సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆదివాసీలను ఆకట్టుకునే దిశలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పిలుపు మేరకు బుధవారం పార్టీ రాష్ట్ర నాయకత్వం తండాలు, గూడేల్లో బస చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలోని రెండు లేదా మూడు తండాల్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచ్చింది.
‘గిరిజన ఆదివాసీ సంరక్షణ హస్తం’పేరుతో చేపట్టనున్న ఈ కార్య క్రమం ద్వారా రాష్ట్రంలోని ఆదివాసీలు, గిరిజనులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరించడంతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేయబోయే మేలు, చేపట్టబోయే ఇతర కార్యక్రమాల గురించి నేతలు వివరించనున్నారు.
నివాళి.. నృత్య ప్రదర్శనలు.. నిద్ర
బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలుత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కొమురం భీం, సేవాలాల్ మహరాజ్, ఇందిరాగాంధీ చిత్రపటాలకు నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పిస్తారు. తర్వాత గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రదర్శనలు, కళాకారులతో నృత్యాలు, పాటలు పాడించడం లాంటివి నిర్వహించనున్నారు. తండాలు, గూడేల్లోని స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడంతో పాటు అక్కడి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేయనున్నారు.
భోజనాల అనంతరం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేదా తండా నాయకుడి ఇంట్లో నిద్రించనున్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు, ఆదివాసీల వెన్నంటే ఉంటుందని చెప్పడమే ఈ కార్యక్రమ లక్ష్యమని, తండాలు, గూడేలను అక్కున చేర్చుకోవడం ద్వారా అక్కడి గిరిజనులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు వెల్లడించారు.
13న గాంధీభవన్‌లో సభ: మల్లురవి
యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) వల్ల ఆదివాసీ గిరిజనులకు తీరని నష్టం జరుగుతుందని, ఆదివాసీలను నిర్మూలించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతోందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లురవి చెప్పారు. ఈ నెల 13న ఆదివాసీలు, గిరిజనులతో వారి సమస్యలపై గాందీభవన్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.
మంగళవారం గాందీభవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు టి.బెల్లయ్య నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని అన్నారు.
సహపంక్తి భోజనం.. రాత్రి బస
Published Wed, Aug 9 2023 12:51 AM | Last Updated on Wed, Aug 9 2023 3:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment