‘ఉపకారం’ హుళక్కేనా ?
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలోని వందలాది మంది గిరిజన విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ శాఖకు కోట్లాది రూపాయలు మంజురు చేస్తుంటే.. వాటిని విద్యార్థులకు అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు మంజురైన రూ.1.86 కోట్ల నిధుల్లో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేయగా, మిగితా రూ.1.74 కోట్లువెనక్కి మళ్లాయంటే వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి8వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పేద విద్యార్థులకు ఆర్థికంగా దోహదపడేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తోంది. ఇందుకోసం 2014-15 సంవత్సరానికి రూ.1కోటి 86 లక్షలు కేటాయించింది. జనవరిలో గిరిజన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలి.
అంతేకాక అందరికీ తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తుల విషయం చాలామందికి తెలియలేదు. తెలిసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు రెండు నెలలకు పైగా పట్టింది. ఎందుకంటే చదువుతున్న పాఠశాల నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువ పత్రాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలా సుమారు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, అందులో 960 మందికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అదే అంతకుముందు సంవత్సరం రెండు వేల మందికి అందజేశారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు దాదాపు నాలుగు వేలకు పైగా ఉంటారని విద్యా శాఖ అధికారుల అంచనా. ఈ లెక్కన చూస్తే ఇంకా కనీసం మూడు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద మొత్తంలో రాకపోవడానికి గిరిజన సంక్షేమాధికారులు ప్రచారం నిర్వహించకపోవడం, పాఠశాలల ప్రధానోపాద్యాయులకు సకాలంలో సమాచారం అందించకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వందలాది గిరిజన పేద విద్యార్థులకు విషయం తెలియక, ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడంతో ఒక సంవత్సరానికి సంబంధించిన స్కాలర్‌షిప్‌లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అధికారులకు అక్షింతలు...!
పేద గిరిజన విద్యార్థులకు అందిచే స్కాలర్‌షిప్ నిధులను కనీసం యాబై శాతం కూడా ఖర్చు చేయకపోవడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, కమిషనర్ మహేశ్ ఎక్కా, ప్రిన్సిపల్ సెక్రెటరీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తుంటే పేద విద్యార్థులకు అందించకపోవడం చూస్తే మీ నిర్లక్ష్యం ఏంటో తెలిసిపోయిందని మండిపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.1కోటి 86 లక్షలు ఇస్తే అందులో 960 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ఖర్చు చేయడంపై సీరియస్ అయ్యారని తెలిసింది. ఇప్పటికైనా పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించినట్లు సమాచారం.