ఝార్ఖండ్‌ ఆదివాసిల్లో జేఎంఎం పట్టు! | Jharkhand Mukti Morcha in jarkhand adivasi | Sakshi
Sakshi News home page

ఝార్ఖండ్‌ ఆదివాసిల్లో జేఎంఎం పట్టు!

Published Tue, May 14 2019 5:28 AM | Last Updated on Tue, May 14 2019 5:28 AM

Jharkhand Mukti Morcha in jarkhand adivasi - Sakshi

మావోయిస్టులకు పట్టున్న ప్రాంతం ఝార్ఖండ్‌లో ఆదివాసీల జనాభా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగిన స్థాయిలో ఉంది. ఝార్ఖండ్‌లో మొత్తం 14 పార్లమెంటు స్థానాలున్నాయి. ఝార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మెల్లిమెల్లిగా బీజేపీ తన బలాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఇక్కడ కాంగ్రెస్, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా, ఆర్జేడీ, జనతాదళ్‌(యూ) ఝార్ఖండ్‌ ఏర్పడినప్పటినుంచీ ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. ఈ ప్రాంతంలో  భారతీయ జనతాపార్టీ బలం అనూహ్యంగా పుంజుకుంది.

2004లో 14 లోక్‌సభ స్థానాలకు గాను యూపీఏ (కాంగ్రెస్, జెఎంఎం, ఆర్జేడీ, సీపీఐ)కి 13 సీట్లు వస్తే, బీజేపీ ఒక్క సీటుకే పరిమితం అయ్యింది. 2009లో బీజేపీ 8 స్థానాల్లో విజయఢంకా మోగిస్తే, కాంగ్రెస్‌ 1, జేవీఎం 1, ఇండిపెండెంట్లు 2 గెలుచుకున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా 12 స్థానాల్లో విజయఢంకా మోగించింది. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) 2 స్థానాలను నిలబెట్టుకోగలిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, ఝార్ఖండ్‌ వికాస్‌ మోర్చా(ప్రజాతాంత్రిక్‌ జెవీఎం), ఆర్జేడీ కలిసి పోటీ చేస్తున్నాయి. గత ప్రాభవాన్ని పునర్‌నిర్మించుకోవాలని కాంగ్రెస్‌ కూటమి భావిస్తోంటే, తమ బలాన్ని సుస్థిరం చేసుకుంటామన్న ఆశాభావంతో బీజేపీ ఉంది.

జనాభాలో 25 శాతంగా ఉన్న ఆదివాసీలు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆదివాసీలు ఆధారపడి బతుకుతోన్న అడవినుంచి అత్యధిక మంది ఆదివాసీలను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు తెచ్చిన చట్టాలు వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. అలాగే రైతాంగాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శ పాలకులను వెంటాడుతోంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్‌ ముగిసింది చివరి దశలో జరిగే రాజ్‌ మహల్, దుమ్కా, గొడ్డా  నియోజకవర్గాల్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పనిచేస్తుందా? లేక ఈసారి కూడా బీజేపీకే పాలనావకాశం దక్కుతుందా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రాజ్‌మహల్‌ ...  
ఎస్టీ రిజర్వుడు సీటైన రాజ్‌మహల్‌ లోక్‌సభ స్థానాన్ని 2014లో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి హేమ్‌లాల్‌ ముర్ముపై జేఎంఎం అభ్యర్థి విజయ్‌కుమార్‌ హన్స్‌డాక్‌ విజయం సాధించారు. ఈసారి కాంగ్రెస్, జేఎంఎం కూటమి తరఫున సీపీఎం అభ్యర్థి గోపీన్‌ సోరెన్‌ పోటీ చేస్తున్నారు. గోపీన్‌ సోరెన్‌ పై గతంలో పోటీ చేసి ఓడిపోయిన హేమ్‌లాల్‌ ముర్ముని బీజేపీ తిరిగి పోటీకి దింపింది. ఈ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ, జేఎంఎంలు గెలుపుగుర్రమెక్కడానికి హోరాహోరీ పోరాడుతున్నాయి. 2014 గణాంకాలను బట్టి ఈ పార్లమెంటు స్థానంలో మొత్తం 13,53,467 మంది ఓటర్లున్నారు. ఈ స్థానంలో 2009లో బీజేపీ తరఫున దేవిధన్‌ బెస్రా విజయాన్ని సాధించారు.

 దుమ్కా ...
ఎస్టీ రిజర్వుడు స్థానమైన దుమ్కా ఝార్ఖండ్‌ ముక్తి మోర్చాకి బలమైన పునాదులున్న ప్రాంతం. 2014 ఎన్నికల్లో బీజేపీని కట్టడిచేసేందుకు జెఎంఎం శిబూ సోరెన్‌ని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థి సునీల్‌సోరెన్‌ఫై 3,35, 815 ఓట్లతో శిబూసోరెన్‌ విజయాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ అభ్యర్థి సునీల్‌ సోరెన్‌కి 2,96,785 ఓట్లు వచ్చాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ వరసగా ఈ స్థానాన్ని జేఎంఎం కైవసం చేసుకుంటూ వచ్చింది. 2002లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం ఈ స్థానంలో జేఎంఎం గెలుపొందింది.

గొడ్డా....
ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లున్న గొడ్డా పార్లమెంటు స్థానంలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. 2014లో గొడ్డా స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఫరూక్‌ అన్సారీపై బీజేపీ అభ్యర్థి నిశీకాంత్‌దూబే గత ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో నిశీకాంత్‌ దూబే 36.25 శాతం ఓట్లతో(3,80,500) ఓట్లతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ఫరూక్‌ అన్సారీకి కూడా 3,19,818 (30.47శాతం) ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా బీజేపీ నిశీకాంత్‌ దూబేని బరిలోకి దింపింది. జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా అభ్యర్థి ప్రదీప్‌ యాదవ్‌ ఈ స్థానంలో కూటమి తరఫున పోటీ చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement