ప్రజావాణిలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తున్న రజియాబేగం
నారాయణపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పక్కదారి పడుతోంది. మామూళ్లకు రుచిమరిగిన రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్న లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు జిల్లాలోని మద్దూరు, గండీడ్ మండలాల్లో చోటుచేసుకున్న అక్రమాలకు తోడు పేట మండలంలో కూడా వరుస ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పేట మండలంలోని సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చిన్నజట్రంలో ఏకంగా 20 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో రైతుబంధు చెక్కును సృష్టించడం వాటిని కాజేయడం కూడా జరిగిపోయింది. సదరు చనిపోయిన వ్యక్తిది నకిలీ ఆధార్‌కార్డుతో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
చిన్నజట్రం గ్రామానికి చెందిన ఎంఏ వహీద్‌కు సర్వే నం. 327లో 8.78ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. ఆయనకు ఇద్దరు సంతానం కాగా వారిలో ఒకరు ఖాజాబేగం 20 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తర్వాత రజియాబేగం ఇటీవల పిల్లల చదువుల కోసం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే 1998లోనే ఎంఏ వహీద్ అనారోగ్యంతో చనిపోయారు. అటు తర్వాత వారసత్వంగా మొత్తం 8.78 ఎకరాల పొలం కూతురు రజియాబేగం పేరుతో మార్పు చేయించుకున్నారు. దాదాపు 2017 వరకు ఖాస్రా, పహాణి రజియాబేగం పేరుతోనే తహసీల్ కార్యాలయంలో నమోదైంది. అనంతరం ల్యాండ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ నమోదులో రెవెన్యూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి కూతురు పేరును మార్చి తిరిగి తండ్రి ఎంఏ వహీద్ పేరును చేర్చారు.
అదే పేరుతో పట్టాపాసు పుస్తకంతోపాటు రైతుబంధు చెక్కు మంజూరైంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఆమె కొత్త పాసుపుస్తకం, చెక్కు తీసుకుని వెళ్లేందుకు గ్రామానికి వస్తే తన పేరుపై లేదని, తండ్రి వహీద్ పేరుతో పాసుపుస్తకం, చెక్కు రావడంతో ఆయన చనిపోయినందుకు ఇవ్వడం కుదరదని వెనక్కి పంపించారు. తన పేరుతో విరాసత్ అయ్యిందని పత్రాలు చూపించినా.. రూల్స్ ఒప్పుకోవని.. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జూన్ 29న భూమి తమ పేరుపై రాలేదని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే అప్పటికే వహీద్ పేరుతో నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి పాసుబుక్ (701220130667) ద్వారా ఎస్‌బీఐ బ్యాంకులో చెక్ నం.512255 పేరుతో రూ.27,100 జూన్ 25న డబ్బులు డ్రా చేసుకున్నట్లు వెలుగుచూసింది.
వీఆర్‌ఓపై ఫిర్యాదు
స్థానికంగా లేని విషయాన్ని గుర్తించి తన పేరుపై ఉన్న వారతస్వ పొలాన్ని తన తండ్రి పేరుపైకి మార్చి ఫోర్జరీ చేసి రైతుబంధు పథకం చెక్కు డబ్బులను చిన్నజట్రం వీఆర్‌ఓ కృష్ణారెడ్డి డ్రా చేసుకున్నారని రజియాబేగం సోమవారం నారాయణపేట తహసీల్దార్ పార్థసారథికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఆయన పనిచేసిన చోట ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment