సీఎం దృష్టికి రెండు అంశాలు
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు
విశాఖ రూరల్ : జిల్లాకు సంబంధించిన రెండు అంశాల ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. గురువారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశానికి వెళ్లిన యువరాజ్ రెండు ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. జిల్లాలో మాతా శిశు మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. వీటిని నియంత్రించడానికి వైద్యాధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా ఫలితంగా ఉండడం లేదు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజునే మాతా శిశు మరణాల నియంత్రణకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. తాజాగా ఈ మరణాల సంఖ్యను తగ్గించేందుకు కలెక్టర్ కొత్త ప్రతిపాదనను సీఎం దష్టికి తీసుకువెళ్లారు.
మాతా శిశు మరణాలు నమోదువుతున్న గ్రామాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ఏడాదిలో ఆయా గ్రామాల్లో మరణాల సంఖ్య 50 శాతం కంటే తక్కువగా నమోదైతే ఆయా బృందాలకు పారితోషకాలు ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందిస్తే మంచి ఫలితాలు ఉంటాయని సీఎంకు వివరించారు. ఇలా మూడేళ్ల పాటు చేయడం వల్ల దాదాపుగా మాతా శిశు మరణాలను అరికట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. దీనిపై ప్రతిపాదనలు రూపొందించాలని కలెక్టర్ యువరాజ్‌కు సూచించారు.
జిల్లాలో కొబ్బరి రైతులు, వ్యాపారులకు రవాణా భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం జిల్లాలో ఉన్న యూనిట్ల నుంచి కాయిర్‌ను కార్గోలో చెన్నైకి తరలించి అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు చేయడం జరుగుతుందుని, దీని వల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని సీఎంకు వివరించారు. ఆ భారం తగ్గాలంటే నేరుగా విశాఖ నుంచే విదేశాల మేరకు ఎగుమతి చేసే వెసలుబాటు కల్పించాలని కోరారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టుల నుంచి కూడా రవాణా చేయడం ద్వారా రైతులపై రవాణా భారం తగ్గుతుందని చెప్పారు. దీనికి కూడా ప్రతిపాదనలు తయారు చేసి తమకు అందించాలని సీఎం ఆదేశించారు.