సామాన్యుడు బిల్లు కట్టలేదంటే గడువు ముగిసిన వెంటనే కనెక్షన్ కట్‌చేసి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న అధికారులు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర చోట్ల మాత్రం మిన్నకుండిపోతున్నారు. ఫలితం బకాయిలు కోట్ల రూపాయలకు చేరిపోతున్నాయి. ఎప్పటికప్పుడు విద్యుత్ బిల్లులను వసూలు చేయాల్సి ఉన్నా ఆ నిబంధనను కొందరు అధికారులు తుంగలోకి తొక్కుతున్నారు. కర్మాగార యాజమాన్యాల వద్ద మొహమాటానికి పోవడం, రాజకీయ ఒత్తిళ్లు వెరసి బకాయిలను కొండలా పెంచేస్తున్నారు.
రాజాం :
విద్యుత్ బిల్లుల వసూలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా బకాయిలు కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ ప్రభా వం ఉచిత విద్యుత్‌పై తీవ్రంగా పడే అవకాశముంది. జిల్లాలో సుమారు 7 లక్షల సింగిల్ ఫేజ్, 17 వేల త్రీ ఫేజ్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటితో పాటు గృహ, వాణిజ్య, వ్యాపార రంగాలకు చెందిన లోకల్‌బాడీస్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీస్ తదితర విభాగాలకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇందులో విద్యుత్ బిల్లుల బకాయిలు సుమారు రూ.100 కోట్లకు చేరుకున్నాయి. వసూళ్లలో అధికారుల అలసత్వమే ఇందుకు కారణమని సమాచారం. జిల్లాలో 10 సబ్ డివిజన్ కేంద్రాలున్నాయి. వీటిలో లోకల్ బాడీలకు సంబంధించి రూ.50 కోట్లు బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి 5.5 కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉంది. మొండి బకాయిలు సుమారు రూ. 4 కోట్లు కాగా, కోర్టు కేసుల్లో సుమారు రూ. 80 లక్షలు వరకూ ఉన్నాయి. వీటితో పాటు కర్మాగారాల నుంచి సుమారు రూ. 2 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది.
రాజాం సబ్‌డివిజన్ పరిధిలో...
రాజాం సబ్ డివిజన్ పరిధిలో రాజాం నగర పంచాయతీ, రాజాం రూరల్, సంతకవిటి, రేగిడి, జిసిగడాం, పొందూరు మండలాలకు చెందిన వినియోగదారులు ఉన్నారు. ఈ ప్రాంతాల నుంచి లోకల్‌బాడీస్‌కు సంబంధించి సుమారు రూ. 36.14 కోట్ల బకాయిలు ఉండగా ప్రభుత్వ కార్యాలయాల నుంచి సుమారు రూ.14.5 లక్షలు ఉన్నాయి. కర్మాగారాలకు సంబంధించి సుమారు. రూ.1.13 కోట్ల బకాయి ఉంది. వైద్య ఆరోగ్యశాఖ సుమారు రూ.7.86 లక్షలు, రెవెన్యూ శాఖ రూ. 2.20 లక్షలు, పంచాయతీరాజ్ శాఖ సుమారు రూ.2.13 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉంది.ఈ లెక్కన మిగిలిన సబ్ డివిజన్‌ల పరిధిలో బకాయిల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
చర్యలేవీ..?
విద్యుత్ బకాయిలపై తక్షణమే కొరడా ఝుళిపించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. కేటగిరీ-1కు సంబంధించి రెండు నెలలకు ఒకసారి, కేటగిరీ 2-7 వరకూ ప్రతి నెలా బిల్లు అందిస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో వసూలు చేయడంలో స్థానిక అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. మరోవైపు ఈ నెల నుంచి కేటగిరీ-1 నుంచి 7 వరకూ విద్యుత్ బిల్లులు ప్రతి నెలా వినియోగదారులకు అందించాలని, తద్వారా టారిఫ్ విలువ తగ్గి బిల్లు మొత్తం తగ్గుతుందని, దీంతో వినియోగదారునికి బిల్లు చెల్లించడం సులభతరమవుతుందని ప్రభుత్వం కొత్తగా జీఓ జారీ చేసింది.
బకాయిల షాక్
Published Thu, Jan 7 2016 12:11 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement
Advertisement