raithubandu
-
రైతుబంధుకు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్కు భారీ ఊరట లభించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తదనుగుణంగా రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలోలాగా తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండగా ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ పేర్కొంది. దీంతో ఎన్నికలకు ముందు కేవలం 28వ తేదీనే రైతుబంధు సొమ్ము పంపిణీకి వీలుంది. విడతలవారీగా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో ఒకేరోజు రైతుబంధు సొమ్ము రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. -
ప్రవాసీలను ఆదుకోని రైతు బీమా
ఎస్.వేణుగోపాలచారి–కామారెడ్డి, నాగమళ్ల శ్రీకర్–రాయికల్,జవ్వాడి చంద్రశేఖర్–మల్యాల : వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పండించిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో సొంత ఊరిని వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన రైతులకు ‘రైతు బీమా’ పథకం వర్తించడం లేదు. ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లిన వారిలో భూమి ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. వీరికి రైతు బీమా పథకం అందకుండా పోతోంది. దీంతో పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ద్వారా భూ యజమానులకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు, ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. అయితే, స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసు పుస్తకాన్ని, రైతు బంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధనలు వలస రైతుల పాలిట శాపంగా మారాయి. రైతు బీమా, రైతు బంధు పథకం వర్తించడానికి విదేశం నుంచి స్వదేశానికి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన మొదట్లో విదేశాల్లో ఉన్నవారికి రైతుబంధు ప్రయోజనాలను వర్తింపజేయకపోవడం వల్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌లో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు వర్తింపజేయాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం(ప్రవాసీ సంక్షేమ వేదిక) ఆధ్వర్యంలో ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సైతం పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది జూలై 7న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, మాజీ భారత రాయబారి బి.ఎం.వినోద్‌కుమార్‌లు ప్రవాసంలో ఉన్న తెలంగాణ రైతుల పక్షాన ఉమ్మడి హైకోర్టులో గతేడాది జూలై 20న ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది బొల్లు రచనారెడ్డి వాదించారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని, రెండు నెలల్లో గల్ఫ్‌లోని ప్రవాసీలకు ‘రైతుబంధు’ వర్తింపును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని గతేడాది జూలై 24న ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎన్నారై కుటుంబ సభ్యులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రూ.5లక్ష బీమా వర్తింపు విషయంలో ఇప్పటివరకు సానకూల నిర్ణయం తీసుకోకపోవడంతో వలస రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిబంధనలను సడలించి వలస వెళ్లిన ప్రవాసీ రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు. విదేశాలకు వెళ్లిన రైతులను కూడా ఆదుకోవాలి విదేశాల్లో ఉన్న రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రైతులకు బీమా పథకాన్ని వర్తింజేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా విదేశాలలో ఉన్న రైతులకు ఎల్ఐసీ వారి రూ.5లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత బీమా)ను మెయిల్ ఆర్డర్ బిజినెస్ పద్ధతిలో వర్తింపజేయాలని కోరాం. విదేశాల్లో తెలంగాణ రైతులకు కూడా అన్ని రకాల ‘రైతు బంధు’ ప్రయోజనాలను కల్పించడానికి ఒక సిస్టమ్‌ను రూపొందించాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. –మంద భీంరెడ్డి, ప్రవాసీ కార్మికుల హక్కుల కార్యకర్త వ్యవసాయం సరిగా లేకనే గల్ఫ్‌కు.. నా భర్త అయిత భూమయ్య పేరిట కట్కాపూర్ గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయం సరిగా లేకనే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. యూఏఈలోని పుజీరాలో ఓ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, కంపెనీ యాజమాన్యం కొన్నేళ్లు జీతం ఇవ్వకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తన రూమ్‌లో ఉరివేసుకొని మృతిచెందాడు. నా కొడుకు శశికుమార్ బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు ప్రవళిక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి చదువుల కోసం మా ఆయన ఎంతో కష్టపడేవారు. ఇక్కడ సరైన నీటి సదుపాయం లేకపోవడంతో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఏదో విధంగా సాగుచేశాం. అయినా, పంటలు సరిగా పండలేదు. పంటకు చేసిన అప్పుల గురించి, పిల్లల పోషణ గురించి భూమయ్య ఎప్పుడూ ఆలోచించేవాడు. ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని గల్ఫ్‌కు వెళ్లిన వారికి కూడా వర్తింపజేస్తే మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. – సునీత, కట్కాపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా పెట్టుబడి సాయం అందినా.. బీమా రాలేదు నా భర్త రవీందర్ పేరిట 21గుంటల భూమి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద రెండు పర్యాయాలు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కూడా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కానీ, స్థానికంగా లేడని.. రైతు బీమా బాండు ఇవ్వలేదు. ఉపాధి కోసం నా భర్త సౌదీ అరేబియాకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మాకు రైతు బీమా వర్తించకపోవడంతో నష్టపోయాం. ఆపద్బంధుకు దరఖాస్తు చేసుకోలేదు.–నల్లపు మణెమ్మ, సర్వాపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా -
ఒకరి బుక్కు, చెక్కు మరొకరికి!
నారాయణపేట : రైతులకు అండగా ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం పెట్టుబడి సాయం అందజేస్తుంటే మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండల అధికారుల నిర్లక్ష్యంతో అనర్హుల చేతికి చిక్కుతోంది. నారాయణపేట మండల పరిధిలోని చోటు చేసుకుంటున ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగు చూస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొన్న సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు, నిన్న చిన్నజట్రంలో చనిపోయిన వారికి రైతుబంధు అందజేసిన ఘటనలు మరువకముందే.. మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో ఒక రైతుకు సంబంధించిన పాసుపుస్తకం, చెక్కు మరో రైతుకు అందించిన వైనం వెలుగు చూసింది. ఆ రైతు తమ పాసుబుక్కు, చెక్కు కానప్పటికి పాసుపుస్తకాన్ని ఇంట్లో భద్రపర్చుకుని చెక్కును డ్రా చేసుకోవడం గమనార్హం. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి రావడంతో బాధిత రైతు మంగళవారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ ఎదుట తమ గోడు వినిపించారు. ఇలాంటి ఘటనలతో నారాయణపేట మండలంలోని రెవెన్యూ అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి నారాయణపేట విశ్వనాథ్‌ది మండలంలోని అప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులో నారాయణపేటకు చెందిన విశ్వనాథ్ తండ్రి బసప్ప పేరిట సర్వే నంబర్ 269/అ, 277/అ/అ, 280/అ/అ, 281/అ/అ, 274/అ/అ, 275/అ/అ, 276/అ/అ లో మొత్తం 4.17 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి వివరాలు పట్టా నంబర్ 457 ద్వారా పాత పాసుపుస్తకంలో పొందుపర్చారు. అయితే అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడైన విశ్వనాథ్ ఈ కొత్త పాసుపుస్తకాన్ని, చెక్కును సంబంధిత వీఆర్ఓ నుంచి తీసుకెళ్లారు. అయితే వాస్తవానికి ఈ విశ్వనాథ్‌కు ఒక ఎకరా పైబడి మాత్రమే భూమి ఉన్నట్లు సమాచారం. పెట్టుబడి సాయం రూ.17,700 నారాయణపేటకు చెందిన బసప్ప కుమారుడు విశ్వనాథ్. ఈయనకు మొత్తం 4.17 భూమితో పాటు పూర్తి వివరాలు కొత్తపాసుపుస్తకంలో పొందుపర్చగా వీటిని అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలప్ప కుమారుడు విశ్వనాథ్ పాస్బుక్కు, చెక్కును తీసుకెళ్లారు. ఈ రైతుకు సంబంధించిన పెట్టుబడి కింద రూ.17,700 ప్రభుత్వం చెక్కు రూపంలో అందజేసింది. కానీ అప్పిరెడ్డిపల్లి రైతు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండగా చెక్కును బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడమే కాకుండా పాస్బుక్కు తన వద్ద ఉంచుకుని వేధిస్తున్నాడని నారాయణపేటకు చెందిన రైతు విశ్వనాథ్, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వారం క్రితం వెలుగులోకి రాగా అప్పిరెడ్డిపల్లి రైతు విశ్వనాథ్‌తో పాటు ఆ గ్రామ వీఆర్ఓ బసప్పను కలిసి తమకు న్యాయం చేయాలని కోరగా.. ‘మీరు పట్టాదారు కాదు... మీకు ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అనే సమాధానం ఇవ్వడంతో విశ్వనాథ్ కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న విశ్వనాథ్‌కు సమాచారం ఇచ్చి మంగళవారం తహసీల్దార్ దగ్గరికి వెళ్లడంతో పరిశీలించి చర్యలు తీసుకుంటామని సలహా ఇచ్చారే తప్ప పాసుపుస్తకం ఇప్పించే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఆ తర్వాత డీటీ దగ్గరకు వెళ్లి తమ దగ్గర పాసుపుస్తకాల వివరాలను ముందుంచి బోరుమన్నారు. విచారణ ప్రారంభించిన తహసీల్దార్ నారాయణపేట రూరల్ : మృతి చెందిన వ్యక్తికి సంబంధించిన చెక్కును బినామీ వ్యక్తి రెవెన్యూ సిబ్బంది సహకారంతో డ్రా చేసుకున్న వైనంపై వచ్చిన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ‘రెవెన్యూ లీలలు’ శీర్షికన ‘సాక్షి’లో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ మేరకు నారాయణపేట తహసీల్దార్ స్పందించి విచారణ ప్రారంభించారు. చెక్కు పంపిణీ సమయంలో అనుసరించిన విధానం, తీసుకున్న చర్యలపై సంబంధిత వీఆర్వో కృష్ణారెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అలాగే, వదూద్ పేరుతో చెక్కు పొందిన హైదరాబాద్ వాసితో పాటు ఆ భూమి తమదంటూ ఫిర్యాదు చేసిన రజియాబేగంకు నోటీసులు జారీ చేశారు. పూర్తి ఆధారాలతో కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. అసలు వ్యక్తులకు కొత్త పాసుపుస్తకం జారీ చేయడంతో పాటు ఫోర్జరీ చేయాలని చూసిన వారిపై క్రిమినల్ కేసు పెడుతామని తహసీల్దార్ తెలిపారు. -
రెవె‘న్యూ’ లీలలు!
నారాయణపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పక్కదారి పడుతోంది. మామూళ్లకు రుచిమరిగిన రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్న లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు జిల్లాలోని మద్దూరు, గండీడ్ మండలాల్లో చోటుచేసుకున్న అక్రమాలకు తోడు పేట మండలంలో కూడా వరుస ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పేట మండలంలోని సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చిన్నజట్రంలో ఏకంగా 20 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో రైతుబంధు చెక్కును సృష్టించడం వాటిని కాజేయడం కూడా జరిగిపోయింది. సదరు చనిపోయిన వ్యక్తిది నకిలీ ఆధార్‌కార్డుతో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. చిన్నజట్రం గ్రామానికి చెందిన ఎంఏ వహీద్‌కు సర్వే నం. 327లో 8.78ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. ఆయనకు ఇద్దరు సంతానం కాగా వారిలో ఒకరు ఖాజాబేగం 20 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తర్వాత రజియాబేగం ఇటీవల పిల్లల చదువుల కోసం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే 1998లోనే ఎంఏ వహీద్ అనారోగ్యంతో చనిపోయారు. అటు తర్వాత వారసత్వంగా మొత్తం 8.78 ఎకరాల పొలం కూతురు రజియాబేగం పేరుతో మార్పు చేయించుకున్నారు. దాదాపు 2017 వరకు ఖాస్రా, పహాణి రజియాబేగం పేరుతోనే తహసీల్ కార్యాలయంలో నమోదైంది. అనంతరం ల్యాండ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ నమోదులో రెవెన్యూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి కూతురు పేరును మార్చి తిరిగి తండ్రి ఎంఏ వహీద్ పేరును చేర్చారు. అదే పేరుతో పట్టాపాసు పుస్తకంతోపాటు రైతుబంధు చెక్కు మంజూరైంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఆమె కొత్త పాసుపుస్తకం, చెక్కు తీసుకుని వెళ్లేందుకు గ్రామానికి వస్తే తన పేరుపై లేదని, తండ్రి వహీద్ పేరుతో పాసుపుస్తకం, చెక్కు రావడంతో ఆయన చనిపోయినందుకు ఇవ్వడం కుదరదని వెనక్కి పంపించారు. తన పేరుతో విరాసత్ అయ్యిందని పత్రాలు చూపించినా.. రూల్స్ ఒప్పుకోవని.. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జూన్ 29న భూమి తమ పేరుపై రాలేదని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే అప్పటికే వహీద్ పేరుతో నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి పాసుబుక్ (701220130667) ద్వారా ఎస్బీఐ బ్యాంకులో చెక్ నం.512255 పేరుతో రూ.27,100 జూన్ 25న డబ్బులు డ్రా చేసుకున్నట్లు వెలుగుచూసింది. వీఆర్ఓపై ఫిర్యాదు స్థానికంగా లేని విషయాన్ని గుర్తించి తన పేరుపై ఉన్న వారతస్వ పొలాన్ని తన తండ్రి పేరుపైకి మార్చి ఫోర్జరీ చేసి రైతుబంధు పథకం చెక్కు డబ్బులను చిన్నజట్రం వీఆర్ఓ కృష్ణారెడ్డి డ్రా చేసుకున్నారని రజియాబేగం సోమవారం నారాయణపేట తహసీల్దార్ పార్థసారథికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఆయన పనిచేసిన చోట ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
సారూ.. మా మొర ఆలకించరు
సాక్షి, నాగర్ కర్నూలు : జిల్లాలోని కోడేర్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి గత వారం రోజులుగా అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఈ చర్యలతో ఆగ్రహించిన రైతులు కార్యాలయానికి తాళాలు వేసి తమ నిరసనను తెలియజేశారు. అధికారులు మమ్మల్ని మనుషులుగా కాకుండా, మా పట్ల హేళనగా చూస్తున్నారని రైతులు ఆవేదన చెందారు. కొత్తగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకానికి సంబంధించి మాకు ఎటువంటి చెక్కులు అందట్లేదని, చెక్కులు ఇవ్వకున్నా పరవాలేదు కనీసం మా భూముల పట్టాదారు పాస్ పుస్తకాలు అయినా మాకు ఇవ్వాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు. -
నూతన వధూవరులకు సీఎం కేసీఆర్ సర్ఫ్రైజ్
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్లుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యంలో తాడికల్ వద్ద వివాహ వేడుకను చూశారు. వెంటనే బస్సు దిగి నూతన వధూవరులు కావ్య, మనోహర్‌లను పలకరించి, అక్షితలు చల్లి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనుకోని అతిథిలా ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో వధూవరుల బంధువులు ఆనంద,ఆశ్చర్యాలకు గురయ్యారు. ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
రాబందులు
► అధికారపార్టీ నాయకుల సిఫారుసు ఉంటేనే రైతు బంధు ► లేకుంటే గిడ్డంగుల్లో ఖాళీ ఉండదు ► కాసులిస్తే ఓకే..రోజూ పదుల సంఖ్యలో ► తిరిగి వెళుతున్న రైతులు కొడవలూరు(కోవూరు): నాయుడుపాళేనికి చెందిన సతీష్‌రెడ్డి అనే రైతు తాను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు బంధు కింద ధాన్యాన్ని గిడ్డంగుల్లో నిల్వ బెట్టుకోవాలనుకున్నాడు. నార్తురాజుపాళెంలోని కోవూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఈ నెల మూడో తేదీన సంప్రదించారు. గిడ్డంగులు ఖాళీ లేవనడంతో ఉసూరుమంటూ తిరిగి వెళ్లారు. రెండ్రోజుల తరువాత సిఫారుసుతో వచ్చిన ఓ రైతు ధాన్యం మాత్రం నిల్వబెట్టుకున్నాడు. ఇదీ మార్కెట్ కమిటీ అధికారుల తీరు. ∙ రైతులకు కల్పతరువు లాంటి రైతు బంధు పథకాన్ని సంబంధిత అధికారులు రైతు రాబందు పథకంగా మార్చేశారు. మార్కెటింగ్ శాఖ అధికారుల వైఖరి కారణంగా సామాన్య రైతుకు ఆ పథకం అందడం లేదు. అధికార పార్టీ నాయకుల íసిఫారుసు ఉన్నా లేక కాసులు సమర్పించుకుంటేనే పథకాన్ని సద్విని యోగం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే గిడ్డంగులు ఖాళీ లేవంటూ తిప్పి పంపేస్తున్నారు. ఈ సాకుతో రోజూ మార్కెటింగ్ శాఖ కార్యాలయానికి తిరిగిపోతున్న రైతుల సంఖ్య పదుల్లో ఉంటోంది. ఇదీ రైతుబంధు పథకం.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేనపుడు నష్టానికే తెగనమ్ముకోకుండా రైతు బంధు పథకం దోహదపడుతుంది. ధాన్యానికి ధర క్షీణించినప్పుడు రైతులు నష్టానికి అమ్ముకోకుండా రైతు బంధు పథకం కింద మార్కెటింగ్ శాఖ గిడ్డంగుల్లో భద్రపరచుకోవచ్చు. రైతులు భద్రపరచుకున్న ధాన్యానికి విలువ కట్టి అందులో 75 శాతాన్ని రైతులకు ఆర్నెల్లపాటు ఎలాంటి వడ్డీ లేకుండా ముందుగానే ఇచ్చేస్తారు. ఆ డబ్బుతో రైతుల తక్షణ అవసరాలు తీర్చుకుని ధాన్యానికి బాగా ధర వచ్చాక ధాన్యాన్ని అమ్ముకుని లాభపడవచ్చు. ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు మాత్రమే రైతు ఎలాంటి వడ్డీ లేకుండా మార్కెటింగ్ శాఖ నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్నెల్లలోనూ మంచి ధర రాకుంటే ఆ తరువాత నిల్వ పెట్టిన ధాన్యానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆర్నెల్లకంటే ఎక్కువగా నిల్వ పెట్టే పరిస్థితి ఉండదు గనుక రైతులు లాభపడతారు. ఖాళీల్లేవట ప్రస్తుతం తొలి పంట వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ధాన్యం ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లోకి వస్తోంది. «ధాన్యం తెలంగాణకు వెళుతుంటే బాగా గిరాకీ ఉంటుంది. కేవలం చెన్నైకి మాత్రమే వెళుతుండడం, అక్కడ కూడా ఆశాజనకమైన ధర లేకపోవడంతో కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి కనబరచడం లేదు. రైతులు అమ్మకోలేక రోడ్ల వెంబడి, ఖాళీ స్థలాల్లో ఆరబోసుకుంటున్నారు. బీపీటీ రకాన్నయినా కొందరు కొనుగోలు చేస్తుండగా, నెల్లూరు జిలకర రకాన్నయితే అడిగే వారు కరువయ్యారు. ధాన్యం నిల్వ బెట్టుకుందామని వెళుతున్న రైతులకు చేదు అనుభవం ఎదురవుతోంది. గిడ్డంగులు ఖాళీలేవన్న సాకుచూపి తిప్పి పంపేస్తున్నారు. సిఫార్సుతో లేదా జేబులు తడిపినా ఖాళీ ఉంటోందన్న విమర్శలూ ఉన్నాయి. గిడ్డంగుల కొరత జిల్లాలో 1.85 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగులే ఉన్నాయి. కనీసం 5 లక్షల మెట్రిక్ టన్నుల గిడ్డంగులుంటే తప్ప జిల్లాలోని రైతుల అవసరాలు తీరవు. గిడ్డంగుల కొరత ఓ సమస్యయితే ఉన్న గిడ్డంగుల విషయంలో పక్షపాతం చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సద్వినియోగం చేసుకోలేకున్నాం మార్కెటింగ్ గిడ్డంగుల్లో ధాన్యం నిల్వ బెడుదామని ఎప్పుడు వెళ్లినా గిడ్డంగులు ఖాళీలేవంటారు. కొందరు రైతులు ఆ తరువాత కూడా పెడుతూనే ఉన్నారు. ఇందులో మార్కెటింగ్ అధికారుల వైఖరేమిటో అర్థం కావడం లేదు. మాకు ఎలాంటి సిఫార్సు లేదనే అలా పంపుతున్నట్లున్నారు. – కొనిజేటి శేషగిరిరావు, రైతు, నార్తురాజుపాళెం