
విశాఖలో ఆదివాసీ దినోత్సవం వద్దు
మైదానంలో నిర్వహణపై సర్వత్రా వ్యతిరేకత
పాడేరు/జి.మాడుగుల: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం ఈనెల 9న ఏజెన్సీలో కాకుండా విశాఖపట్నంలో నిర్వహించడంపై సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. ఆదివాసీల సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాలు నిరశిస్తున్నాయి. ప్రచార ఆర్భాటం కోసమే అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు పేరిట ఆదివాసీలను జిల్లా కేంద్రానికి తరలిండం అర్థరహితమని దుయ్యబడుతున్నారు. మైదానంలో కాకుండా ఏజెన్సీలో నిర్వహించాలని శుక్రవారం జి.మాడుగుల మండలపరిషత్ సమావేశంలో తీర్మానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎంపీపీ ఎం.వి.గంగరాజు, ఎంపీటీసీలు, సర్పంచులు ప్రభుత్వ తీరుపై సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను కించపరిచే విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉండగా ఏ ఒక్కరి పేరును ఆహ్వాన పత్రికలో చేర్చలేదని తప్పుపట్టారు.
ఇది ఆదివాసీలను కించపరచడమేనని బీజేపీ జిల్లా కార్యదర్శి కురసా ఉమా మహేశ్వరరావు, మండలశాఖ అధ్యక్షుడు సల్లా రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు గిరిజన ప్రజల పట్ల, గిరిజన సంస్కృతిపట్ల గౌరవం ఉంటే పాడేరు ఐటీడీఏ పరిధిలో ఆదివాసీల మధ్య నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను రద్దు చేస్తూ తీర్మానించాలన్నారు. ఆదివాసీ దినోత్సవ సభ ను విశాఖలో నిర్వహించడంపై ఆదివాసీలంతా సమైక్యంగా ఖండించాలని పిలుపునిచ్చారు.