ఒకరి బుక్కు, చెక్కు మరొకరికి! | Huge Difference Between Pass Book And Checks In Narayanpet | Sakshi
Sakshi News home page

ఒకరి బుక్కు, చెక్కు మరొకరికి!

Published Wed, Jul 4 2018 12:40 PM | Last Updated on Wed, Jul 4 2018 12:40 PM

Huge Difference Between Pass Book And Checks In Narayanpet - Sakshi

వీఆర్వో బసప్పను మందలిస్తున్న డీటీ ప్రమీల  

నారాయణపేట : రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తుంటే మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండల అధికారుల నిర్లక్ష్యంతో అనర్హుల చేతికి చిక్కుతోంది. నారాయణపేట మండల పరిధిలోని చోటు చేసుకుంటున ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొన్న సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు, నిన్న చిన్నజట్రంలో చనిపోయిన వారికి రైతుబంధు అందజేసిన ఘటనలు మరువకముందే.. మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఒక రైతుకు సంబంధించిన పాసుపుస్తకం, చెక్కు మరో రైతుకు అందించిన వైనం వెలుగు చూసింది. ఆ రైతు తమ పాసుబుక్కు, చెక్కు కానప్పటికి పాసుపుస్తకాన్ని ఇంట్లో భద్రపర్చుకుని చెక్కును డ్రా చేసుకోవడం గమనార్హం. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత రైతు మంగళవారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌ ఎదుట తమ గోడు వినిపించారు. ఇలాంటి ఘటనలతో నారాయణపేట మండలంలోని రెవెన్యూ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   

భూమి నారాయణపేట విశ్వనాథ్‌ది 
మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో నారాయణపేటకు చెందిన విశ్వనాథ్‌ తండ్రి బసప్ప పేరిట సర్వే నంబర్‌ 269/అ, 277/అ/అ, 280/అ/అ, 281/అ/అ, 274/అ/అ, 275/అ/అ, 276/అ/అ లో మొత్తం 4.17 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివరాలు పట్టా నంబర్‌ 457 ద్వారా పాత పాసుపుస్తకంలో పొందుపర్చారు. అయితే అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడైన విశ్వనాథ్‌ ఈ కొత్త పాసుపుస్తకాన్ని, చెక్కును సంబంధిత వీఆర్‌ఓ నుంచి తీసుకెళ్లారు. అయితే వాస్తవానికి ఈ విశ్వనాథ్‌కు ఒక ఎకరా పైబడి మాత్రమే భూమి ఉన్నట్లు సమాచారం.   

పెట్టుబడి సాయం రూ.17,700 
నారాయణపేటకు చెందిన బసప్ప కుమారుడు విశ్వనాథ్‌. ఈయనకు మొత్తం 4.17 భూమితో పాటు పూర్తి వివరాలు కొత్తపాసుపుస్తకంలో పొందుపర్చగా వీటిని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడు విశ్వనాథ్‌ పాస్‌బుక్కు, చెక్కును తీసుకెళ్లారు. ఈ రైతుకు సంబంధించిన పెట్టుబడి కింద రూ.17,700 ప్రభుత్వం చెక్కు రూపంలో అందజేసింది. కానీ అప్పిరెడ్డిపల్లి రైతు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండగా చెక్కును బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడమే కాకుండా పాస్‌బుక్కు తన వద్ద ఉంచుకుని వేధిస్తున్నాడని నారాయణపేటకు చెందిన రైతు విశ్వనాథ్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి వారం క్రితం వెలుగులోకి రాగా అప్పిరెడ్డిపల్లి రైతు విశ్వనాథ్‌తో పాటు ఆ గ్రామ వీఆర్‌ఓ బసప్పను కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా.. ‘మీరు పట్టాదారు కాదు... మీకు ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అనే సమాధానం ఇవ్వడంతో విశ్వనాథ్‌ కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశ్వనాథ్‌కు సమాచారం ఇచ్చి మంగళవారం తహసీల్దార్‌ దగ్గరికి వెళ్లడంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని సలహా ఇచ్చారే తప్ప పాసుపుస్తకం ఇప్పించే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత డీటీ దగ్గరకు వెళ్లి తమ దగ్గర పాసుపుస్తకాల వివరాలను ముందుంచి బోరుమన్నారు.  

విచారణ ప్రారంభించిన తహసీల్దార్‌  
నారాయణపేట రూరల్‌ : మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన  చెక్కును బినామీ వ్యక్తి రెవెన్యూ సిబ్బంది సహకారంతో డ్రా చేసుకున్న వైనంపై వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ‘రెవెన్యూ లీలలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు నారాయణపేట తహసీల్దార్‌ స్పందించి విచారణ ప్రారంభించారు. చెక్కు పంపిణీ సమయంలో అనుసరించిన విధానం, తీసుకున్న చర్యలపై సంబంధిత వీఆర్వో కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అలాగే, వదూద్‌ పేరుతో చెక్కు పొందిన హైదరాబాద్‌ వాసితో పాటు ఆ భూమి తమదంటూ ఫిర్యాదు చేసిన రజియాబేగంకు నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలతో కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అసలు వ్యక్తులకు కొత్త పాసుపుస్తకం జారీ చేయడంతో పాటు ఫోర్జరీ చేయాలని చూసిన వారిపై క్రిమినల్‌ కేసు పెడుతామని తహసీల్దార్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement