Officers negligence
-
పట్టాలు ఇచ్చారు... లే అవుట్లు మరిచారు
సాక్షి, గూడూరు: అధికారుల నిర్లక్ష్యంతో పేదలు అవస్థలు పడుతున్నారు. చేనేత ఆధారిత గ్రామమైన కప్పలదొడ్డిలో అర్హులైన నేత కార్మికులు ఇళ్ల స్థలాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దాదాపు 200 పైచిలుకు కుటుంబాలు నిలువ నీడ లేక అద్దె ఇళ్లల్లో బిక్కుబిక్కు మంటూ జీవనం సాగిస్తున్నారు. నివేశన స్థలాలను పంపిణీ చేయమని అనేక మార్లు గ్రామస్తులు ఆందోళనలకు దిగినా ప్రభుత్వాలు మాత్రం కనికరించడం లేదు. 15 ఏళ్లుగా నిరీక్షణ... గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని గత 15 సంవత్సరాలుగా ప్రజలు కోరుతున్నారు. అయితే అప్పట్లో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం స్థలాన్ని సేకరించింది. గ్రామంలో హైస్కూల్ వెనుక భాగంలో 4.16 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అయితే అప్పుడు ఎన్నికలు రావడం... లబ్ధిదారుల ఎంపిక పూర్తికాక పట్టాల పంపిణీ ఇవ్వలేదు. 2012లో పట్టాలు పంపిణీ 2009లో పెడన ఎమ్మెల్యేగా గెలిచిన జోగి రమేష్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. వీరందరికీ 2012లో పట్టాల పంపిణీ చేశారు. అయితే ఆయన ముందస్తుగా రాజీనామా చేయడంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేకపోయారు. దీంతో స్థలాల్లో తుమ్మ చెట్లు పెరిగి చిట్టడివిని తలపిస్తున్నాయి. ఇచ్చిన పట్టాలు రద్దు చేసిన టీడీపీ అయితే 2012లో జోగి రమేష్ ఎమ్మెల్యేగా ఉండగా ఇచ్చిన పట్టాలను ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. లబ్ధిదారుల జాబితాను మళ్లీ ఎంపిక చేయాలంటూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసిన అప్పటి పాలకులు ఎన్నికలకు ఆరు నెలల ముందు హడావుడిగా పట్టాలు పంపిణీ చేశారు. ఎంపిక చేసిన 155 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలకు సంబంధించిన ఫొటో స్టాట్ కాపీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ స్థలాలకు సంబంధించిన లే అవుట్ మాత్రం వేయలేదు. దీంతో స్థలం ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. -
సినిమా చూపిస్త మావా!
రోజువారీ సాధక బాధకాల నుంచి సగటు జీవికి ఊరటనిచ్చే ‘సినిమా’ ప్రస్తుతం ప్రియంగా మారింది. ప్రేక్షకులకు కార్పొరేట్ మల్టీఫ్లెక్స్ థియేటర్లోకి వెళ్లక ముందే యాజమాన్యాలు సినిమా చూపిస్తున్నాయి. పెద్ద హీరో సినిమాకు టికెట్లతోపాటు కాంబో ప్యాక్, ఆర్డినరీ ప్యాక్ కొనుగోలు తప్పనిసరి చేస్తున్నాయి. అప్పటికే చేతిచమురు వదిలించుకున్నప్పటికీ ఇంటర్వెల్లో అసలు సినిమా మొదలవుతోంది. కేవలం స్నాక్స్‌కే రూ.800 నుంచి రూ.1000 వెచ్చించాల్సి వస్తోంది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి, నెల్లూరు : పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మాత్రం అభిమానుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. మల్టీఫ్లెక్స్ థియేటర్లలోనే అభిమాన హీరోల సినిమాల రిలీజ్ అవుతుండడంతో అక్కడికే వెళ్లి సినిమా చూడాల్సివస్తోంది. కేవలం పాప్ కార్న్, కూల్‌డ్రింక్ బాటిల్ చేతిలో పెట్టి రూ.600 వంతున వసూలు చేస్తున్నారు. థియేటర్లలో టికెట్ రూ.150 వంతున వసూలు చేస్తుండగా కాంబో పేరుతో స్నాక్స్ అంటూ మరో రూ.450 అదనంగా పెంచి టికెట్లు ఇస్తున్నారు. ఎవరు చెప్పినా.. నెల్లూరు నగరంలో 3 మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. అందులో ఒక్క మల్లీఫ్లెక్స్లో సగటున 6 స్కీన్లు ఉన్నాయి. ప్రతిచోటా స్నాక్స్ పేరుతో అడ్డుగోలు దోపిడీ చేస్తున్నారు. థియేటర్ వెలుపల కొనుగోలు చేసిన ఏ తినుబండారమూ లోనికి అనుమతించడం లేదు. థియేటర్ క్యాంటీన్లోనే కొనుగోలు చేయాలి. ఆఫ్ లీటర్ వాటర్ బాటిల్ రూ.50, చిన్న పాప్‌కార్న్‌కు రూ.170, కోల్డ్ కాఫీ రూ.150, పిజ్జా, కోక్ రూ.200, స్వీట్స్ కేక్స్ రూ.80.. ఇలా 28 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటీ రూ.100 నుంచి రూ.300 పైనే నిర్ణయించి విక్రయాలు చేస్తున్నారు. ప్రతి స్నాక్స్‌పై జీఎస్టీ బాదుడు అదనంగా వసూలు చేస్తున్నారు. పార్కింగ్ పేరుతో దోపిడీ మల్టీఫ్లెక్స్‌లలో పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారు. పార్కింగ్ వసతి ఉన్న చోట్ల సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రుసుము వసూలు చేయకూడదు. అయినా నిర్వాహకులు యథేచ్ఛగా వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మాల్స్‌లో ద్విచక్రవాహనానికి రూ.20, కారు అయితే రూ.40 వంతున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ పక్కా దోపిడీకి పాల్పడుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. న్యాయస్థానం తీర్పుతోనైనా.. మల్టీఫ్లెక్స్ థియేటర్ల దోపిడీపై గతంలో వినియోగదారుల న్యాయస్థానం మొట్టికాయ వేసింది. వినోదం కోసం వెళ్లి వినియోగదారుడు జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిరావడంపై న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. మల్టీఫ్లెక్స్ థియేటర్లో దోపిడీపై ఫోరానికి వెళ్లిన బాధితుడికి నష్టపరిహారం చెల్లించేలా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చి ఏడాది కావస్తున్నా అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఇకనైనా తూనికలు, కొలతల శాఖ అధికారులు న్యాయస్థానం తీర్పును అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ ఒత్తిళ్లు.. నెలవారీ మామూళ్లు మల్టీఫ్లెక్స్ థియేటర్లలో దోపిడీపై తెలంగాణ రాష్ట్రంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు కన్నెర్ర చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రతి థియేటర్ వద్ద స్నాక్స్ ఎమ్మార్పీ ధరల పట్టిక తెలుగులో రాసిన బోర్డు పెట్టాలని, నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మల్టీఫ్లెక్స్ థియేటర్లలోకి అధికారులు వెళ్లే సాహసం చేయడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు దోపిడీకి గురవుతున్న వినియోగదారుడికి న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అవును..అక్కడ అన్నీ ఐరావతాలే
సాక్షి, ఒంగోలు సిటీ: ఎన్నికల వేళ పేరుకే మీడియా కేంద్రం. ఇక్కడ సమాచారమే మృగ్యం. ఆ కేంద్రంలో అన్నీ తెల్ల ఏనుగులే. పని చేసేదే లేదు. వాటికి మొక్కినా ఫలితం శూన్యం అన్నది తేటతెల్లం. మీడియా కేంద్రంలోని ఐరావతాల వల్ల జిల్లా పౌరులకు ఎన్నికల వేళ అందాల్సిన సమాచారం వస్తేనా. యథారాజా తథాప్రజా అన్నట్లుగా సిబ్బంది పనితీరు ఉంది. జిల్లా కేంద్రంలో ఈ మీడియా పాయింట్ పేరుకు మాత్రమే. తాత్కాలికంగా మీడియా సెంటర్ బోర్డు. దానికి ఆనుకొని నిక్నెట్ శాఖ బోర్డు కూడా ఉంటుంది. ఇంతకీ ఈ కార్యాలయంలో ఏ విభాగం నడుస్తుందో కూడా తెలియని పరిస్థితి. అంతా అయోమయం. జిల్లా ఏర్పడిన తర్వాత మీడియా కేంద్రం నిర్వహణలో ఇంతటి లోపాలు ఎప్పుడూ ఎదురుకాలేదు. జిల్లా పరిపాలనా కేంద్రం ప్రకాశం భవన్‌లోకి వచ్చేటప్పుడు దక్షిణం వైపు ఉన్న ప్రజాఫిర్యాదుల విభాగం గదిలో ప్రత్యేకంగా మీడియా కేంద్రం నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఇక్కడ మీడియా పాయింట్ ఉంటుంది. టెలిఫోన్, కంప్యూటర్, ఫ్యాక్స్ సదుపాయం ప్రత్యేకంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఒంగోలు, బాపట్ల లోక్‌సభ అభ్యర్థులు నామినేషను వేసి ఇక్కడ మీడియాతో మాట్లాడేవారు. అక్కడి నుంచే ఫొటోలు, ఇతర సమాచారాన్ని చేరవేసుకొనే సదుపాయం ఉండేది. ఈ దఫా ఎన్నికల్లో అందరూ భావిస్తున్నట్లుగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా అవసరం లేదనుకున్నారేమో..ఈ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశారన్న విమర్శలున్నాయి. పై అంతస్తులో మీడియా కేంద్రం ప్రకాశం భవన్ మొదట్లోనే ఉండే మీడియా కేంద్రం ఈ ఎన్నికల సందర్భంగా లేకుండా పోయింది. ఇక్కడ అభ్యర్థులకు నామినేషన్ ఫారాలు ఇచ్చే విభాగంగా మార్చేశారు. ఇంతకీ మీడియా కేంద్రం ఎక్కడ పెట్టారంటే .. ప్రకాశం భవన్ టాప్‌ఫ్లోర్‌లోని నిక్నెట్ కేంద్ర కంప్యూటర్ విభాగంలో ఏర్పాటు చేశారు. అక్కడికి మీడియా వెళ్లాలంటే ప్రకాశం భవన్ ఇన్, అవుట్ గేట్ల వద్దే అనుమతి లేదంటూ నిలిపివేస్తున్నారు. ఎన్నికల వేళ కదలరు..మెదలరు ఎన్నికల వేళ అధికారులు కదలడం లేదు. ఏ సమాచారం అడిగినా సంబంధిత రిటర్నింగ్ అధికారుల నుంచి స్పందన లేదంటున్నారు. ఎన్నికల వేళ వచ్చే ఫిర్యాదులు, ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఉత్తర్వులు, ఓటర్లను చైతన్య పరిచే ఉత్తర్వుల ఇతర సమాచారం ఏది అడిగినా స్పందన కొరవడుతోంది. అసలు విషయం ఏమిటంటే ఇక్కడ రెగ్యులర్ ఐఎన్పీఆర్ ఏడీ లేకపోవడమే ప్రధాన సమస్య. డీపీఆర్వోకే ఏడీ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. కందుకూరు, మార్కాపురంలోనూ డివిజనల్ పీఆర్వోలు లేరు. ఇద్దరు ఏపీఆర్వోలు జిల్లా కేంద్రంలో ఉన్నారు. రెగ్యులర్ ఏడీ లేరనే డ్వామా పీడీని కోఆర్డినేటింగ్ అధికారిగా నియమించారు. ఆయనతోనూ వీరు సక్రమంగా సహకరించే పరిస్థితి లేదు. ఎన్నికలకు సంబంధించిన నిత్యం లావాదేవీలు పరిశీలించేందుకు ప్రధానంగా 23 బృందాలను నియమించారు. ఈ బృందాలకు కోఆర్డినేటింగ్ అధికారులను నియమించారు. వీరి నుంచి సమాచారాన్ని సేకరించి మీడియాకు అందజేయాలి. అదే సక్రమంగా జరగడం లేదు. సమాచార సేకరణ ప్రయాసే జిల్లా వ్యాప్తంగా రిటర్నింగ్ అధికారుల నుంచి నామినేషన్లు ఇతర సమాచారాన్ని గడువు ముగిసిన తర్వాత వేగంగా సేకరించి ఇవ్వాలి. నామినేషన్లను వేసిన అభ్యర్థుల అఫిడవిట్లు ఇతర సమాచారాన్ని రోజు గడినా ఇంకా ఆర్వోల వద్ద నుంచి రాలేదన్న జవాబు చెబుతున్నారు. మీడియా కేంద్రంలో తగిన వసతి ఉంటే అక్కడికి వచ్చి సేకరించుకొనే వీలుంది. పేరుకు మీడియా కేంద్రం అయినా అక్కడ పాత్రికేయులకు, మీడియా విలేకర్లకు వసతి లేదు. వారికి సదుపాయం కల్పించలేదు. అధికారులను ఏ సమాచారం అడిగిన తెల్లముఖం వేస్తున్నారు. అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పుడు వారు మీడియాతో మాట్లాడాలంటే మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయలేదు. అదేమంటే అధికారులు నోరుమెదపరు. ఐదు రోజులు గా జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులు రిటర్నింగ్ అధికా రుల కార్యాలయాలకు వంద మీటర్ల దూరం తర్వాత మాత్రమే మీడియా పాయింట్‌ను అనుమతించారు. అభ్యర్థులు అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడాలి. నడి బజారులో ఈ కేంద్రం తాత్కాలికంగా మీడియా నిర్వహించుకోవడం గమనార్హం. మీడియా పాయింట్ సమగ్రంగా లేకపోవడం ఇతర సమస్యల గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. -
సాగర్ కాంట్రాక్టర్ పరార్...!
‘వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు పనులను ఇక పరుగెత్తిస్తా..! నిధులు మంజూరయ్యాయి. ఇక కొద్ది రోజుల్లో సాగునీరు అందిస్తాం...’ ఇవీ మంత్రి పదవి వచ్చిన వెంటనే సుజయకృష్ణ రంగారావు రైతులకు ఇచ్చిన హామీ. అయితే ఈ పనులు ఇప్పుడు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పనులకు సంబంధించి ఇటు మంత్రిగాని, అటు ప్రభుత్వంగాని పట్టించుకోవడం లేదు. దీంతో సాగునీటి కోసం అదనపు ప్రాజెక్టుపై ఆధారపడిన రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి : వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్ పనులను 20 శాతం కూడా చేయకుండానే కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. పనులు ప్రారంభించి కొన్ని చోట్ల చేపట్టిన పనులను ఎక్కడివక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేయడమే తప్ప వాటిని పట్టించుకోవడం లేదు. సరికదా కనీసం వారు చేసిన ఫోన్లనూ లిఫ్ట్ చేయడం లేదు. వెంగళరాయ సాగర్ పనులు ఈ ఖరీఫ్‌కే కాదు వచ్చే ఖరీఫ్‌కు కూడా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. 2013లో శంకుస్థాపన చేసినపుడు ఈ సాగునీటి ప్రాజెక్టు ద్వారా రైతులకు కేవలం 18 నెలల్లో సాగునీరు అందిస్తామని మంత్రి సుజయకృష్ణ రంగారావు ఎమ్మెల్యే హోదాలో హామీ ఇచ్చారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మళ్లీ ఎన్నికై ఆ తరువాత పార్టీ మార్చి మంత్రి అయిన తరువాత జూట్ ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా అదనపు జలాల ప్రాజెక్టునూ పరుగులెత్తిస్తామన్నారు. కానీ ఏ పనీ సాగడం లేదు. మంత్రి పదవి వచ్చాక ఇచ్చిన హామీ కనుక ఇక మాకు భయం లేదు...సాగునీరు అందుతుందనుకుంటున్న రైతులు ఇప్పుడు మా నోట్లో మట్టికొట్టారని వాపోతున్నారు. వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులను చేపడుతున్న ఆర్ఆర్ కనస్ట్రక్షన్స్ పనులను నిలిపివేసి ఏడాదవుతున్నా అధికారులుగానీ, ఇటు పనులు ప్రారంభించి సాగునీరందిస్తామన్న మంత్రి సుజయకృష్ణ రంగారావుగానీ పట్టించుకోకపోవడంతో అదనపు ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 శాతం లెస్సుకు వేసినపుడే అనుమానం రావాలిగా! వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనుల కాంట్రాక్టర్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ టెండర్‌ను 17 శాతం లెస్సుకు వేశారు. అప్పుడైనా ప్రజాప్రతినిధులు, అధికారులకు అనుమానం రావాలి. కానీ ఎంచక్కా పనులు ప్రారంభించారు. ఇప్పుడు నష్టాలొస్తున్నాయంటూ పనులు నిలిపివేశారు. నిధులేమో మూలుగుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. ప్రారంభంలో కాంట్రాక్టర్‌కు ప్రతీ 15 రోజులకూ నోటీసులు జారీ చేస్తున్నప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయన్న కాంట్రాక్టర్ ఇప్పుడు ఏకంగా ఫోన్లు కూడా ఎత్తడం లేదని అధికారులు చెబుతున్నారు. భూ సేకరణే పూర్తి కాని వైనం 2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయోనని రైతాంగం ఎదురు చూస్తున్నది. సీతానగరం మండలంలోని 5 గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబందించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌కు ఇచ్చిన గడువు పలుమార్లు దాటిపోయింది. ఇప్పటికి రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడం కానీ మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడం కానీ చేయాలి. ఆ తరువాత కొత్తగా టెండర్ వేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ నేటికీ కాంట్రాక్టర్‌ను మార్చే ప్రతిపాదనలు కానీ ప్రభుత్వానికి నివేదించడం కానీ చేయకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని రైతులు ఆరోపిస్తున్నారు. వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం 23.78 ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ కాంట్రాక్టర్‌కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్‌తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది. ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్సీఎస్ చక్కెర కర్మాగారం వద్ద రూ.3కోట్లతో వయాడెక్ట్ నిర్మించేందుకు భూసార పరీక్షలు చేసేందుకు సుమారు పది నెలలవుతోంది. ఎస్ హయాంలోనే శంకుస్థాపన జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టుగా పేరొందిన వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ద్వారా 24వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరందుతున్నా జలాశయ సామరŠాధ్యన్ని బట్టి మరో 8వేల ఎకరాలకు సాగునీరందించవచ్చని గతంలో ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొల్లపల్లిలో రూ.5కోట్లతో కిందట అదనపు ఆయకట్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనులు వరుసగా అంచనాలను పెంచుకుంటూ పోయి నేటికి రూ.12.67 కోట్లకు చేరింది. ఈ పనులను చిత్తూరుకు చెందిన కాంట్రాక్టర్ ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేపట్టింది. కేవలం 13 నెలల్లోనే ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా పనులు సాగుతూనే ఉన్నాయి. నేటికి కేవలం 20 శాతం పనులు అయ్యాయని అధికారులు చెబుతున్నా అంతకన్నా తక్కువే అయ్యాయని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రభుత్వానికి రాస్తాం.. కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. ఎన్నోమార్లు నోటీసులు ఇచ్చాం. స్పందన లేదు. ఇప్పుడు ఫోన్లు చేసినా ఎత్తడం లేదు. కొత్తగా మరే కాంట్రాక్టర్ కూడా లెస్సుకు ఉండటం వల్ల రావడం లేదు. ఈ విషయమే ప్రభుత్వానికి రాస్తున్నాం. – కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్ -
ఒకరి బుక్కు, చెక్కు మరొకరికి!
నారాయణపేట : రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తుంటే మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండల అధికారుల నిర్లక్ష్యంతో అనర్హుల చేతికి చిక్కుతోంది. నారాయణపేట మండల పరిధిలోని చోటు చేసుకుంటున ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొన్న సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు, నిన్న చిన్నజట్రంలో చనిపోయిన వారికి రైతుబంధు అందజేసిన ఘటనలు మరువకముందే.. మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఒక రైతుకు సంబంధించిన పాసుపుస్తకం, చెక్కు మరో రైతుకు అందించిన వైనం వెలుగు చూసింది. ఆ రైతు తమ పాసుబుక్కు, చెక్కు కానప్పటికి పాసుపుస్తకాన్ని ఇంట్లో భద్రపర్చుకుని చెక్కును డ్రా చేసుకోవడం గమనార్హం. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత రైతు మంగళవారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఎదుట తమ గోడు వినిపించారు. ఇలాంటి ఘటనలతో నారాయణపేట మండలంలోని రెవెన్యూ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి నారాయణపేట విశ్వనాథ్‌ది మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో నారాయణపేటకు చెందిన విశ్వనాథ్ తండ్రి బసప్ప పేరిట సర్వే నంబర్ 269/అ, 277/అ/అ, 280/అ/అ, 281/అ/అ, 274/అ/అ, 275/అ/అ, 276/అ/అ లో మొత్తం 4.17 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివరాలు పట్టా నంబర్ 457 ద్వారా పాత పాసుపుస్తకంలో పొందుపర్చారు. అయితే అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడైన విశ్వనాథ్ ఈ కొత్త పాసుపుస్తకాన్ని, చెక్కును సంబంధిత వీఆర్ఓ నుంచి తీసుకెళ్లారు. అయితే వాస్తవానికి ఈ విశ్వనాథ్‌కు ఒక ఎకరా పైబడి మాత్రమే భూమి ఉన్నట్లు సమాచారం. పెట్టుబడి సాయం రూ.17,700 నారాయణపేటకు చెందిన బసప్ప కుమారుడు విశ్వనాథ్. ఈయనకు మొత్తం 4.17 భూమితో పాటు పూర్తి వివరాలు కొత్తపాసుపుస్తకంలో పొందుపర్చగా వీటిని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడు విశ్వనాథ్ పాస్బుక్కు, చెక్కును తీసుకెళ్లారు. ఈ రైతుకు సంబంధించిన పెట్టుబడి కింద రూ.17,700 ప్రభుత్వం చెక్కు రూపంలో అందజేసింది. కానీ అప్పిరెడ్డిపల్లి రైతు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండగా చెక్కును బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడమే కాకుండా పాస్బుక్కు తన వద్ద ఉంచుకుని వేధిస్తున్నాడని నారాయణపేటకు చెందిన రైతు విశ్వనాథ్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వారం క్రితం వెలుగులోకి రాగా అప్పిరెడ్డిపల్లి రైతు విశ్వనాథ్‌తో పాటు ఆ గ్రామ వీఆర్ఓ బసప్పను కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా.. ‘మీరు పట్టాదారు కాదు... మీకు ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అనే సమాధానం ఇవ్వడంతో విశ్వనాథ్ కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశ్వనాథ్‌కు సమాచారం ఇచ్చి మంగళవారం తహసీల్దార్ దగ్గరికి వెళ్లడంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని సలహా ఇచ్చారే తప్ప పాసుపుస్తకం ఇప్పించే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత డీటీ దగ్గరకు వెళ్లి తమ దగ్గర పాసుపుస్తకాల వివరాలను ముందుంచి బోరుమన్నారు. విచారణ ప్రారంభించిన తహసీల్దార్ నారాయణపేట రూరల్ : మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన చెక్కును బినామీ వ్యక్తి రెవెన్యూ సిబ్బంది సహకారంతో డ్రా చేసుకున్న వైనంపై వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ‘రెవెన్యూ లీలలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు నారాయణపేట తహసీల్దార్ స్పందించి విచారణ ప్రారంభించారు. చెక్కు పంపిణీ సమయంలో అనుసరించిన విధానం, తీసుకున్న చర్యలపై సంబంధిత వీఆర్వో కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అలాగే, వదూద్ పేరుతో చెక్కు పొందిన హైదరాబాద్ వాసితో పాటు ఆ భూమి తమదంటూ ఫిర్యాదు చేసిన రజియాబేగంకు నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలతో కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అసలు వ్యక్తులకు కొత్త పాసుపుస్తకం జారీ చేయడంతో పాటు ఫోర్జరీ చేయాలని చూసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతామని తహసీల్దార్ తెలిపారు. -
సెంటర్ ఎటెట్టా
సాక్షి, బద్వేలు : టెట్ పరీక్ష అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. పరీక్షా కేంద్రాలు ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యం అభ్యర్థులకు శ్రమతో పాటు ఆర్థికంగా ఇబ్బందులు పడేలా చేస్తోంది. జిల్లాలోని అభ్యర్థులకు సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపు మూడు వేల మంది ఇతర జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఈ నెల 10 నుంచి 19 వరకు జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ... జిల్లావ్యాప్తంగా 25 వేల మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సరిపోయే స్థాయిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. మొదట దరఖాస్తు అనంతరం గత నెల 25 నుంచి 29 వరకు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం కల్పించారు. మొదటి రోజు మధ్యాహ్నం లోపే డీఎడ్ అభ్యర్థులకు జిల్లాలో కేటాయిం చిన పరీక్షా కేంద్రాలన్నీ భర్తీ అయ్యాయి. సాయంత్రానికి మిగిలిన స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను తప్పని సరి పరిస్థితుల్లో ఇతర జిల్లా పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిం ది. కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశించినా వారి ఆశలపై అధికారులు నీళ్లు జల్లారు. గతంలో మాదిరే... టెట్–2017లో దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షా కేంద్రాల కేటాయింపులో ప్రభుత్వం చుక్కలు చూపింది. వారు కోరుకున్న కేంద్రాలను ఇవ్వకుండా చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ప్రస్తుత టెట్‌లో అలాంటి పరిస్థితి రాదని చెప్పిన అధికారులు తీరా దగ్గరికి వచ్చేసరికి చెతులేత్తాశారు. మరోసారి అలాంటి పరిస్థితే కల్పించి నిరుద్యోగులతో చెలగాటం అడుతున్నారు. జిల్లాలో పది కేంద్రాలే... జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పట్టణాలలో పది కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. గత నెల 29వ తేదీ తరువాత పరీక్షా కేంద్రాల మార్పునకు అవకాశం కల్పిస్తారని ఆశిం చినా మీడియం, సబ్జెక్టు మార్పునకు మాత్రమే అవకాశం కల్పించారు. దీంతో అభ్యర్థులు తీవ్రనిరాశకు గురవుతున్నారు. ∙పరీక్షా కేంద్రం మార్పు చేయాలంటూ ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ అంశం తమ పరిధిలో లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపరు–1 ఎస్జీటీకి 13 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ పేపరు–2కు ఎనిమిది వేల మంది, భాష పండిత పరీక్షకు మూడు వేల మంది, పీఈటీకి 1500 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మంగళవారం నుంచి హాల్‌టిక్కెట్ డౌన్లోడు చేసుకోవచ్చు. ఆందోళనలో గర్భిణులు, దివ్యాంగులు.. టెట్ దరఖాస్తు చేసుకున్న వారిలో గర్భిణులు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కేంద్రాలు ఆన్లైన్లో మొదటి రోజే పూర్తి కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లా కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు. రెండో రోజు నుంచి చిత్తూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై పట్టణాలలోని కేంద్రాలు మాత్రమే కనిపించాయి. తరువాతైనా కేంద్రాల మార్పునకు అవకాశం ఇస్తారని భావించినా ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు మాత్రం కనిపించడం లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష రాయాలంటే ఎలా అని గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే రూ.వేలలో ఖర్చు ప్రస్తుతం ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయాలంటే రూ.వేలల్లో ఖర్చు పెట్టుకోవాల్సిందే. కేటాయించిన కేంద్రాలు కనీసం రెండు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ముందురోజే వెళ్లాలి. బస్సుచార్జీలకు కనీసం రూ.వెయ్యి వెచ్చించాల్సిందే. అక్కడ వసతి, భోజనాలు, ఆటో ఖర్చులకు మరో రూ.వెయ్యికి పైగా కావాలి. గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులకు మరోకరు తోడు ఉండాలి. వీరికి కనీసం రూ.5 వేలు కావాల్సిన పరిస్థితి. -
పురాతన ఆలయానికి అధికారుల నిర్లక్ష్య గ్రహణం
-
పెచ్చులూడుతున్న పైకప్పు
శిథిలావస్థకు చేరిన వైమాందాపూర్ ప్రాథమిక పాఠశాల భవనం భయాందోళన చెందుతున్న విద్యార్థులు, టీచర్లు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు కొల్చారం: మండలంలోని ఏటిగడ్డ మాందాపూర్‌లో ప్రాథమిక పాఠశాల కొనసాగుతోంది. నాలుగు గదుల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 70 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం ఒకటో తరగతిలో 22 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనం పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. భవనం ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉంది. గదుల్లోని పైకప్పులు, వరండాలో పెచ్చులూడిపడుతున్నాయి. ఇనుప ఊచలు తేలి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. వర్షం వచ్చిందంటే పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నారు. గత పది సంవత్సరాల నుంచి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయడం లేదు. పాఠశాల దుస్థితిని ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రత్యక్షంగా చూపించినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదనపు గది నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెబుతున్నా అమలు చేయడం లేదు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ప్రమాదం జరగకముందే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అధ్వానంగా... మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం నిర్మిస్తామని అధికారుల చెబుతున్నా మంజూరు చేయడం లేదు. కనీసం మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజాప్రతినిధులు తగిన చర్యలు తీసుకోవాలి. - దుర్గయ్య, వైమాందాపూర్ అధికారులు స్పందించాలి పాఠశాలలో అన్ని వసతులు, మంచి ఉపాధ్యాయులున్నారు. పాఠశాల భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితి నెలకొంది. మా పిల్లలు భయపడుతున్నప్పటికీ గత్యంతరం లేక పంపిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. - సురేష్, ఎస్ఎంసీ వైస్‌చైర్మన్ దారుణంగా ఉంది ప్రస్తుతం పాఠశాల భవనం పరిస్థితి దారుణంగా ఉంది. వర్షం పడితే గదుల్లోకి నీళ్లు చేరుతున్నాయి. పైకప్పు పెచ్చులూడి పడుతున్నాయి. భయం భయంగానే పాఠాలు చెబుతున్నాం. ఈ విషయాన్ని అధికారులకు చెబుతూనే ఉన్నాం. - దేవరాజ్, హెచ్ఎం -
జోరుగా క్యాట్‌ఫిష్ అమ్మకాలు
ఆ చేపలపై కొనసాగుతున్న నిషేధం అధికారులు పట్టించుకోవడం లేదని యువజన సంఘాల ఆరోపణ కౌడిపల్లి: ప్రజారోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపే నిషేధిత క్యాట్ ఫిష్ (మార్పులు)ను జోరుగా అమ్ముతున్నారు. కౌడిపల్లిలో గురువారం జరిగిన అంగడిలో మంజీర నది పరివాహక ప్రాంతం జోగిపేట, కొల్చారం, పాపన్నపేట ప్రాంతాలకు చెందిన పలువురు వ్యాపారులు క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి విక్రయించారు. అత్యంత కుళ్లిపోయిన జీవరాసుల కళేబరాలను సైతం తిని జీర్ణించుకునే శక్తి క్యాట్‌ఫిష్‌లకు ఉంటుంది. దీంతో వాటిలోని విష పదార్థాలు అలాగే ఉండటం వల్ల వాటిని తిన్నటువంటి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో వ్యాధుల బారిన పడతారు. దీంతో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కౌడిపల్లి అంగడిలో నాలుగైదు వారాలుగా ఒకరిద్దరుగా వచ్చిన వ్యాపారులు అమ్మకాలు నిర్వహించారు. కాగా గురువారం మాత్రం ఏకంగా ఏడుగురు వ్యాపారులు సంచుల్లో క్వింటాళ్లకొద్ది క్యాట్‌ఫిష్‌లను తీసుకువచ్చి అంగడిలో అమ్మారు. ఒక్కో చేప సుమారు 3 నుండి 5 కిలోల వరకు ఉండగా రూ. 200 నుండి 300 వందలకు గుత్త లెక్కన అమ్మకాలు చేపట్టారు. ఈ చేపల వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలియని ప్రజలు వీటిని కొనుగోలు చేశారు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలువురు చెబుతున్నారు. కాగా క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు తెలుసుకున్న గ్రామానికి చెందిన యువజన సంఘం సభ్యులు దుర్గేష్, సుధాకర్, కిషోర్‌గౌడ్‌లు తాము పోలీస్, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా చేపల వ్యాపారులు కౌడిపల్లితోపాటు నర్సాపూర్, పోతన్షెట్టిపల్లి, జోగిపేట, రంగంపేట తదితర అంగళ్లలో క్యాట్‌ఫిష్ అమ్ముతున్నట్లు సమాచారం. -
బకాయిల షాక్
సామాన్యుడు బిల్లు కట్టలేదంటే గడువు ముగిసిన వెంటనే కనెక్షన్ కట్‌చేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర చోట్ల మాత్రం మిన్నకుండిపోతున్నారు. ఫలితం బకాయిలు కోట్ల రూపాయలకు చేరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులను వసూలు చేయాల్సి ఉన్నా ఆ నిబంధనను కొందరు అధికారులు తుంగలోకి తొక్కుతున్నారు. కర్మాగార యాజమాన్యాల వద్ద మొహమాటానికి పోవడం, రాజకీయ ఒత్తిళ్లు వెరసి బకాయిలను కొండలా పెంచేస్తున్నారు. రాజాం : విద్యుత్ బిల్లుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా బకాయిలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ ప్రభా వం ఉచిత విద్యుత్‌పై తీవ్రంగా పడే అవకాశముంది. జిల్లాలో సుమారు 7 లక్షల సింగిల్ ఫేజ్, 17 వేల త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు గృహ, వాణిజ్య, వ్యాపార రంగాలకు చెందిన లోకల్‌బాడీస్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీస్ తదితర విభాగాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇందులో విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. వసూళ్లలో అధికారుల అలసత్వమే ఇందుకు కారణమని సమాచారం. జిల్లాలో 10 సబ్ డివిజన్ కేంద్రాలున్నాయి. వీటిలో లోకల్ బాడీలకు సంబంధించి రూ.50 కోట్లు బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి 5.5 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మొండి బకాయిలు సుమారు రూ. 4 కోట్లు కాగా, కోర్టు కేసుల్లో సుమారు రూ. 80 లక్షలు వరకూ ఉన్నాయి. వీటితో పాటు కర్మాగారాల నుంచి సుమారు రూ. 2 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది. రాజాం సబ్‌డివిజన్ పరిధిలో... రాజాం సబ్ డివిజన్ పరిధిలో రాజాం నగర పంచాయతీ, రాజాం రూరల్, సంతకవిటి, రేగిడి, జిసిగడాం, పొందూరు మండలాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి లోకల్‌బాడీస్‌కు సంబంధించి సుమారు రూ. 36.14 కోట్ల బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.14.5 లక్షలు ఉన్నాయి. కర్మాగారాలకు సంబంధించి సుమారు. రూ.1.13 కోట్ల బకాయి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ సుమారు రూ.7.86 లక్షలు, రెవెన్యూ శాఖ రూ. 2.20 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ సుమారు రూ.2.13 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉంది.ఈ లెక్కన మిగిలిన సబ్ డివిజన్ల పరిధిలో బకాయిల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చర్యలేవీ..? విద్యుత్ బకాయిలపై తక్షణమే కొరడా ఝుళిపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. కేటగిరీ-1కు సంబంధించి రెండు నెలలకు ఒకసారి, కేటగిరీ 2-7 వరకూ ప్రతి నెలా బిల్లు అందిస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో వసూలు చేయడంలో స్థానిక అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. మరోవైపు ఈ నెల నుంచి కేటగిరీ-1 నుంచి 7 వరకూ విద్యుత్ బిల్లులు ప్రతి నెలా వినియోగదారులకు అందించాలని, తద్వారా టారిఫ్ విలువ తగ్గి బిల్లు మొత్తం తగ్గుతుందని, దీంతో వినియోగదారునికి బిల్లు చెల్లించడం సులభతరమవుతుందని ప్రభుత్వం కొత్తగా జీఓ జారీ చేసింది. -
గుండ్లమోటుకు నిర్లక్ష్యం గండ్లు
- రూ.కోట్లు వెచ్చించినా ప్రయోజనం శూన్యం - అధికారుల నిర్లక్ష్యానికి బీడువారుతున్న పంట పొలాలు - భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి తంటా గిద్దలూరు: గుండ్లమోటు ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం ఆవహించింది. దీంతో పశ్చిమ ప్రకాశంలో ఇటు సాగు నీరుకు, అటు తాగునీరుకు కటకట ప్రారంభమయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం చేపట్టాక మార్కాపురం డివిజన్లోని కొన్ని ప్రాంతాలకైనా తాగు, సాగు నీరు వస్తుందని రైతులు, ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. 1980లో కొట్టుకుపోయిన గుండ్లమోటు ప్రాజెక్టుకు వై.ఎస్. హయాంలో నిధుల మంజూరయ్యాయి. కంభం చెరువు అభివృద్ధికి జపాన్ నిధుల మంజూరుకు కృషి చేశారు. ఆయన మరణానంతరం వచ్చిన పాలకుల నిర్లక్ష్యానికి పరుగులు తీయాల్సిన ప్రగతి పడకేసింది. దీంతో గత ఆరు సంవత్సరాలుగా నిర్మాణ పనులు సాగుతూ...నే ఉన్నాయి. కంభం చెరువు అభివృద్ధి, గుండ్లమోటు ప్రాజెక్టు పూర్తయితే వేల ఎకరాలకు నీరందే అవకాశం ఉంది. దీంతోపాటు భూగర్భ జలాలు అభివృద్ధి చెంది తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. 2009లో శ్రీకారం... గిద్దలూరు మండలంలోని వెంకటాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎనుమలేరు వాగుపై 1975వ సంవత్సరంలో పనుల చేస్తున్న సమయంలోనే అధిక వర్షాలకు కట్ట తెగిపోయింది. దీంతో తాత్కాలిక పనులు చేపట్టారు. తిరిగి 1980 నుంచి 2000 సంవత్సరం వరకు కురిసిన భారీ వర్షాలకు వచ్చిన నీటి ఉధృతిలో అలుగు, తూముతోపాటు, అప్రాన్, పికప్ ఆనకట్టలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఎలాంటి నిధులూ విడుదల చేయలేదు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మొదట రూ.7 కోట్లు నిధులు విడుదల చేసింది. అనంతరం రిజర్వాయర్ డిజైన్ మార్పుల కోసం అదనంగా మరో రూ.4.63 కోట్లను విడుదల చేసింది. పనులు దక్కించుకున్న ఎంఆర్కేఆర్ కనస్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు వెంటనే పనులు ప్రారంభించినా అటవీశాఖ అనుమతులు లేకపోవడంతో పనులు అర్థ్ధంతరంగా ఏడాదిన్నరపాటు నిలిచిపోయాయి. అటవీశాఖ అనుమతులు తీసుకుని తిరిగి పనులు ప్రారంభించారు. ఐదు సంవత్సరాలపాటు కేవలం 140 మీటర్ల పొడవున్న అలుగు మాత్రమే పూర్తిచేశారు. చెరువు కట్టను ఆనుకుని కరకట్ట నిర్మించేందుకు 8 అడుగుల లోతు వరకు గుంత తీసినా గట్టితనం రాలేదు. దీంతో పనులను పర్యవేక్షించేందుకు వచ్చిన జియాలజిస్టులు గట్టితనం వచ్చే వరకు గుంత తీయాలని చెప్పడంతో లోతుగా గుంత తీస్తే కట్ట తూలిపడుతుందని పనులను నిలిపేశారు. ఇలా గత రెండేళ్లుగా పనులు ఆగిపోయాయి. గడువులు పెంచుకోవడంతోనే సరిపెడుతున్నారు... ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టరు గడువు మీద గడువు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పటికే నాలుగుసార్లు పెంచారు. గతేడాది డిసెంబరులో తీసుకున్న గడువు ముగియడంతో ఇటీవల చీఫ్ ఇంజినీర్లు పనుల పురోగతిని పరిశీలించి అనుమతులిచ్చారు. అయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు కురవక ముందే ప్రారంభించి ఉంటే వర్షపు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదని రైతులు భావించారు. పనులు చేయించడంలో ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పూర్తయితే... ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతోపాటు గిద్దలూరు నగర పంచాయతీతో పాటు 14 గ్రామాల ప్రజలకు తాగునీరు అందించే భైరేనిగుండాల ప్రాజెక్టుకు నీరు పుష్కలంగా చేరే అవకాశం ఉంది. చుట్టు పక్కలున్న చెరువులు, కుంటల్లోనూ నీరు చేరుతుంది గడువులోగా పనులు పూర్తి చేస్తాం: నాగార్జునరావు, డీఈ, కంభం గుండ్లమోటు ప్రాజెక్టు పనులు గడువులోగా పూర్తి చేయడానికి తనవంతు కృషి చేస్తాను. సాంకేతిక కారణాలతో పనులు ఆపేశారు. కాంట్రాక్టరు పనులు నిలిపారని నోటీసులు జారీ చేశా. ఇటీవల చీఫ్ ఇంజినీరు, ఎస్ఈ వచ్చి పనులను పరిశీలించారు. ఎలాంటి అడ్డంకులూ లేకుండా అనుమతులొచ్చాయి. వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. -
ఆశలు తీరేదెప్పుడు?
టెక్కలి:ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగుల ఆశలు తీరలేదు. వారికష్టాలు చూసి చలించిన ట్రైమాక్స్ సంస్థ ఆర్థిక సాయం చేసినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడివారికి ఆ ఫలం అందలేదు. అధిక మొత్తాలు వెచ్చించి సుదూర ప్రాంతానికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ప్రాంత కిడ్నీ రోగుల బాధలు తీర్చడానికి 2012 అక్టోబర్ లో ట్రైమాక్స్ సంస్థ అధినేత కోనేరు ప్రసాదరావు టెక్కలి ఏరియా ఆసుపత్రిని సందర్శించి డయాలసిస్ ప్రాజెక్టు కోసం కోటి రూపాయలు వెచ్చిస్తామని ప్రకటించారు. డయాలసిస్ యూనిట్ ఏర్పాటు విషయంలో జిల్లా స్థాయి అధికారులు, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, ఆసుపత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రకటించిందే తడవుగా కోటి రూపాయల విలువైన పరికరాలను ఆసుపత్రికి అందజేశారు. అయితే నెఫ్రాలజీ వైద్యులు, మిగిలిన సిబ్బంది నియామకం, డయాలసిస్ నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి సారించకపోవడంతో, సుమారు రెండు సంవత్సరాల నుంచి ఆ పరికరాలన్నీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా మూలుగుతున్నాయి. 2013 సంవత్సరంలో కోనేరు ప్రసాదరావు మరోసారి ఆస్పత్రిని సందర్శించి పరికరాల పరిస్థితి చూసి నివ్వెరపోయారు. అంతేగాకుండా జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో, ఆసుపత్రిలో ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ లక్ష్మణరావుకు విశాఖ కేజీహెచ్‌లో 20 రోజుల పాటు డయాలసిస్‌పై శిక్షణనిచ్చారు. మరో ఇద్దరు స్టాఫ్ నర్స్‌లకు శ్రీకాకుళం రిమ్స్‌లో శిక్షణ ఇచ్చారు. కానీ ఏడాది పూర్తయినా యూనిట్ ప్రారంభం కాకపోవడంతో వారి శిక్షణ కూడా వృధా అయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో ఈ డయాలసిస్ కేంద్రం తెరిపిస్తానంటూ ప్రకటనలు చేశారు. కానీ అది కూడా అమలు కాలేదు. శ్రీకాకుళం రిమ్స్‌లో డయాలసిస్ నిర్వహిస్తున్న ‘బీబ్రాన్’ సంస్థకు టెక్కలి డయాలసిస్ నిర్వాహణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేశారు. వారు నిరాకరించడంతో ‘శాండర్’ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆస్పత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. అది కూడా విఫలమవ్వడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఓ వితరణశీలి సామాజిక స్పృహతో కిడ్నీ రోగుల కోసం కోటి రూపాయల విలువైన డయాలసిస్ పరికరాలు అందజేస్తే వాటిని నిర్వహించడంలో అటు ప్రజాప్రతినిధులు గాని అధికార యంత్రాంగం గాని పూర్తిగా విఫలం కావడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో మాత్రమే ఈ డయాలసిస్ కేంద్రం ఉండడంతో, జిల్లా నలుమూలలకు చెందిన కిడ్నీ రోగులు డయాలసిస్కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు మూలకు చేరిన డయాలసిస్‌ను ప్రారంభించే ప్రయత్నాలు చేపడితే మంచిది. -
వడదెబ్బ మృతులను నమోదు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం
గడిచిన నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మృత్యువాత పడినవారు 87 మంది ఈ సీజన్లో అధికారులు నమోదు చేసింది 30 మంది మృతుల్లో రైతులు, కూలీలే అధికం ఆపద్బంధు పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించని అధికారులు భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే 35 డిగ్రీల నుంచి మొదలవుతున్న ఉష్ణోగ్రత మధ్యాహ్నం ఒంటి గంట వరకే 45 డిగ్రీలకు చేరుతోంది. వ్యవసాయ కూలీలు, రైతులు, వృద్ధులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారు సూర్య ప్రతాపానికి బలి అవుతున్నారు. వడదెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. మృతుల వివరాలు నమోదు చేయడంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో గడిచిన మూడు రోజుల నుంచి పగటి పూట ఉష్ణోగ్రత ఏకంగా 47 డిగ్రీలకు ఎగబాగింది. దీనికితోడు వడగాల్పులు, ఈదురు గాలులతో జనం ఇళ్లు వదలి బయటకు వచ్చే పరిస్థితే లేకుండా పోయింది. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో 87 మంది మృత్యువాత పడ్డారు. కానీ అధికారులు సేకరించిన ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సీజన్ మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 30 మంది మాత్రమే మరణించినట్లు పేర్కొంటున్నారు. దీనినిబట్టి వడదెబ్బ మృతుల వివరాలు నమోదు చేయడంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శిస్తున్నారో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. ఈ నాలుగు రోజు ల్లోనే 87 మంది మరణించినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నా.. అధికారులు శుక్రవారం రాత్రి పొద్దు పోయే సమయానికి నమోదు చేసిన మృతులు కేవలం 9 మంది మాత్రమే.. అంటే వడదెబ్బ మృతుల విషయంలో అధికారులు పోషిస్తున్న పాత్ర నామమాత్రమేనని దీనిని బట్టి తెలుస్తోంది. పట్టించుకోని అధికారులు రోజురోజుకూ వడదెబ్బమృతుల సంఖ్య పెరిగిపోతున్నా అధికారులు మాత్రం తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు తప్ప మృతుల కుటుంబాల జోలికి వెళ్లడం లేదు. రాష్ట్ర విపత్తుల శాఖ అడుగుతున్న మృతుల వివరాలను ఆర్డీఓల నుంచి తెప్పించుకుని వారికి పంపిస్తున్నారే తప్ప మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తమ ముందున్న ఆపద్బంధు పథకాన్ని గురించి ప్రజలకు తెలియజేయడం లేదు. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ తగిలి మృత్యు వాత పడ్డ బాధిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ.50వేల ఎక్సిగ్రేషియా అందుతుంది. ఈవిషయంపై ప్రజల కు అవగాహన కల్పించడంలేదు. ఆపద్బంధు కింద లబ్ధిపొందాలంటే... ఈ పథకం కింద గతంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా జిల్లా కలెక్టర్ ఆధీనంలోనే ఆపద్బంధు నిధులు అందుబాటులో ఉంచారు. వడ దెబ్బ కారణంగా మృతి చెందిన వ్యక్తుల తాలూకు కుటుంబ సభ్యులు ఈ సమాచారాన్ని గ్రామ రెవెన్యూ కార్యదర్శికి తెలియజేయాలి. వీఆర్వో ఆ విషయాన్ని తహసీల్దారు, పోలీస్ అధికా రులకు తెలియజేస్తారు. తహశీల్దార్ మృతుడి పంచనామా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం రిపోర్ట్, పోలీస్ ఎఫ్ఐఆర్, పంచనామా... ఈ మూడింటిని తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టరేట్‌కు పంపుతారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. కానీ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆపద్బంధు కింద నమోదైన కేసులు లేవు. -
‘ఉపకారం’ హుళక్కేనా ?
ఇందూరు : జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలోని వందలాది మంది గిరిజన విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం గిరిజన సంక్షేమ శాఖకు కోట్లాది రూపాయలు మంజురు చేస్తుంటే.. వాటిని విద్యార్థులకు అందించడంలో సంబంధిత అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాకు మంజురైన రూ.1.86 కోట్ల నిధుల్లో రూ.12 లక్షలు మాత్రమే ఖర్చు చేయగా, మిగితా రూ.1.74 కోట్లువెనక్కి మళ్లాయంటే వారి పనితీరు ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి8వ తరగతి వరకు చదువుతున్న గిరిజన పేద విద్యార్థులకు ఆర్థికంగా దోహదపడేందుకు ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్‌లను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తోంది. ఇందుకోసం 2014-15 సంవత్సరానికి రూ.1కోటి 86 లక్షలు కేటాయించింది. జనవరిలో గిరిజన విద్యార్థులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు తెలియజేయాలి. అంతేకాక అందరికీ తెలిసేలా అవగాహన సదస్సులు నిర్వహించాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తుల విషయం చాలామందికి తెలియలేదు. తెలిసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి దాదాపు రెండు నెలలకు పైగా పట్టింది. ఎందుకంటే చదువుతున్న పాఠశాల నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం, కుల, ఆదాయ, నివాస, ఇతర ధ్రువ పత్రాలు తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇలా సుమారు వెయ్యి మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా, అందులో 960 మందికి స్కాలర్షిప్లు అందజేశారు. అదే అంతకుముందు సంవత్సరం రెండు వేల మందికి అందజేశారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు దాదాపు నాలుగు వేలకు పైగా ఉంటారని విద్యా శాఖ అధికారుల అంచనా. ఈ లెక్కన చూస్తే ఇంకా కనీసం మూడు వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దరఖాస్తులు పెద్ద మొత్తంలో రాకపోవడానికి గిరిజన సంక్షేమాధికారులు ప్రచారం నిర్వహించకపోవడం, పాఠశాలల ప్రధానోపాద్యాయులకు సకాలంలో సమాచారం అందించకపోవడమే ప్రధాన కారణమని స్పష్టంగా తెలుస్తోంది. వందలాది గిరిజన పేద విద్యార్థులకు విషయం తెలియక, ధ్రువపత్రాలు సమయానికి అందకపోవడంతో ఒక సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులకు అక్షింతలు...! పేద గిరిజన విద్యార్థులకు అందిచే స్కాలర్షిప్ నిధులను కనీసం యాబై శాతం కూడా ఖర్చు చేయకపోవడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, కమిషనర్ మహేశ్ ఎక్కా, ప్రిన్సిపల్ సెక్రెటరీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా జిల్లా గిరిజన సంక్షేమాధికారి పనితీరుపై అసహనం వ్యక్తం చేశారని సమాచారం. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తుంటే పేద విద్యార్థులకు అందించకపోవడం చూస్తే మీ నిర్లక్ష్యం ఏంటో తెలిసిపోయిందని మండిపడ్డట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రూ.1కోటి 86 లక్షలు ఇస్తే అందులో 960 మంది విద్యార్థులకు రూ.12 లక్షలు ఖర్చు చేయడంపై సీరియస్ అయ్యారని తెలిసింది. ఇప్పటికైనా పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించినట్లు సమాచారం. -
వాల్టాకు...అధికారుల తూట్లు
మహబూబ్ నగర్: పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వాల్టా చట్టానికి తూట్లూ పొడుస్తుంది. ఇష్టానుసారంగా ఇసుకను తరలించడం, చెట్లను నరికివేయడం, ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తూ జిల్లా రైతులు, గ్రామీణ ప్రాంతాల వారు చట్టం నిబంధనలను అతిక్రమిస్తున్నారు. పర్మిషన్ లేకుండా బోర్లు, అక్రమంగా ఇసుక రవాణా బోర్లు పగలు వేయడం వల్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయన్న ఉద్దేశంతో రైతులు, గ్రామ వాసులు రాత్రి వేళల్లో బోర్లు వేస్తున్నారు. అధికారులు పక్కపక్కనే రిగ్గులు వేస్తూ రైతుల మధ్యన గొడవకు కారణమవుతున్నారు. బోరు వేయాలంటే తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా బోర్లు వేస్తూ నిబంధనలు అతిక్రమిస్తూ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాలోని కానాయపల్లి, గోవిందహళ్లి, పామాపురం, అప్పరాల, కనిమెట్ట తదితర గ్రామాల వాగులు, వంకల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తూ సంపదను అర్జిస్తున్నారు. పగటిపూట గ్రామ శివారులలో ఇసుకను డంపింగ్ చేస్తూ, రాత్రి వేళ్లల్లో దర్జాగా అమ్ముకుంటున్నారు. చెట్ల నరికివేత ఇష్టానుసారంగా పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. స్థానికులు నిబందనలు అతిక్రమిస్తూ వాల్టా చట్టానికి తూట్లూ పొడుస్తుంటే అధికారులు నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్: అధికారుల నిర్లక్ష్యంపై నిరసిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శనివారం చోటుచేసుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా సుధాకర్ అనే వ్యక్తి పురుగుల మందుతాగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతన్ని పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడు పెగడపల్లి మండలం, నామాపూర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
కదలిన అధికారులు
వెంకటాచలం, న్యూస్‌లైన్ : పో లియో చుక్కల మందును అం దించడంలో అలసత్వంపై ‘అధికారుల నిర్లక్ష్యం’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై జిల్లా వై ద్యాధికారి స్పందించి సోమవా రం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెం టర్ను తనిఖీ చేసి సిబ్బందిని విచారించారు. పోలియో మందును చిన్నారులకు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించా రు. అడిషనల్ జిల్లా వైద్యాధికారి పద్మావతి కూడా ఈ విషయమై ఆరా తీసినట్టు క్లస్టర్ డాక్టర్ పి.పురుషోత్తం తెలిపా రు. డాక్టర్ పురుషోత్తం, ఎస్‌యూఓ నారాయణరావు, కసుమూరు డాక్టర్ రజనీ, సీహెచ్ఓ శ్రీరాములు, ఏఎన్ఎం ప్రసన్నకుమారి, ఆశా వర్కర్ వెంకటరమణమ్మ జ్యోతినగర్ వెళ్లి పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారుల గుర్తులను పరిశీలించారు. గ్రామంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 108 అందుబాటులో పెడతాం వెంకటాచలం వద్ద ఉన్న 108 వాహనాన్ని జూబ్లీ ఆస్పత్రిలో గర్భవతులు ప్రసవం తర్వాత తల్లి, బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ఉపయోగిస్తున్నాం. సాయంత్రం ఐదు గంటల తర్వాత వాహనం ఖాళీ అవుతుంది. అప్పటి నుంచి వాహనాన్ని వెంకటాచలంలో ఉంచేందు కు చర్యలు తీసుకుంటాం. -ప్రోగ్రాం మేనేజర్ రమణయ్య -
నిధులున్నా నిర్లక్ష్యం..!
భద్రాచలం, న్యూస్‌లైన్: ఏజెన్సీలో రహదారుల నిర్మాణానికి పుష్కలంగా నిధులు ఉన్నప్పటికీ కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో పనులు పూర్తి కావటం లేదు. మారుమూలన ఉన్న రెండువందల గ్రామాలకు మెరుగైన రహదారులు కల్పించేందుకని జిల్లాకు రూ.43.62 కోట్లు మంజూరై రెండేళ్లు దాటినా ఈ పనులు అతీ గతీ లేకుండా సాగుతున్నాయి. గడువులోగా పనులు పూర్తి చేయకపోవటంతో మరోసారి వీటి అంచనాలను పెంచుతూ ప్రతిపాదనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు అలసత్వం, లోప భూయిష్టమైన విధానాలతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడనుంది. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌లైన్’ సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద మారుమూలన ఉన్న కుగ్రామాలకు రహదారులు కల్పించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించారు. ఈ క్రమంలో జిల్లాకు రూ.38.5 కోట్లు కేటాయిస్తూ 2011లో జీవో నంబర్ 129 పేరిట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉపాధిహామీ పథకంలో భాగంగా ఈ పనులను పంచాయతీ స్థాయిలో ఏర్పడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో కూలీలతోనే చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పనులను చేజిక్కించుకొని ఉపాధి నిధులను కొల్లగొట్టాలనుకున్న అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు ఈ నిబంధనలతో గొంతులో వెలక్కాయపడింది. దీంతో ప్రభుత్వంపై వారు ఒత్తిడి తీసుకురావటంతో ఈ నిబంధనలను సవరిస్తూ ఏడాది తరువాత అనగా 2012 జులైలో మరో ఉత్తర్వు ఇచ్చింది. 200 పనులకు రూ. 43.62 కోట్లకు నిధులను పెంచుతూ 60:40 నిష్పత్తిలో చేపట్టాలని సూచించింది. దీని ప్రకారం 60 శాతం నిధులు ఉపాధి కూలీలకు, మిగతా 40 శాతం నిధులు మెటీరియల్ కోసం వెచ్చించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమైనప్పటికీ క్షేత్ర స్థాయిలో సవాలక్ష సమస్యలు ఎదుర య్యాయి. ముందుకుసాగని పనులు... 2011-12 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులతో చేపట్టిన ఈ పనులను అధికారులు సకాలంలోపూర్తి చేయించటంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలోని ఏజె న్సీ ప్రాంతంలో గల 19 మండలాల్లో ఈ 200 పనులను ఐటీడీఏ అధికారులు పర్యవేక్షించారు. ఇప్పటికే ఎల్డ బ్ల్యూఈఏ పథకం కింద వందలాది కోట్లతో పనులు జరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులపై ఒత్తిడి పడకుండా ప్రత్యేక విభాగానికి అప్పగించారు. పనులు పర్యవేక్షించేందుకు ఆయా మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్లు, ఐటీడీఏ స్థాయిలో పరిశీలించేందుకు కన్సల్టెంట్లు ఇలా అదనపు సిబ్బందిని నియమించారు. ఇంత ప్రత్యేక యంత్రాంగం ఉన్నప్పటికీ పనుల్లో ఎటువంటి పురోగతి లేకుండా పోయింది. ఈ నెల 9న రూపొందించిన నివేదికల ప్రకారం మొత్తం 200 పనుల్లో 65 చోట్ల అసలు తట్టెడు మట్టి కూడా పోయలేదు. రూ.43.62 కోట్లకు గాను ఇప్పటికి అధికారులు నివేదికల ప్రకారం కేవలం రూ.6.79 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. పనుల పురోగతి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు తగిన రీతిలో దృష్టి సారించటం లేదనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల కనుసన్నల్లోనే... ఉపాధి హామీ పథకం కింద జరగాల్సిన రహదారుల నిర్మాణపు పనులు చాలా చోట్ల కాంట్రాక్టర్లే చేపట్టారు. కూనవరం, దుమ్ముగూడెం వ ంటి చోట్ల కూలీలను ఉపయోగించకుండానే నిధులను కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ఆయా రహదారుల నిర్మాణానికి 60 శాతం నిధులు కూలీలకే వెచ్చించాలి. అయితే కూలీలకు బదులుగా యంత్రాలతో పనులు చేసి పెద్ద మొత్తంలో నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లు తీసుకున్న పర్యవేక్షణాధికారులు పనులు అయితే చాలన్న రీతిలో చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను కూడా కాంట్రాక్టర్లే చేపడుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. గడువు ప్రకారం మార్చి నాటికి పనులు పూర్తి చేసే పరిస్థితి లేకపోవటంతో దీనిపై ఐటీడీఏ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మూడేళ్ల క్రితం చేసిన ఎస్టిమేషన్లతో వీటిని పూర్తి చేయటం తమ వల్ల కాదని చేతులెత్తేసిన అధికారులు వీటి అంచనాలను పెంచుతూ మళ్లీ కొ త్తగా ప్రతిపాదనలు తయారు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలిసింది. గడువులోగా పనులు పూ ర్తి చేసేందుకు శ్రద్ధ చూపకపోగా కాంట్రాక్టర్ల కు లబ్ధిచేకూర్చేందుకు ప్రయత్నాలు చేయటం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రహదారులు లేక పల్లె వాసులు ఇబ్బందులు : ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామాలకు రహదారులను నిర్మించాలనే లక్ష్యంతోనే ఎన్ఆర్ఈజీఎస్ కింద నిధులు కేటాయించారు. అధికారుల నిర్వాకం కారణంగా ఏళ్లు గడుస్తున్నప్పటికీ తమ గ్రామాలకు రహదారులు మెరుగుపడలేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీలో వెనుకబడిన చింతూరు, పినపాక, కూనవరం, వీఆర్పరం, ఇల్లెందు, టేకులపల్లి వంటి మండలాల్లోనే ఎక్కువగా పనులు గుర్తించారు. ఆయా మండలాల్లో గల గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కారణంగా పల్లె వాసులకు ప్రయాణపు ఇబ్బందులు తప్పటం లేదు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ ఈ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరిత గతిన పూర్తి అయ్యేలా చూడాలని ఏజెన్సీ ప్రాంత వాసులు కోరుతున్నారు. -
కదలని సర్కారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఏడాదిన్నర కాలంగా జిల్లా రైతులను ప్రకృతి వైపరీత్యాలు పట్టిపీడిస్తున్నాయి. రెండుమూడు రోజుల కిందట తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వెయ్యి ఎకరాలకు పైగా పం టనష్టం వాటిల్లింది. జుక్కల్, మాక్లూర్, బోధ న్, జక్రాన్‌పల్లి, నిజాంసాగర్ మండలాలలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అక్టోబర్‌లో కురిసిన వర్షానికి జిల్లాలో 6,600 ఎకరాలలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలు నష్టపోయాయి. అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం పంటనష్టంపై ఇప్పటి వరకు ప్రభుత్వానికి నివేదికను సమర్పించలేకపోయిం ది. 50 శాతానికిపైగా పంటలు నష్టపోతేనే పరి హారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపిస్తామని వ్యవసాయాధికారులు పేర్కొం టున్నారు. అక్టోబర్‌లోనూ, ప్రస్తుతం కురిసిన వర్షాలతోనూ కళ్లాల్లో ఉన్న వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.అయితే, కోతకోసిన పంటలు తమ పరిధిలోకి రావని వ్యవసాయశాఖ పే ర్కొంటోంది. రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ కూడా చేతికందాల్సిన పంటనష్టంపై అంచనా వేయలేకపోతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఆగ స్టులో కురిసిన వర్షాలతో జిల్లాలోని డిచ్పల్లి, నవీపేట, బిచ్కుంద మండలాల్లోని 209 మంది రైతులకు చెందిన 1,327 హెక్టార్లలోని పత్తి, పెసర, మినుము పం టలు దెబ్బతిన్నాయి. ఈ రైతులకు 50 శాతం సబ్సిడీతో విత్తనాలను పంపిణీ చేసిన సర్కారు పరిహారం మాత్రం ఇప్ప టి వరకు అందించలేదు. ఆత్మహత్యలే శరణ్యం ప్రకృతి ఓ వైపు తీవ్ర నష్టానికి గురిచేస్తుండగా, మరోవైపు సర్కారు ఆదుకోకపోవడంతో రైతు లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అప్పు లు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు. ఏడాది కాలంలో జిల్లాలో ఆరుగురు రైతులు బలవన్మరణం పొందారు. ఇన్పుట్ సబ్సిడీ, పంటపరిహారంపై శ్రద్ధచూపని విధంగానే కిరణ్ సర్కారు రైతుల ఆత్మహత్యలను పట్టించుకోలేదు. జిల్లాలో ఒక్క రైతే ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. మిగితా ఐదుగురు రైతులు పంటనష్టం, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ పరిగణనలోకి తీసుకోకపోవడంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో కురి సిన వర్షం కారణంగా పొలంలోని వరి మెదళ్లు దెబ్బతినడంతో ఆవేదనకు గురైన లింగం పేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన రైతు బాగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రైతు కుటుంబం ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కులేక రోడ్డున పడింది. బాధిత కుటుంబాన్ని ఆదు కోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అక్రమార్కులకు ‘ఆహారం’
సాక్షి, కర్నూలు: ప్రజా పంపిణీపై పర్యవేక్షణ కొరవడింది. ఈ అవకాశాన్ని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల బియ్యం యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్‌కు చేరుతోంది. అడపాదడపా దాడులు నిర్వహిస్తున్నా ఇవేవీ అక్రమ రవాణాను నిలువరించలేకపోతున్నాయి. చట్టంలో పస లేకపోవడం.. అధికారుల వైఫల్యం.. నేతల అండదండలతో ఈ దందా నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ నెలలో పక్షం రోజుల్లోనే అధికారుల దాడుల్లో 208 క్వింటాళ్ల బియ్యం పట్టుబడగా.. లోపాలపై ప్రజల నుంచి స్వయంగా కలెక్టర్‌కే ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటం అక్రమ రవాణా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. అజ్ఞాత వ్యక్తుల సమాచారంతో అధికారులు అప్పుడప్పుడు దాడులు చేశామనిపిస్తున్నా పట్టుబడుతున్న బియ్యం అరకొరే కావడం గమనార్హం. ప్రతి నెలా పేదల బియ్యం పెద్ద ఎత్తున జిల్లా సరిహద్దులు దాటుతున్నా అడ్డుకట్ట వేసే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో బియ్యం పంపిణీ మొదలైనప్పటి నుంచి అక్రమార్కులు కూలీలను ఏర్పాటు చేసి అధిక ధరతో కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని పాలిష్ చేసి సోనా మసూరి బియ్యంలో కలిపి కొందరు వ్యాపారులు ఎంచక్కా సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా వారి ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడానికి చట్టంలోని లొసుగులే కారణంగా తెలుస్తోంది. కోటా బియ్యం, ఇతర కోటా సరుకులు ఎక్కడైనా పట్టుబడితే ప్రజా పంపిణీ వ్యవస్థలోని చట్టం 6ఏ కేసును మాత్రమే అధికారులు నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత కలెక్టర్, జేసీలు విచారించి అపరాధ రుసుం విధించడం, స్వాధీనం చేసుకున్న సరుకులో పూర్తిగా, కొంత ప్రభుత్వ పరం చేసుకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల అక్రమార్కులకు పెద్దగా నష్టం లేకపోవడంతో పదేపదే వారు ఇదే తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
అటకెక్కిన కంప్యూటర్ విద్య
జవహర్‌నగర్, న్యూస్‌లైన్: ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. నిరుపేదల విద్యార్థులకు శాపంగా మారింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ఇంగ్లిష్తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన కంప్యూటర్ బోధనలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్లు, పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం 2008లో సర్కార్ పాఠశాలల్లో కంప్యూటర్ విద్యను ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 236 పాఠశాలల్లో మొత్తం 2,596 కంప్యూటర్లను కొనుగోలు చేశారు.ఆయా పాఠశాలల్లో 7,8,9వ తరగతి చదివే విద్యార్థులకు బోధనలు అందించేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఇతర పరికరాలతో పాటు కాంట్రాక్ట్ పద్ధతిన ప్రత్యేక టీచర్లను కూడా నియమించారు. ప్రతి పాఠశాలలో ఇద్దరు కంప్యూటర్ టీచర్లను నియమించి ప్రభుత్వం వారికి నెలకు రూ.2,500 చొప్పున వేతనాన్ని కూడా చెల్లించింది. అయితే 2008లో ప్రారంభించిన కంప్యూటర్ విద్య పథకం ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని కంప్యూటర్ టీచర్లను అధికారులు అర్ధంతరంగా తొలగించారు. దీంతో ఆయా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అటకెక్కింది. కాగా విద్యార్థుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించిన కంప్యూటర్ బోధనను నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్ టీచర్లను కొనసాగించాలి జిల్లాలోని సక్సెస్ స్కూళ్లలో పనిచేసే కంప్యూటర్ టీచర్లను యథావిధిగా కొనసాగించి, విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని కంప్యూటర్ టీచర్ల సంఘం సభ్యులు కోరుతున్నారు. గత ఐదేళ్లుగా పాఠశాలల్లో చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమను ప్రభుత్వం అర్ధంతరంగా తొలగించడం బాధాకారమని వారుపేర్కొంటున్నారు. ఉపాధ్యాయులే బోధిస్తారు: డీఈఓ ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ విద్య ఆపేదిలేదని, ప్రస్తుతానికి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులే కంప్యూటర్ విద్యను బోధిస్తారని డీఈఓ ఎం.సోమిరెడ్డి పేర్కొన్నారు.గతంలో బోధించిన వారిని మాత్రం తీసుకునే ప్రసక్తేలేదు.ప్రభుత్వం మళ్లీ కాంట్రాక్టు పద్ధతిలోనే కొత్తవారికి అవకాశం కల్పిస్తుంది.