భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే 35 డిగ్రీల నుంచి మొదలవుతున్న ఉష్ణోగ్రత మధ్యాహ్నం
గడిచిన నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా మృత్యువాత పడినవారు 87 మంది
ఈ సీజన్‌లో అధికారులు నమోదు చేసింది 30 మంది
మృతుల్లో రైతులు, కూలీలే అధికం
ఆపద్బంధు పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించని అధికారులు
భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే 35 డిగ్రీల నుంచి మొదలవుతున్న ఉష్ణోగ్రత మధ్యాహ్నం ఒంటి గంట వరకే 45 డిగ్రీలకు చేరుతోంది. వ్యవసాయ కూలీలు, రైతులు, వృద్ధులు, వివిధ రకాల జబ్బులతో బాధపడుతున్న వారు సూర్య ప్రతాపానికి బలి అవుతున్నారు. వడదెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోవడంలేదు. మృతుల వివరాలు నమోదు చేయడంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది.
జిల్లాలో గడిచిన మూడు రోజుల నుంచి పగటి పూట ఉష్ణోగ్రత ఏకంగా 47 డిగ్రీలకు ఎగబాగింది. దీనికితోడు వడగాల్పులు, ఈదురు గాలులతో జనం ఇళ్లు వదలి బయటకు వచ్చే పరిస్థితే లేకుండా పోయింది. గడిచిన నాలుగు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా వడదెబ్బతో 87 మంది మృత్యువాత పడ్డారు. కానీ అధికారులు సేకరించిన ప్రాథమిక లెక్కల ప్రకారం ఈ సీజన్ మొత్తం మీద ఇప్పటి వరకు కేవలం 30 మంది మాత్రమే మరణించినట్లు పేర్కొంటున్నారు. దీనినిబట్టి వడదెబ్బ మృతుల వివరాలు నమోదు చేయడంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శిస్తున్నారో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. ఈ నాలుగు రోజు ల్లోనే 87 మంది మరణించినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నా.. అధికారులు శుక్రవారం రాత్రి పొద్దు పోయే సమయానికి నమోదు చేసిన మృతులు కేవలం 9 మంది మాత్రమే.. అంటే వడదెబ్బ మృతుల విషయంలో అధికారులు పోషిస్తున్న పాత్ర నామమాత్రమేనని దీనిని బట్టి తెలుస్తోంది.
పట్టించుకోని అధికారులు
రోజురోజుకూ వడదెబ్బమృతుల సంఖ్య పెరిగిపోతున్నా అధికారులు మాత్రం తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు తప్ప మృతుల కుటుంబాల జోలికి వెళ్లడం లేదు. రాష్ట్ర విపత్తుల శాఖ అడుగుతున్న మృతుల వివరాలను ఆర్డీఓల నుంచి తెప్పించుకుని వారికి పంపిస్తున్నారే తప్ప మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు తమ ముందున్న ఆపద్బంధు పథకాన్ని గురించి ప్రజలకు తెలియజేయడం లేదు. రోడ్డు ప్రమాదాలు, పాముకాటు, విద్యుత్ షాక్, అగ్ని ప్రమాదాలు, వడదెబ్బ తగిలి మృత్యు వాత పడ్డ బాధిత కుటుంబాలకు ఈ పథకం కింద రూ.50వేల ఎక్సిగ్రేషియా అందుతుంది. ఈవిషయంపై ప్రజల కు అవగాహన కల్పించడంలేదు.
ఆపద్బంధు కింద లబ్ధిపొందాలంటే...
ఈ పథకం కింద గతంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా జిల్లా కలెక్టర్ ఆధీనంలోనే ఆపద్బంధు నిధులు అందుబాటులో ఉంచారు. వడ దెబ్బ కారణంగా మృతి చెందిన వ్యక్తుల తాలూకు కుటుంబ సభ్యులు ఈ సమాచారాన్ని గ్రామ రెవెన్యూ కార్యదర్శికి తెలియజేయాలి. వీఆర్వో ఆ విషయాన్ని తహసీల్దారు, పోలీస్ అధికా రులకు తెలియజేస్తారు. తహశీల్దార్ మృతుడి పంచనామా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం రిపోర్ట్, పోలీస్ ఎఫ్‌ఐఆర్, పంచనామా... ఈ మూడింటిని తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకు అక్కడి నుంచి కలెక్టరేట్‌కు పంపుతారు. ఆ తర్వాత బాధిత కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది. కానీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆపద్బంధు కింద నమోదైన కేసులు లేవు.