కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బా, పాస్ పుస్తకంతో మధు, కుటుంబ సభ్యులు
దుగ్గొండి: భర్త పేరుమీద ఉన్న భూమిని భార్య తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. అయితే పట్టాదారు పాస్‌పుస్తకం లేకుండా జిరాక్స్ కాపీ ఆధారంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కుమారుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన దుగ్గొండిలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ రవీందర్ 2021, మే నెలలో కరోనాతో చనిపోయాడు. ఆయన పేరున 135 సర్వేనంబర్‌లో 1.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అతని పేరుమీద ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకం (ఖీ22040160118) రవీందర్ మరణానంతరం కుమారుడు మధు దగ్గర ఉంచుకున్నాడు. మధు గీసుగొండ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో తహసీల్దార్ సంపత్.. ఆ భూమిని రవీందర్ భార్య అరుణకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతి ఆధారంగా ఈ నెల 13న రిజిస్ట్రేషన్ చేశాడు.
మ్యుటేషన్ చేయించుకునేందుకు వెళ్లిన మధు
అంబరగొండ మధు తన తండ్రి రవీందర్ పేరున ఉన్న భూమిని వారసత్వం కింద మ్యుటేషన్ చేయించుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకుని మీసేవా కేంద్రానికి వవెళ్లాడు. ధరణి పోర్టల్‌లో తన తండ్రి పేరు కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సమాధానం సరిగా రాకపోవడంతో బుధవారం మధు, భార్య మాధవి ఇద్దరు కూతుళ్లను వెంట బెట్టుకుని పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగాడు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు.
అరుణ చీటింగ్ చేసింది : తహసీల్దార్ సంపత్‌కుమార్
తన భర్త రవీందర్ కరోనాతో మృతిచెందాడని, పట్టాదారు పాస్ పుస్తకం పోయిందని, భర్త పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని అరుణ పలుమార్లు కార్యాలయానికి వచ్చింది. కదరదని చెప్పి తిరిగి పంపించా. మూడోసారి కుటుంబంలో ఎలాంటి తగాదాలూ లేవని, పాస్ పుస్తకం పోయింది వాస్తవమని ప్రాధేయపడింది. దీంతో అరుణ పేరున రిజిస్ట్రేషన్ చేశా. అరుణపై చీటింగ్ కేసు నమోదు చేయించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తా.
నాకు ధైర్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా..
కాగా, దీనిపై అరుణ మాట్లాడుతూ తాము సంపాదించిన డబ్బులతో కుమారుడి పేరుమీద మరో 1.16 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపింది. ఇప్పుడే తన మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్ముందు వృద్ధాప్యంలో ధైర్యంగా ఉంటుందని తన భర్త పేరుమీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. నా తదనంతరం ఆ భూమి నా కుమారుడికే చెందుతుందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment