలెక్టర్ సహకరించటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జిల్లాకు కలెక్టర్ గా పనిచేసిన వారు ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి అక్కడ సమస్యలు పరిష్కరించేవారని చెప్పారు. అయితే ప్రస్తుతం కలెక్టర్ కేవలం పట్టణాల్లో మాత్రమే పర్యటిస్తున్నారని అని వ్యాఖ్యనించారు. -
విశాఖలో ఆదివాసీ దినోత్సవం వద్దు
మైదానంలో నిర్వహణపై సర్వత్రా వ్యతిరేకత పాడేరు/జి.మాడుగుల: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం ఈనెల 9న ఏజెన్సీలో కాకుండా విశాఖపట్నంలో నిర్వహించడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. ఆదివాసీల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు నిరశిస్తున్నాయి. ప్రచార ఆర్భాటం కోసమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు పేరిట ఆదివాసీలను జిల్లా కేంద్రానికి తరలిండం అర్థరహితమని దుయ్యబడుతున్నారు. మైదానంలో కాకుండా ఏజెన్సీలో నిర్వహించాలని శుక్రవారం జి.మాడుగుల మండలపరిషత్ సమావేశంలో తీర్మానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీ ఎం.వి.గంగరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రభుత్వ తీరుపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను కించపరిచే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరి పేరును ఆహ్వాన పత్రికలో చేర్చలేదని తప్పుపట్టారు. ఇది ఆదివాసీలను కించపరచడమేనని బీజేపీ జిల్లా కార్యదర్శి కురసా ఉమా మహేశ్వరరావు, మండలశాఖ అధ్యక్షుడు సల్లా రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిరిజన ప్రజల పట్ల, గిరిజన సంస్కృతిపట్ల గౌరవం ఉంటే పాడేరు ఐటీడీఏ పరిధిలో ఆదివాసీల మధ్య నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ తీర్మానించాలన్నారు. ఆదివాసీ దినోత్సవ సభ ను విశాఖలో నిర్వహించడంపై ఆదివాసీలంతా సమైక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు. -
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వుతాం
ఇందుకు ఐటీడీఏలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు: చంద్రబాబు విశాఖ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజనులకు సీఎం హామీలు విశాఖపట్నం: రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన బాక్సైట్ నిల్వలను తమ ప్రభుత్వం తవ్వి తీయనున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందుకోసం ఐటీడీఏ (సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ) తరఫున ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖ జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం ఆదివారం విశాఖపట్నంలోని విమానాశ్రయం ఎదురుగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో తరచుగా వచ్చే డయేరియా, డెంగ్యూ వ్యాధులను ఎన్టీఆర్ ఆరోగ్య పథకంలో చేర్చుతామని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి అన్ని గిరిజన గ్రామాలకు 10 లీటర్లు, 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్లను సరఫరా చేస్తామన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని.. విద్యుత్ కొరతను తీర్చేందుకు మన్యంలో ఎల్ఈడీ లైట్లు, సోలార్ విద్యుత్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా గిరిజన యువతుల వివాహానికి రూ. 50 వేల ఆర్థిక సాయం పథకం అమలుచేస్తామన్నారు. గిరిజన మ్యూజియాన్ని నిర్మిస్తామన్నారు. విశాఖ జిల్లా ఏజెన్సీలోని అరకు, పాడేరు పర్యాటక రంగానికి ప్రసిద్ధని.. ఈ ప్రాం తాలను ఊటీ తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ‘‘విశాఖ నుంచి అరకుకు అద్దాలతో కూడి న బోగీలతో రైలును నడుపుతామన్నారు. రైతుల రుణ మాఫీ చేసి చూపించాం... ‘‘ఇప్పటికి అధికారం తీసుకుని రెండు మాసాలవుతోంది. అన్నీ ఇబ్బందులే. హైదరాబాద్‌లో ఆఫీస్ కూడా లేదు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో కొనసాగుతున్నాం. పాలన సెట్ కాలేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నాం. అయినా రైతు రుణమాఫీ అమల్లో భాగంగా రూ. 1.50 లక్షలు చొప్పున మాఫీ చేసి చూపించాం...’’ అని సీఎం చెప్పుకొచ్చారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా రెం డో రోజు శనివారం అనకాపల్లిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యతలు గవర్నర్ చేతికిస్తామని కేంద్రం చెప్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనకు కావాల్సింది అభివృద్ధి కాదని వివాదాలేనని ధ్వజమెత్తారు. సాయంత్రం నక్కపల్లిలో స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. డ్వాక్రా రుణ మాఫీ హామీలో భాగంగా ఒక్కో సంఘానికి రూ. లక్ష మాఫీ చేస్తామని ప్రకటించారు. సెల్ ఫోన్లు లేని మహిళలకు సెల్ ఫోన్లు, ఒక్కో సంఘానికి టాబ్లెట్ పీసీ, మరుగుదొడ్ల నిర్మాణానికి సహకారం, డ్వాక్రా బజార్లు, వ్యసాయ ఆధునీకరణ, యాంత్రీకరణలో పరికరాల కొనుగోలుకు సాయం చేస్తామంటూ హామీలు గుప్పించారు. ఏ సమస్య వచ్చినా రెండు నిముషాల్లో ఆడబిడ్డల్ని కాపాడే బాధ్యత తీసుకుంటానన్నారు. ఏమైనా అడిగితే.. ఆగ్రహమే..! చంద్రబాబు విశాఖ జిల్లా పర్యటన రెండు రోజుల్లో పలువురు రైతులు, డ్వాక్రా మహిళలు రుణ మాఫీ హామీ అమలుపై ఆయనను నిలదీసి నిరసనలు వ్యక్తంచేశారు. తొలి రోజు మాదిరే రెండో రోజు కూడా బాబు తన వద్దకు డిమాండ్లతో వచ్చిన వారిపై ఆగ్రహం వెళ్లగక్కారు. తాళ్లపాలెం వద్ద మాట్లాడుతున్నపుడు ఓ బీఈడీ విద్యా ర్థి తాజాగా ప్రకటించే డీఎస్సీ నోటిఫికేషన్లో బీఈడీ అభ్యర్థులకు కూడా ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించాలని డిమాండ్ చేశారు. కాస్త గట్టిగా అరిచి చెప్పడంతో బాబు ఆగ్రహిస్తూ.. అరిస్తే సమాధానం చెప్పనంటూ దాటవేసేందుకు ప్రయత్నించారు. తమకు స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ఆ విద్యార్థి పట్టుపట్టారు. దీంతో సీఎం ‘‘మర్యాదగా చెప్తే వినాలి. నీ ఒక్కడికే కాదు అందరికీ సమస్యలుంటాయి. నువ్వు రెచ్చిపోతే ఇంక నీతో మాట్లాడను. బాగా పనిచేసేటపుడు అరిస్తే ఎవరికైనా కోపమెస్తుం ది’’ అని మండిపడ్డారు. తర్వాత పోలీసుల ద్వారా ఆ విద్యార్థి వివరాలు కనుక్కోవాల్సిందిగా స్థానిక నేతలు అధికారుల్ని పురమాయించడం గమనార్హం. -
అభివృద్ధికి దూరంగా పాడేరు గిరిపుత్రులు
-
‘ప్రజావాణి’లో మార్పులు
వచ్చే వారం నుంచే అమలు కలెక్టర్ యువరాజ్ వెల్లడి విశాఖ రూరల్ : ప్రజావాణి కార్యక్రమం విధానంలో స్వల్పమార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజావాణి దరఖాస్తుల పరిస్థితి కొంత గందరగోళంగా ఉందని, వచ్చే వారం నుంచి ముందుగా ప్రజలు ఎకనాలెడ్జ్మెంట్ తీసుకొని తరువాత తనను కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండల కార్యాలయాల్లో కూడా ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తాన్నారు. కేవలం సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైన దరఖాస్తు చేసుకొనే వెసలుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే వారం నుంచి ప్రజావాణిలో ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సెజ్‌లు, ఎన్ఏఓబీ నిర్వాసితుల వివరాలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సెజ్‌లు, ఎన్ఏఓబీలకు భూ సేకరణ వల్ల సుమారుగా 6500 మంది నిర్వాసితులయ్యారని వెల్లడించారు. వీరిలో కొంత మందికి పునరావాసం కల్పించడం జరిగిందని, మిగిలిన వారికి కల్పించాల్సి ఉందని వివరించారు. కలెక్టరేట్లో మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యనటకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. గత షెడ్యూల్ ప్రకారం తొలి రోజు పర్యటన ఉంటుందని, రెండో రోజున మధురవాడలో ఉన్న శిల్పారామంలో రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించే గిరిజన మ్యూజియానికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆ రోజున ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకల నిర్వహణకు మూడు వేదికలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్, ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న స్థలం, ఏయూలో అనువైన స్థలాన్ని నిర్ణయించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. 15 తరువాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల 15వ తేదీకి కూడా ఇదే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువగా కురిసిందని, ఆగస్టు 15కు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక విత్తనాలు అవసరముంటుందన్నారు. అవసరమైన చోట రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.