సాక్షి, సీతంపేట(శ్రీకాకుళం) : మన్యం గజగజలాడింది. ఐటీడీఏ పరిధిలోని గ్రామాలను పన్నెండేళ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఏనుగుల గుంపులోని ఓ మదగజం మారణకాండకు పాల్పడింది. సోమవారం ఈతమానుగూడ గ్రామానికి చెందిన సవర గయ్యారమ్మ (53), మండ గ్రామానికి చెందిన సవర బోడమ్మ(65)లను పొట్టనపెట్టుకుంది. సీతంపేట మండలంలో ఏనుగు దాడికి దిగడం పన్నెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం. మిగతా మండలాలపై ప్రతాపం చూపిన ఏనుగుల గుంపు సీతంపేట మండలాన్ని మాత్రం కనికరించాయి. 2007 అక్టోబర్ నెలలో మన్యంలో ప్రవేశించిన ఏనుగుల గుంపు మండలంలోని కోదుల వీరఘట్టం గ్రామానికి చెందిన పసుపురెడ్డి అప్పారావు, సిరిపోతుల మరియమ్మలను చంపేశాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు మరో ఇద్దరిని హతమార్చాయి. ఐటీడీఏ పరిధిలో 13 మందిని ఇప్పటి వరకు వివిధ గ్రామాల్లో పొట్టన బెట్టుకున్నాయి
పని చేసుకుంటుంటే..
ఈతమానుగూడకు చెందిన గయ్యారమ్మ కొండపోడు పనులుచేస్తుండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపులో ఓ ఏనుగు దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందిం ది. అలాగే మండ గ్రామానికి చెందిన బోడమ్మ, శ్రీరంగమ్మలు కొండపోడు పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఏనుగులు కనిపించడంతో శ్రీరంగమ్మ పరుగు లంకించుకుని తప్పించుకుంది. బోడమ్మ మాత్రం తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఏనుగు తీవ్రం గా దాడి చేసి గాయపర్చడంతో స్థానికులు ఆమెను సీతంపేట సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి పాలకొండ రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి విషమించడంతో శ్రీకా కుళం రిమ్స్‌కు తరలించాలని చెప్పారు. రిమ్స్‌కు తరలించగా అక్కడే ఆమె మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తొండంతో తెచ్చి..
గయ్యారమ్మపై కొండపైన దాడి చేసిన ఏనుగు ఆమెను చంపేసి తొండంతో పట్టుకుని వచ్చి గ్రా మ పొలిమేరల్లో చెట్టు కింద పడేసిందని గిరిజనులు తెలిపారు. కిలోమీటరున్నర దూరంలో ఎత్తైన కొండపై కొండపోడు పని చేస్తుంటే అక్కడ దాడి చేసిన ఏనుగు మృతదేహాన్ని తొండంతో తీసుకురావడం, గ్రామానికి సమీపంలో ఓ భారీ వృక్షం వద్ద పడేసి వెళ్లిపోవడం ఆశ్చర్యానికి గురి చేశాయని స్థానికులు చెబుతున్నారు. తామంతా వేర్వేరు చోట్ల కొండపోడు పనులు చేసుకుంటున్నామని, ఒక్కసారిగా వచ్చిన ఏనుగు భయంకరమైన అరుపులతో తన తల్లిపై దాడి చేసిందని మృతురాలి కుమారుడు ఈశ్వరరావు తెలిపారు. అలాగే గ్రామంలో ఓ మరుగుదొడ్డిని కూడా నాశనం చేసిందన్నారు.
గంటల వ్యవధిలోనే..
గంటల వ్యవధిలోనే ఒకే ఏనుగు ఇద్దరిని చంపేసి బీభత్సం సృష్టించింది. మొదట కొండపోడు పనుల కోసం మండ నుంచి సుదూర ప్రాంతానికి నడిచివెళ్తున్న బోడమ్మపై దాడి చేసిన ఏనుగు అక్కడకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈతమానుగూడకు చేరుకుని అక్కడ పోడు పనులు చేస్తున్న గయ్యారమ్మపై దాడి చేసి చంపేసింది. ఏజెన్సీలో తిరుగుతున్న నాలుగు ఏనుగుల గుంపులో కొద్ది రోజుల కిందట ఒక ఏనుగుకు విద్యుత్‌షాక్ తగిలి మతి భ్రమించిందని ఆ ఏనుగు మాత్రమే ఈ తరహా దాడులకు తెగబడుతోందని అటవీ శాఖ సిబ్బంది తెలియజేస్తున్నారు. ఓ వైపు 3 ఏనుగులు సంచరిస్తుంటే మరో వైపు ఒక ఏనుగు మాత్రం వేరేగా తిరుగుతోందని చెబుతున్నారు. కొండపో డు పనులు వంటివి చేయడానికి వెళ్లాలంటే భయమేస్తోందని ఆయా గ్రామాల గిరిజనులు వాపోతున్నారు. గత మూడు నెలలుగా సీతంపేట మండలంలోనే ఏనుగులు తిష్టవేశాయి. మొదట చిన్నబగ్గ అటవీ పరిధిలో బగ్గ ఫారెస్ట్ రేంజ్‌లో ఉన్న నాలుగు ఏనుగుల గుంపు బొండి సమీపంలో ఊటబావి వద్ద పక్షం రోజులకు పైగా గడిపాయి. అనంతరం కొండాడ, మేడ ఒబ్బంగిల్లో మరికొన్ని రోజులున్నాయి. అంటికొండ, పెద్దగూడ గ్రామాల్లో నాలుగు రోజుల కిందటి వరకు సంచరించాయి. తాజాగా మండ, జొనగ, ఈతమానుగూడ ప్రాంతాల్లో సంచరిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment