బాల మేధావులు భళా
- ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత నమూనాలు
- విద్యార్థులకు ప్రశంసలు
పెదవాల్తేరు: పర్యావరణ నమూనాలతో బాల మేధావులు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. సీతమ్మధార ఎస్‌ఎఫ్‌ఎస్ స్కూల్లో గురువారం జిల్లా ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శన-2014ను కలెక్టర్ ఎన్.యువరాజ్ ప్రారంభించారు. కపోతాలను గాలిలో ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేవన్నారు.
ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయిస్తే రెండు, మూడేళ్లలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మాట్లాడుతూ విద్యార్థి ఒక మానవ వనరని, తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చిన్నారుల్లో సృజన వెలికితీయడానికి ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ విద్యా రంగ ప్రగతికి ప్రభుత్వ పరంగా సహాయం అందించడానికి కృషి చేస్తానన్నారు.
జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ ప్రదర్శన నిర్వహించామన్నారు. 6 నుంచి 8వ తరగతి, 9వ, 10వ తరగతి విద్యార్థులు రెండు కేటగిరీల్లో ప్రదర్శనలో పాల్గొన్నారన్నారు. 199 పాఠశాలల నుంచి 199 నమూనాలు వచ్చాయని చెప్పారు. ఆయా విద్యార్థుల్లో 11 మందిని ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, ఉప విద్యాశాఖధికారులు సి.వి.రేణుక, లింగేశ్వరరెడ్డి, జీవీఎంసీ విద్యాశాఖాధికారిణి ఉషారాణి పాల్గొన్నారు.
మానవ మనుగడ కష్టం
‘స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. దీని వల్ల భవిష్యత్తులో మానవ మనుగడ కష్టమ’ని తెలియజేస్తూ విద్యార్థులు రాంప్రసాద్, చందు తయారు చేసిన నమూనా ఆకట్టుకుంటోంది. రానున్న కాలంలో పూర్తిగా మొక్కలు లేక కలుషిత నీరే గతి అని చెబుతున్న ఈ నమూనా ఆకర్షణగా నిలిచింది.
రేడియేషన్ వల్ల అనర్థాలు
ప్రతి మనిషి చేతిలో సెల్‌ఫోన్. ఇవి పని చేయడానికి ఏర్పాటు చేసే నెట్‌వర్క్ టవర్స్. వీటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఎంత ప్రమాదమో నర్సీపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రఘు, భానుకృష్ణ నమూనా ద్వారా తెలియజేశారు. సెల్ టవర్ నుంచి 50 నుంచి 300 మీటర్ల దూర ంలో ఉండే ప్రజలపై రేడియేషన్ ప్రభావం ఏ విధంగా ఉంటుందో వివరించారు.
విండో పవర్ స్ట్రీట్ లైట్
‘ 32 దేశాల్లో వినియోగంలో ఉన్న విండో పవర్ స్ట్రీట్ లైట్లను మన దేశంలో కూడా వినియోగంలోకి తెస్తే కాలుష్యం తగ్గుతుంద’ని తెలిపే నమూనాను బుచ్చయ్యపేట మండలం రాజాం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు రూపొందించారు. సైన్స్ టీచర్లు లక్ష్మి, అన్నపూర్ణ సహకారంతో తయారుచేసిన ఈ నమూనా ఆలోచింపజేస్తోంది.