‘ప్రజావాణి’లో మార్పులు
- వచ్చే వారం నుంచే అమలు
- కలెక్టర్ యువరాజ్ వెల్లడి
విశాఖ రూరల్ : ప్రజావాణి కార్యక్రమం విధానంలో స్వల్పమార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్‌లో విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజావాణి దరఖాస్తుల పరిస్థితి కొంత గందరగోళంగా ఉందని, వచ్చే వారం నుంచి ముందుగా ప్రజలు ఎకనాలెడ్జ్‌మెంట్ తీసుకొని తరువాత తనను కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
మండల కార్యాలయాల్లో కూడా ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తాన్నారు. కేవలం సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైన దరఖాస్తు చేసుకొనే వెసలుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే వారం నుంచి ప్రజావాణిలో ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సెజ్‌లు, ఎన్‌ఏఓబీ నిర్వాసితుల వివరాలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు.
సెజ్‌లు, ఎన్‌ఏఓబీలకు భూ సేకరణ వల్ల సుమారుగా 6500 మంది నిర్వాసితులయ్యారని వెల్లడించారు. వీరిలో కొంత మందికి పునరావాసం కల్పించడం జరిగిందని, మిగిలిన వారికి కల్పించాల్సి ఉందని వివరించారు. కలెక్టరేట్‌లో మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యనటకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. గత షెడ్యూల్ ప్రకారం తొలి రోజు పర్యటన ఉంటుందని, రెండో రోజున మధురవాడలో ఉన్న శిల్పారామంలో రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించే గిరిజన మ్యూజియానికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆ రోజున ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకల నిర్వహణకు మూడు వేదికలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్, ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న స్థలం, ఏయూలో అనువైన స్థలాన్ని నిర్ణయించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు.
15 తరువాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల 15వ తేదీకి కూడా ఇదే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువగా కురిసిందని, ఆగస్టు 15కు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక విత్తనాలు అవసరముంటుందన్నారు. అవసరమైన చోట రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.