Telangana Elections 2023 Nominations Over
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తైంది. నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగా.. ఇవాళ మధ్యాహ్నాం 3 గం.తో అది ముగిసింది. ఇవాళ నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడంతో ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది.
తెలంగాణలో నిన్న దాకా వరకు మొత్తం 2,474 నామినేషన్లు దాఖలు కాగా.. ఇవాళ చివరిరోజు వెయ్యికి పైగా నామినేషన్లు దాఖలై ఉంటాయని అంచనా. ఈ మధ్యలో నిన్న(నవంబర్ 9) ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నెల 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు 15వ తేదీలోపు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.
మరోవైపు బీ-ఫామ్ సబ్మిట్‌కు సైతం గడువు ముగిసింది. బీ-ఫామ్ సమర్పించని అభ్యర్థుల్ని స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం. అలాగే నామినేషన్ సమయంలో వందకు పైగా అభ్యర్థులు అఫిడవిట్లు సమర్పించలేదు. దీంతో వాళ్లకు రిటర్నింగ్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 94 రాజకీయ పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం.. ఈసారి నామినేషన్ల సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని స్పష్టమవుతోంది.
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న మూడో శాసనసభ ఎన్నికల్లో 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహణ, ఫలితాల వెల్లడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment