N.yuvaraj
-
‘గురు’తర బాధ్యత మరువొద్దు
ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయాలి ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం విశాఖపట్నం : ‘ఈయనే మా గురువు’ అని జీవితాంతం చెప్పుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఎన్.యువరాజ్, ఇతర అధికారులతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో కంటే పాఠశాలలో ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడుపుతారన్నారు. అందువల్ల పిల్లలకు ఉపాధ్యాయులతోనే ఎక్కువ అనుబంధం ఉంటుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఉద్యోగ బాధ్యతలో భాగంగా పాఠశాలకు సమయానికి హాజరుకావాలన్నారు. 58 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి ఉత్తమ బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. వచ్చే ఏడాది నుంచి ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు పదో తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ.2 వేలు, బీ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ. 1500 ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అలాగే సబ్జెక్టుల వారీగా ప్రథమ ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ తరగతి గదుల్లో మొదలవుతుందన్నారు. వారికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు మన గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలన్నారు. ఈ ఏడాది ప్రతిభను కనబరిచిన 23 మంది స్పెషల్ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, 3 డివిజన్ల మండల విద్యాశాఖాధికారులు మొత్తం 23 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. డిప్యూటీ డీఈఓ సి.వి.రేణుక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, సర్వశిక్షా అభియాన్ పీఓ బి.నగేశ్, యలమంచిలి డిప్యూటీ డీఈఓ లింగేశ్వర్రెడ్డి, జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎం దృష్టికి రెండు అంశాలు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు విశాఖ రూరల్ : జిల్లాకు సంబంధించిన రెండు అంశాల ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశానికి వెళ్లిన యువరాజ్ రెండు ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. జిల్లాలో మాతా శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి వైద్యాధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితంగా ఉండడం లేదు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజునే మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. తాజాగా ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు కలెక్టర్ కొత్త ప్రతిపాదనను సీఎం దష్టికి తీసుకువెళ్లారు. మాతా శిశు మరణాలు నమోదువుతున్న గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఏడాదిలో ఆయా గ్రామాల్లో మరణాల సంఖ్య 50 శాతం కంటే తక్కువగా నమోదైతే ఆయా బృందాలకు పారితోషకాలు ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సీఎంకు వివరించారు. ఇలా మూడేళ్ల పాటు చేయడం వల్ల దాదాపుగా మాతా శిశు మరణాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ యువరాజ్‌కు సూచించారు. జిల్లాలో కొబ్బరి రైతులు, వ్యాపారులకు రవాణా భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూనిట్ల నుంచి కాయిర్‌ను కార్గోలో చెన్నైకి తరలించి అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు చేయడం జరుగుతుందుని, దీని వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని సీఎంకు వివరించారు. ఆ భారం తగ్గాలంటే నేరుగా విశాఖ నుంచే విదేశాల మేరకు ఎగుమతి చేసే వెసలుబాటు కల్పించాలని కోరారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టుల నుంచి కూడా రవాణా చేయడం ద్వారా రైతులపై రవాణా భారం తగ్గుతుందని చెప్పారు. దీనికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి తమకు అందించాలని సీఎం ఆదేశించారు. -
‘ప్రజావాణి’లో మార్పులు
వచ్చే వారం నుంచే అమలు కలెక్టర్ యువరాజ్ వెల్లడి విశాఖ రూరల్ : ప్రజావాణి కార్యక్రమం విధానంలో స్వల్పమార్పులు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. సోమవారం తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రజావాణి దరఖాస్తుల పరిస్థితి కొంత గందరగోళంగా ఉందని, వచ్చే వారం నుంచి ముందుగా ప్రజలు ఎకనాలెడ్జ్మెంట్ తీసుకొని తరువాత తనను కలిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మండల కార్యాలయాల్లో కూడా ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేస్తాన్నారు. కేవలం సోమవారం మాత్రమే కాకుండా ఎప్పుడైన దరఖాస్తు చేసుకొనే వెసలుబాటు కల్పిస్తామన్నారు. వచ్చే వారం నుంచి ప్రజావాణిలో ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. సెజ్‌లు, ఎన్ఏఓబీ నిర్వాసితుల వివరాలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేస్తున్నట్లు తెలిపారు. సెజ్‌లు, ఎన్ఏఓబీలకు భూ సేకరణ వల్ల సుమారుగా 6500 మంది నిర్వాసితులయ్యారని వెల్లడించారు. వీరిలో కొంత మందికి పునరావాసం కల్పించడం జరిగిందని, మిగిలిన వారికి కల్పించాల్సి ఉందని వివరించారు. కలెక్టరేట్లో మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు ఈ నెల 8, 9 తేదీల్లో ముఖ్యమంత్రి జిల్లా పర్యనటకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు కలెక్టర్ చెప్పారు. గత షెడ్యూల్ ప్రకారం తొలి రోజు పర్యటన ఉంటుందని, రెండో రోజున మధురవాడలో ఉన్న శిల్పారామంలో రూ.కోటి అంచనా వ్యయంతో నిర్మించే గిరిజన మ్యూజియానికి సీఎం శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఆ రోజున ప్రపంచ గిరిజన దినోత్సవం వేడుకల నిర్వహణకు మూడు వేదికలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. స్టీల్‌ప్లాంట్, ఎయిర్‌పోర్టు ఎదురుగా ఉన్న స్థలం, ఏయూలో అనువైన స్థలాన్ని నిర్ణయించి ఘనంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. 15 తరువాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నెల 15వ తేదీకి కూడా ఇదే పరిస్థితులు ఉంటే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 45 శాతం తక్కువగా కురిసిందని, ఆగస్టు 15కు 30 శాతం తక్కువ వర్షపాతం ఉంటే స్వల్పకాలిక విత్తనాలు అవసరముంటుందన్నారు. అవసరమైన చోట రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. -
బాల మేధావులు భళా
ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత నమూనాలు విద్యార్థులకు ప్రశంసలు పెదవాల్తేరు: పర్యావరణ నమూనాలతో బాల మేధావులు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో గురువారం జిల్లా ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన-2014ను కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రారంభించారు. కపోతాలను గాలిలో ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేవన్నారు. ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయిస్తే రెండు, మూడేళ్లలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ విద్యార్థి ఒక మానవ వనరని, తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చిన్నారుల్లో సృజన వెలికితీయడానికి ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ విద్యా రంగ ప్రగతికి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి కృషి చేస్తానన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. 6 నుంచి 8వ తరగతి, 9వ, 10వ తరగతి విద్యార్థులు రెండు కేటగిరీల్లో ప్రదర్శనలో పాల్గొన్నారన్నారు. 199 పాఠశాలల నుంచి 199 నమూనాలు వచ్చాయని చెప్పారు. ఆయా విద్యార్థుల్లో 11 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఉప విద్యాశాఖధికారులు సి.వి.రేణుక, లింగేశ్వరరెడ్డి, జీవీఎంసీ విద్యాశాఖాధికారిణి ఉషారాణి పాల్గొన్నారు. మానవ మనుగడ కష్టం ‘స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. దీని వల్ల భవిష్యత్తులో మానవ మనుగడ కష్టమ’ని తెలియజేస్తూ విద్యార్థులు రాంప్రసాద్, చందు తయారు చేసిన నమూనా ఆకట్టుకుంటోంది. రానున్న కాలంలో పూర్తిగా మొక్కలు లేక కలుషిత నీరే గతి అని చెబుతున్న ఈ నమూనా ఆకర్షణగా నిలిచింది. రేడియేషన్ వల్ల అనర్థాలు ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్. ఇవి పని చేయడానికి ఏర్పాటు చేసే నెట్వర్క్ టవర్స్. వీటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఎంత ప్రమాదమో నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రఘు, భానుకృష్ణ నమూనా ద్వారా తెలియజేశారు. సెల్ టవర్ నుంచి 50 నుంచి 300 మీటర్ల దూర ంలో ఉండే ప్రజలపై రేడియేషన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించారు. విండో పవర్ స్ట్రీట్ లైట్ ‘ 32 దేశాల్లో వినియోగంలో ఉన్న విండో పవర్ స్ట్రీట్ లైట్లను మన దేశంలో కూడా వినియోగంలోకి తెస్తే కాలుష్యం తగ్గుతుంద’ని తెలిపే నమూనాను బుచ్చయ్యపేట మండలం రాజాం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు రూపొందించారు. సైన్స్ టీచర్లు లక్ష్మి, అన్నపూర్ణ సహకారంతో తయారుచేసిన ఈ నమూనా ఆలోచింపజేస్తోంది. -
విపత్తుల నివారణకు ప్రణాళిక
అధికారులకు కలెక్టర్ ఆదేశం విశాఖ రూరల్: తుపాను ప్రభావిత మండలాల అధికారులు విపత్తుల నివారణకు ప్రణాళిక రూపొందించుకోవాలని, రెండు రోజుల్లో తన కార్యాలయానికి అందజేయాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి విపత్తుల నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విశాఖ తీర ప్రాంతానికి తుపానుల ప్రభావం ఉండే అవకాశమున్నందున తీర ప్రాంతాల మండలాధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. తుపాను షెల్టర్లకు మరమ్మతులు వెంటనే నిర్వహించాలన్నారు. తుపాను సమయంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో సెంట్రల్ కంట్రోల్ రూమ్ నిర్వహిస్తే బాగుంటుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఏజేసీ న రసింహారావు మాట్లాడుతూ రెండేళ్లుగా వచ్చిన భారీ వర్షాలు, తుపాన్లు, పరిస్థితుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఆలోచనలకు రూపకల్పన చేసి విపత్తుల నివారణకు ప్రణాళిక తయారు చేయాలన్నారు. అంటు వ్యాధులపై అప్రమత్తం ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను కలెక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మలేరియా, డెంగీ, ఇతర అంటువ్యాధులకు సంబంధించిన కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి వారం మండలాల్లో పర్యటించే అధికార బృందం వ్యాధుల నివారణపై ప్రచారం చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ శ్యామల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెంగీ, మలేరియా వ్యాధుల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌కు వివరించారు.