‘గురు’తర బాధ్యత మరువొద్దు
- ఉత్తమ సమాజ స్థాపనకు కృషి చేయాలి
- ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిత
- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ
- ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం
విశాఖపట్నం : ‘ఈయనే మా గురువు’ అని జీవితాంతం చెప్పుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లాలం భవానీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని కలెక్టర్ ఎన్.యువరాజ్, ఇతర అధికారులతో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులతో కంటే పాఠశాలలో ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడుపుతారన్నారు. అందువల్ల పిల్లలకు ఉపాధ్యాయులతోనే ఎక్కువ అనుబంధం ఉంటుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దేలా కృషి చేయాలన్నారు. కలెక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు ఉద్యోగ బాధ్యతలో భాగంగా పాఠశాలకు సమయానికి హాజరుకావాలన్నారు. 58 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, వారికి ఉత్తమ బోధన అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
వచ్చే ఏడాది నుంచి ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు పదో తరగతిలో ఏ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ.2 వేలు, బీ గ్రేడ్ సాధించిన విద్యార్థులకు రూ. 1500 ఇచ్చి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. అలాగే సబ్జెక్టుల వారీగా ప్రథమ ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయులను సత్కరించనున్నట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ తరగతి గదుల్లో మొదలవుతుందన్నారు. వారికి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైన ఉందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు మన గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయ వృత్తికి వన్నె తేవాలన్నారు.
ఈ ఏడాది ప్రతిభను కనబరిచిన 23 మంది స్పెషల్ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, స్కూల్ అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు, 3 డివిజన్ల మండల విద్యాశాఖాధికారులు మొత్తం 23 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామన్నారు. పదో తరగతిలో శతశాతం ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
డిప్యూటీ డీఈఓ సి.వి.రేణుక ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులనుద్దేశించి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ మహేశ్వర్‌రెడ్డి, సర్వశిక్షా అభియాన్ పీఓ బి.నగేశ్, యలమంచిలి డిప్యూటీ డీఈఓ లింగేశ్వర్‌రెడ్డి, జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.