నిజామాబాద్ అర్బన్/ఇందూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్న భారీ లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. మరోవైపు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి పెంచుతున్నాయి. నిధుల విడుదలలో మొదటి నుంచి జాప్యం నెలకొనడం ఒక కారణం కాగా, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయా సంక్షేమ శాఖల ఖాతాలను స్తంభింప జేశారు. దీంతో నిధుల విడుదలకు బ్రేక్ పడింది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో వివిధ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్‌షిప్, ఫీజు రీ యింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నా రు. ఇందులో సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో ఫ్రెష్ విద్యార్థులు 7,634 మంది, రెన్యువల్ విద్యార్థులు 6,693 మంది ఉన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 5 కోట్ల 24 లక్షలు, ఉ పకార వేతనాల కోసం రూ. 6 కోట్ల 77 లక్షలు ఇప్పటి వరకు మంజూరయ్యాయి. ఇంకా ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రూ. 47 లక్షలు, ఉపకార వేతనాలకు రూ. కోటీ 29 లక్షలు విడుదల కావాల్సి ఉంది.
బీసీ సంక్షేమ శాఖ విషయానికి వస్తే రెన్యువల్ వి ద్యార్థులు 27,347, ఫ్రెష్ విద్యార్థులు 23,787మంది ఉన్నారు. ఇందులో ఉపకార వేతనాల కోసం రూ. 32 కోట్ల 3 లక్షలు, రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 18 కోట్ల 7 లక్షలు మంజురయ్యాయి. అయితే 23,787 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఉపకార వేతనాలు నేటికీఒక్క రూపాయి కూడా రాలేదు. రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ. 5 కోట్ల 50 లక్షలు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ. 15 కోట్ల 25 లక్షల నిధులు ఇంకా మంజూరు కావాల్సి ఉంది. ఈబీసీ విద్యార్థులు 3,547 మందికి గాను ఉపకార వేతనాలు రూ. 3 కోట్ల 25 లక్షలు రావాల్సి ఉంది.
గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి రెన్యువల్ విద్యార్థులు 3,619 మంది ఉండగా, ఫ్రెష్ విద్యార్థులు 3,949 మంది ఉన్నారు. రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి రూ. కోటీ 72 లక్షలు, ఉపకార వేతనాలకు సంబంధించి రూ. 2 కోట్ల 59 లక్షలు మంజురయ్యాయి. ఇంకా ఉపకార వేతనాల కోసం రూ. 3 కోట్లు రావాల్సి ఉంది. ఈ విద్యా సంవత్సరానికి 3,949 మంది ఫ్రెష్ విద్యార్థులకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు సంబంధించి రీయింబర్స్‌మెంట్ కోసం మొత్తం రూ. 6 కోట్లు, ఉపకార వేతనాల కోసం రూ. 22 కోట్ల 79 లక్షలు రావాల్సి ఉంది. కాగా ఫీజులు చెల్లించాలంటూ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ‘‘మీరైతే ముందుగా ఫీజులు చెల్లించండి.. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత తిరిగి మీకే ఇస్తాం’’ అంటూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూళ్లు చేస్తున్నారని సమాచారం. కళాశాలలకు సెలవులు ఉన్నా... ఫోన్ ద్వారా విద్యార్థులను వేధిస్తుండడం గమనార్హం. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు.
‘ఉపకారం’ ప్రశ్నార్థకం?
Published Thu, Jun 5 2014 1:55 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement