సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌కు భారీ ఊరట లభించింది. ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు పంట పెట్టుబడి ఆర్థిక సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. తదనుగుణంగా రైతుబంధు సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
ఈ యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధును గతంలోలాగా తక్కువ భూవిస్తీర్ణం ఉన్న రైతులకు మొదటగా ఇచ్చే పద్ధతిలో పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండగా ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ పేర్కొంది.
దీంతో ఎన్నికలకు ముందు కేవలం 28వ తేదీనే రైతుబంధు సొమ్ము పంపిణీకి వీలుంది. విడతలవారీగా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రకటించడంతో ఒకేరోజు రైతుబంధు సొమ్ము రైతులందరి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు. రైతుబంధు ద్వారా ఈ యాసంగి సీజన్‌లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment