
న్యాయం చేయాలంటూ వివిధ సంఘాల ఆందోళన
లక్డీకాపూల్: మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం ప్రజావాణి కార్యక్రమం నిరసనలు, ఆందోళనల మధ్య సాగింది. లోక్‌సభ ఎన్నికల నియమావళి ముగిసిన తర్వాత పునఃప్రారంభమైన ప్రజావాణికి పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు అన్యాయం జరిగిందనీ, న్యాయం చేయాలంటూ వివిధ సంఘాల నేతలు ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు.
విధుల నుంచి తొలగించిన తమకు న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ప్యాకేజీ పెంచాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డ్రైవర్స్ కం ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాత ప్యాకేజీపై వాహనాలు నడపడం చాలా కష్టమని, ప్యాకేజీని రూ.55 వేలకు పెంచాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంత్రి సీతక్కకు అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సి.రాజేశ్వరరావు, జి. దేవేందర్ వినతిపత్రాన్ని సమర్పించారు. తాను కొనుగోలు చేసిన భూమిని ధరణిలో నమోదు చేయకపోవడంతో కబ్జాకి గురైందంటూ మాజీ సీఆర్‌పీఎఫ్ ఉద్యోగి ఇమ్మడి సోమయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అన్ని విభాగాలకు సంబంధించి మొత్తం 702 దరఖాస్తులు నమోదయ్యాయి.
రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 219 దరఖాస్తులు, మున్సిపల్ శాఖకు సంబంధించి 54, హోం శాఖకు సంబంధించి 52, హౌసింగ్ శాఖకు సంబంధించి 44, పౌరసరఫరాల శాఖకు సంబంధించి 46, ఇతర శాఖలకు సంబంధించి 287 దరఖాస్తులు అందినట్లు ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్ శాఖ సంచాలకులు దివ్య వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజావాణి ఇంఛార్జి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఆయా శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.