patta pass books
-
భర్త పేరు మీద ఉన్న భూమి భార్యకు రిజిస్ట్రేషన్
దుగ్గొండి: భర్త పేరుమీద ఉన్న భూమిని భార్య తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. అయితే పట్టాదారు పాస్‌పుస్తకం లేకుండా జిరాక్స్ కాపీ ఆధారంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కుమారుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన దుగ్గొండిలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ రవీందర్ 2021, మే నెలలో కరోనాతో చనిపోయాడు. ఆయన పేరున 135 సర్వేనంబర్‌లో 1.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అతని పేరుమీద ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకం (ఖీ22040160118) రవీందర్ మరణానంతరం కుమారుడు మధు దగ్గర ఉంచుకున్నాడు. మధు గీసుగొండ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో తహసీల్దార్ సంపత్.. ఆ భూమిని రవీందర్ భార్య అరుణకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతి ఆధారంగా ఈ నెల 13న రిజిస్ట్రేషన్ చేశాడు. మ్యుటేషన్ చేయించుకునేందుకు వెళ్లిన మధు అంబరగొండ మధు తన తండ్రి రవీందర్ పేరున ఉన్న భూమిని వారసత్వం కింద మ్యుటేషన్ చేయించుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకుని మీసేవా కేంద్రానికి వవెళ్లాడు. ధరణి పోర్టల్‌లో తన తండ్రి పేరు కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సమాధానం సరిగా రాకపోవడంతో బుధవారం మధు, భార్య మాధవి ఇద్దరు కూతుళ్లను వెంట బెట్టుకుని పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగాడు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. అరుణ చీటింగ్ చేసింది : తహసీల్దార్ సంపత్‌కుమార్ తన భర్త రవీందర్ కరోనాతో మృతిచెందాడని, పట్టాదారు పాస్ పుస్తకం పోయిందని, భర్త పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని అరుణ పలుమార్లు కార్యాలయానికి వచ్చింది. కదరదని చెప్పి తిరిగి పంపించా. మూడోసారి కుటుంబంలో ఎలాంటి తగాదాలూ లేవని, పాస్ పుస్తకం పోయింది వాస్తవమని ప్రాధేయపడింది. దీంతో అరుణ పేరున రిజిస్ట్రేషన్ చేశా. అరుణపై చీటింగ్ కేసు నమోదు చేయించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తా. నాకు ధైర్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. కాగా, దీనిపై అరుణ మాట్లాడుతూ తాము సంపాదించిన డబ్బులతో కుమారుడి పేరుమీద మరో 1.16 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపింది. ఇప్పుడే తన మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్ముందు వృద్ధాప్యంలో ధైర్యంగా ఉంటుందని తన భర్త పేరుమీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. నా తదనంతరం ఆ భూమి నా కుమారుడికే చెందుతుందని తెలిపింది. -
రెవె‘న్యూ’ లీలలు!
నారాయణపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పక్కదారి పడుతోంది. మామూళ్లకు రుచిమరిగిన రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్న లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు జిల్లాలోని మద్దూరు, గండీడ్ మండలాల్లో చోటుచేసుకున్న అక్రమాలకు తోడు పేట మండలంలో కూడా వరుస ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పేట మండలంలోని సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చిన్నజట్రంలో ఏకంగా 20 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో రైతుబంధు చెక్కును సృష్టించడం వాటిని కాజేయడం కూడా జరిగిపోయింది. సదరు చనిపోయిన వ్యక్తిది నకిలీ ఆధార్‌కార్డుతో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. చిన్నజట్రం గ్రామానికి చెందిన ఎంఏ వహీద్‌కు సర్వే నం. 327లో 8.78ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. ఆయనకు ఇద్దరు సంతానం కాగా వారిలో ఒకరు ఖాజాబేగం 20 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తర్వాత రజియాబేగం ఇటీవల పిల్లల చదువుల కోసం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే 1998లోనే ఎంఏ వహీద్ అనారోగ్యంతో చనిపోయారు. అటు తర్వాత వారసత్వంగా మొత్తం 8.78 ఎకరాల పొలం కూతురు రజియాబేగం పేరుతో మార్పు చేయించుకున్నారు. దాదాపు 2017 వరకు ఖాస్రా, పహాణి రజియాబేగం పేరుతోనే తహసీల్ కార్యాలయంలో నమోదైంది. అనంతరం ల్యాండ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ నమోదులో రెవెన్యూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి కూతురు పేరును మార్చి తిరిగి తండ్రి ఎంఏ వహీద్ పేరును చేర్చారు. అదే పేరుతో పట్టాపాసు పుస్తకంతోపాటు రైతుబంధు చెక్కు మంజూరైంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఆమె కొత్త పాసుపుస్తకం, చెక్కు తీసుకుని వెళ్లేందుకు గ్రామానికి వస్తే తన పేరుపై లేదని, తండ్రి వహీద్ పేరుతో పాసుపుస్తకం, చెక్కు రావడంతో ఆయన చనిపోయినందుకు ఇవ్వడం కుదరదని వెనక్కి పంపించారు. తన పేరుతో విరాసత్ అయ్యిందని పత్రాలు చూపించినా.. రూల్స్ ఒప్పుకోవని.. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జూన్ 29న భూమి తమ పేరుపై రాలేదని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే అప్పటికే వహీద్ పేరుతో నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి పాసుబుక్ (701220130667) ద్వారా ఎస్బీఐ బ్యాంకులో చెక్ నం.512255 పేరుతో రూ.27,100 జూన్ 25న డబ్బులు డ్రా చేసుకున్నట్లు వెలుగుచూసింది. వీఆర్ఓపై ఫిర్యాదు స్థానికంగా లేని విషయాన్ని గుర్తించి తన పేరుపై ఉన్న వారతస్వ పొలాన్ని తన తండ్రి పేరుపైకి మార్చి ఫోర్జరీ చేసి రైతుబంధు పథకం చెక్కు డబ్బులను చిన్నజట్రం వీఆర్ఓ కృష్ణారెడ్డి డ్రా చేసుకున్నారని రజియాబేగం సోమవారం నారాయణపేట తహసీల్దార్ పార్థసారథికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఆయన పనిచేసిన చోట ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలి
రాయికల్(జగిత్యాల): పట్టాదారు పాస్‌బుక్‌లను జారీ చేసేందుకు డిజిటల్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో నరేందర్ అన్నారు. రాయికల్‌లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులంతా తమ పట్టాదారు పాస్‌బుక్‌లను ఆధార్‌తో అనుసంధాన ప్రక్రియ దాదాపు పూర్తయిందని, డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోందని తెలిపారు. రైతులు తమ ఆధార్‌ను పట్టాదారు పాస్‌బుక్‌లకు అనుసంధానం చేయకపోతే వెంటనే వీఆర్వోలకు అందించాలని కోరారు. తద్వారానే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయని పేర్కొన్నారు. తమ భూములను సర్వే చేయించాలని దావన్‌పల్లి గ్రామస్తులు ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ హన్మంతరెడ్డి ఉన్నారు. -
ఒకేసారి పట్టా పాస్ పుస్తకాల పంపిణీ: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : మార్చి 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాపాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. సమావేశంలో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, పంచాయతీరాజ్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ విధులు, మున్సిపల్ చట్ట సవరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. పాస్‌పుస్తకాలు ఒకరోజు ముందే గ్రామాలకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. దీని కోసం ప్రతీ గ్రామానికి ప్రత్యేకంగా ఒక వాహనాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశించారు. -
పట్టా పాస్‌పుస్తకాలతో ఆధార్ సీడింగ్!
రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీసీఎల్ఏ అధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూ అక్రమాలకు కళ్లెం వేయాలని సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ భూమి కలిగిన ప్రతీ పట్టాదారుకు తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు అన్ని జిల్లాల్లోనూ భూములు కలిగిన యజమానుల వద్ద ఉన్న పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్ నంబరును అనుసంధానం చేసేందుకు సీసీఎల్ఏ అధికారులు సన్నద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలు కోసం జాతీయ సమాచార కేంద్రం(ఎన్ఐసీ) అధికారులతో కలసి కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా.. పట్టాదార్ పాస్‌పుస్తకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయడం ద్వారా ఏ రైతుకు ఏ ప్రాంతంలో ఎంత భూమి ఉందన్న మొత్తం సమాచారాన్ని ఇట్టే తెలుసుకునేందుకు వీలు కలుగనుంది. అలాగే.. రైతులు కూడా సర్కారు రికార్డుల్లో తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునేందుకు వెసులుబాటు కలగనుంది. వారి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఇతరులెవరైనా అక్రమంగా పేర్లు మార్చడం, ఒకరి భూములను వేరొకరి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడం.. వంటి అవకతవకలను నివారించేందుకు ఆధార్ అనుసంధానం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. రైతులకు ప్రభుత్వం అందించే వివిధ పథకాలను పారదర్శకంగా అమలు చేసేందుకు కూడా ఈ విధానం ఉపకరిస్తుందని, తరచుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు అధికారులు, సిబ్బంది పెద్దగా హైరానా పడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.