land regestration
-
భర్త పేరు మీద ఉన్న భూమి భార్యకు రిజిస్ట్రేషన్
దుగ్గొండి: భర్త పేరుమీద ఉన్న భూమిని భార్య తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకుంది. అయితే పట్టాదారు పాస్‌పుస్తకం లేకుండా జిరాక్స్ కాపీ ఆధారంగా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని కుమారుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ ఘటన దుగ్గొండిలో బుధవారం చోటుచేసుకుంది. మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన అంబరగొండ రవీందర్ 2021, మే నెలలో కరోనాతో చనిపోయాడు. ఆయన పేరున 135 సర్వేనంబర్‌లో 1.34 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అతని పేరుమీద ప్రభుత్వం జారీ చేసిన నూతన పట్టాదారు పాస్ పుస్తకం (ఖీ22040160118) రవీందర్ మరణానంతరం కుమారుడు మధు దగ్గర ఉంచుకున్నాడు. మధు గీసుగొండ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో తహసీల్దార్ సంపత్.. ఆ భూమిని రవీందర్ భార్య అరుణకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతి ఆధారంగా ఈ నెల 13న రిజిస్ట్రేషన్ చేశాడు. మ్యుటేషన్ చేయించుకునేందుకు వెళ్లిన మధు అంబరగొండ మధు తన తండ్రి రవీందర్ పేరున ఉన్న భూమిని వారసత్వం కింద మ్యుటేషన్ చేయించుకోవడానికి పట్టాదారు పాస్ పుస్తకం పట్టుకుని మీసేవా కేంద్రానికి వవెళ్లాడు. ధరణి పోర్టల్‌లో తన తండ్రి పేరు కనిపించకపోవడంతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సమాధానం సరిగా రాకపోవడంతో బుధవారం మధు, భార్య మాధవి ఇద్దరు కూతుళ్లను వెంట బెట్టుకుని పురుగుల మందు డబ్బాతో తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆందోళనకు దిగాడు. 15 రోజుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించాడు. అరుణ చీటింగ్ చేసింది : తహసీల్దార్ సంపత్‌కుమార్ తన భర్త రవీందర్ కరోనాతో మృతిచెందాడని, పట్టాదారు పాస్ పుస్తకం పోయిందని, భర్త పేరున ఉన్న భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని అరుణ పలుమార్లు కార్యాలయానికి వచ్చింది. కదరదని చెప్పి తిరిగి పంపించా. మూడోసారి కుటుంబంలో ఎలాంటి తగాదాలూ లేవని, పాస్ పుస్తకం పోయింది వాస్తవమని ప్రాధేయపడింది. దీంతో అరుణ పేరున రిజిస్ట్రేషన్ చేశా. అరుణపై చీటింగ్ కేసు నమోదు చేయించడంతోపాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తా. నాకు ధైర్యంగా ఉంటుందని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. కాగా, దీనిపై అరుణ మాట్లాడుతూ తాము సంపాదించిన డబ్బులతో కుమారుడి పేరుమీద మరో 1.16 గుంటలు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపింది. ఇప్పుడే తన మందులు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని, మున్ముందు వృద్ధాప్యంలో ధైర్యంగా ఉంటుందని తన భర్త పేరుమీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెప్పింది. నా తదనంతరం ఆ భూమి నా కుమారుడికే చెందుతుందని తెలిపింది. -
15 రోజుల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఆమోదంపై ప్రభుత్వ స్పందన
-
ధరణిలో ప్రక్రియ షురూ.. తహసీల్దార్లకు లాగిన్
సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ధరణి వెబ్సైట్ ద్వారా మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్) మార్పిడి అధికారాలను ఆర్డీవో నుంచి తహసీల్దార్‌కు బదలాయించింది. వారికి లాగిన్ ఇచ్చే ప్రక్రియకు గురువారం నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇక నుంచి నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే ప్రక్రియ) వ్యవహారం పూర్తిగా తహసీల్దార్ల పరిధిలోకి రానుంది. గతంలో తహసీల్దార్ ఇచ్చే నివేదిక ప్రకారం ఆర్డీవోలు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేవారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో ఆ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. ఆ అధికారాలు ఇంకా తహశీల్దార్లకు బదలాయించలేదు. ఇప్పుడు ధరణిలో తహశీల్దార్లకు నేటి నుంచి లాగిన్ ఇవ్వనుండటంతో వీలున్నంత తక్కువ సమయంలోనే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే వీలు కలగనుంది. లక్షల్లో పెండింగ్.. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నవి లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పెండింగ్ మ్యుటేషన్లు 2 లక్షల వరకు ఉంటాయని సమాచారం. అయితే ధరణి పోర్టల్‌లో పెండింగ్ మ్యుటేషన్ల పరిష్కారానికి తహశీల్దార్లకు ఆప్షన్ ఇచ్చినా ప్రాసెస్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పెండింగ్ మ్యుటేషన్ల సమస్య అలానే ఉండిపోతోంది. ఈ సమస్యను బుధవారం.. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్లు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ సానుకూలంగా స్పందించడంతో ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు పెద్ద ఎత్తున సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరిస్తేనే ప్రక్రియ సజావుగా సాగుతుందని రెవెన్యూ సంఘాలు అంటున్నాయి. సీఎస్‌కు ట్రెసా ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలివీ.. – ధరణిలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లపై కోర్టులు స్టే విధిస్తే.. ఆ స్టే ఉత్తర్వులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్లు కలెక్టర్లకు పంపే అవకాశం లేదు. – నిషేధిత జాబితాలోని భూముల వివరాలు పోర్టల్‌లో పూర్తి స్థాయిలో కన్పించట్లేదు. దీంతో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు పొరపాటున పట్టా భూములుగా నమోదైతే వాటి రిజిస్ట్రేషన్లను నిలువరించే అవకాశం లేకుండాపోతోంది. – ధరణి కంటే ముందే జరిగి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, విరాసత్లను ధరణిలో నమోదు చేయలేదు. – గతంలో కొన్ని భూములను అమ్మి రిజిస్ట్రేషన్ చేసినా.. ఆ భూములు కొనుగోలుదారుడి పేరిట మ్యుటేషన్ కావట్లేదు. దీంతో గతంలో అమ్మిన వ్యక్తి మళ్లీ ఇంకొకరికి అమ్ముకునే అవకాశం ఉంది. – గతంలో జీపీఏ చేసుకున్న వారు మరొకరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ధరణిలో ఇవ్వలేదు. – అపరిష్కృతంగా ఉన్న డిజిటల్ సంతకాలు కాని ఖాతాలకు సంబంధించి అన్ని ఆప్షన్స్ తహశీల్దార్లకు ఇవ్వాలి. – భూ రికార్డుల ప్రక్షాళనలో పరిష్కారం కాని పార్ట్–బి భూముల విషయంలో ప్రజల నుంచి తహశీల్దార్లపై ఒత్తిడి వస్తున్నందున వాటి పరిష్కారానికి తగిన మార్గదర్శకాలివ్వాలి. – అధికారులు సెలవు పెట్టినప్పుడు ధరణి లాగిన్‌ను కలెక్టర్ నుంచి అదనపు కలెక్టర్లకు, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, ఆపరేటర్ల లాగిన్లను ఆర్డీవోలకు ఇవ్వాలి. – ధరణి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నకలును మీ–సేవ కేంద్రాల్లో ఇచ్చేలా ఆప్షన్ ఉండాలి. – కొనుగోలుదార్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ రిజిస్టర్ చేసే ఆప్షన్ ఇవ్వాలి. – పార్టీషన్ భూముల విషయంలో మొత్తం భూమికి (పార్ట్‌కు కాకుండా) ఫీజు జనరేట్ అవుతున్నందున ఆ ఆప్షన్ మార్చాలి. – ధరణిలో నమోదైన డేటాలో క్లరికల్ తప్పుల మార్పునకు అవకాశం ఇవ్వాలి. ఏ డాక్యుమెంట్ అయినా ఓకే.. ఆన్లైన్ స్లాట్ ద్వారానే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మార్గదర్శకాలు పంపారు. దీని ప్రకారం ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కోసం క్రయ, విక్రయదారుల వివరాలు, ఆస్తి లావాదేవీల గురించి వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు ఆటోమేటిక్‌గానే వెబ్సైట్లో కనిపిస్తాయి. ఆ మేరకు మొత్తం స్టాంపు, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే పార్టీలు వెబ్సైట్ ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్లే సొంతంగా డాక్యుమెంట్లు తెచ్చుకోవచ్చు. ఆ డాక్యుమెంట్‌లోని వివరాల బాధ్యతను రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకోదు. నిషేధిత ఆస్తులకు స్లాట్ బుకింగ్ కాకుండా ఆటోమేటిక్ లాక్ విధించారు. అయినా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ భూమి నిషేధిత జాబితా (22ఏ)లో ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ అయిన తర్వాత నిర్దేశిత సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్రయ, విక్రయదారులు, సాక్షులు వచ్చి ప్రక్రియ పూర్తి చేసిన రోజే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల విషయంలో ఎక్కడ ఉల్లంఘన జరిగినా సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటారు. వ్యవసాయేత రిజిస్ట్రేషన్లు సజావుగా జరిగేలా జిల్లా రిజిస్ట్రార్లు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుందని ఐజీ శేషాద్రి పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నాలా రుసుము ఖరారు.. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు చెల్లించా ల్సిన రుసుమును సర్కార్ ఖరారు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో బేసిక్ విలువలో 2 శాతం, జీహెచ్ఎంసీయేతర ప్రాంతాల్లో 3 శాతం ఫీజు చెల్లించి నాలా మార్పిడి చేసుకోవచ్చని బుధవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్పిడి ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
అమావాస్య.. ఆగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అమావాస్య కావడం, ప్రజలకు అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, అదనపు ధ్రువపత్రాలు అవసరం కావడంతో రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ తక్కువ సంఖ్య లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు 107 స్లాట్లు బుక్ కాగా, అందులో 82 మాత్రమే పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వివిధ కారణాలతో 25 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని సమాచారం. అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని 3 నెలల తర్వాత తొలిరోజు ప్రా రంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెల్లడిస్తోంది. సర్వర్లు సహకరించలేదు.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో తొలి రోజు చాలా సమస్యలు ఎదురుకావడంతో క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేస్తున్నా.. పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా స్లాట్ బుకింగ్ విషయంలో సర్వర్లు సహకరించలేదు. దీనికి తోడు భవనాలు, ఫ్లాట్లు, మార్ట్గేజ్, గిఫ్ట్ డీడ్లకు మాత్రమే అవకాశం ఇవ్వగా, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కావట్లేదు. క్రయ, విక్రయదారుల వివరాలు నమోదు చేసుకోవడం వరకే ఆగిపోయింది. స్లాట్ అప్రూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో ఉన్న ఇంటి పన్ను, కరెంటు బిల్లు నిబంధనకు తోడు పీ టిన్ పేరుతో స్థానిక సంస్థలు ఇచ్చే నంబర్‌ను నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు కన్పిస్తున్నాయి. దీంతో చాలా మంది పీ టిన్ నంబర్ లేక స్లాట్ బుక్ చేసుకోవడం కుదరలేదు. మరో సమస్య ఏంటంటే.. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరగకపోయినా.. ఆ పోర్టల్‌లో నమోదైన ఆస్తులు, భూముల వివరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ సహకరిస్తోంది. ఆ పోర్టల్‌లో నమోదు కాని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదని తొలి రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన వారు చెబుతున్నారు. ఇక పాత చలాన్ల సమస్య, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి సమస్యలు, సాక్షులను మార్చుకునే అవకాశం లేకపోవడం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపు లాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే డాక్యుమెంట్లు అన్నీ ఉండి, వెబ్సైట్లో పక్కాగా నమోదు చేసుకుంటే ఈ ప్రక్రియ సులభంగా ఉంటుందని, 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయి ఈ–పాస్‌బుక్ కూడా చేతికి వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించి మరింత సరళంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరపాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు. సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ.. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం తొలి భేటీ కానుంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీని ప్రభుత్వం ఆదివారమే నియమించింది. తొలి రోజుతో పాటు మంగళవారం కూడా ఎదురైన సమస్యలను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. వరుసగా నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన విధానాలను సిఫారసు చేస్తూ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. డాక్యుమెంట్ రైటర్ల పరిస్థితేంటి? వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు పేపర్ల అవసరం లేకపోవడంతో ఇప్పటివరకు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్ద డాక్యుమెంట్లు రాసుకుని జీవిస్తున్న వేలాది మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఏ స్థాయిలోనూ తమ అవసరం లేకపోవడం, వివరాల నమోదు మీ సేవకు అప్పగించడంతో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు నిర్ణయించినట్లు సమాచారం. పాత చలాన్ చెల్లదంటున్నారు ‘రిజిస్ట్రేషన్లు నిలిచిపోకముందే నేను స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న రూ.90 వేల చలాన్ తీశాను. సెప్టెంబర్ 9 స్లాట్ ఇస్తే 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు పాత చలాన్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయమంటే అవి చెల్లవంటున్నారు. పాత చలాన్లో 10శాతం కట్ అయి ఆనుంచి 12 నెలల్లో ఆ సొమ్ము తిరిగి జమ అవుతుందని చెపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నేను రూ.90 వేలు పెట్టాలి. ఆ డబ్బులు లేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాను.’ చొక్కారపు నర్సయ్య, హన్మకొండ నా సోదరుడి వద్ద ఏడాది కిందట ఇల్లు కొన్నా. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని డాక్యుమెంట్లతో సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లా. కానీ రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇంటి నంబర్, పీటీఐ నంబర్, నల్లా, కరెంట్ బిల్లులు కావాలన్నారు. అవేమీ తీసుకువెళ్లకపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగా. – చక్కెర విజయ్‌కుమార్, సూర్యాపేట ప్రధాన సమస్యలివీ.. స్లాట్లు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బందులు పెడుతున్నాయి. ఖాళీ స్థలాలకు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతిస్తున్నారు. మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ల కోసం డీడీ నంబర్ ఇస్తే ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. యజమాని మరణిస్తే వారి వారసుల పేర్లు నమోదు చేసే అవకాశం లేదు. బిల్డింగులు, ఫ్లాట్లు, మార్ట్గేజ్, గిఫ్టు రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి. జీపీఏలకు అవకాశం ఇవ్వలేదు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు వివరాలు నమోదవుతున్నా.. రిజిస్ట్రేషన్ పూర్తవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ జరగకపోతే చలాన్ మురిగి పోతోంది. గతంలో 6 నెలలు చాన్స్ ఉండేది. ఎన్వోసీ, బీఆర్ఎస్, బీపీఎస్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్, విద్యుత్‌శాఖల బిల్లు చెల్లింపుల ధ్రువ పత్రాలుంటేనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం డాక్యుమెంట్లో నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు ఇవ్వట్లేదు. సాక్షుల పేర్లు ముందే ఆన్లైన్లో నమోదు చేయాల్సి వస్తుండటంతో ఎవరైనా రాకపోతే ఇతరులను సాక్షులుగా మార్చుకొనే వీల్లేదు. పాత చలాన్లను అనుమతించట్లేదు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్, ఈ–పాస్‌బుక్ సిటిజన్ లాగిన్‌లో కనిపించట్లేదు. -
వెలుగుచూస్తున్న తహసీల్దార్ అక్రమాలు
విడవలూరు: ఇటీవల విడవలూరు మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న చుక్కల భూములకు పట్టాలు పుట్టించే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విడవలూరు తహసీల్దార్ లీలలు మరిన్ని వెలుగుచూస్తున్నాయి. వివరాలు.. ఇటీవల అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు పట్టా భూములను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. అందులో భాగంగా మండల కేంద్రమైన విడవలూరులో 10 ఎకరాలను గుర్తించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.20 లక్షలు ఉన్నట్లు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపారు. అలాగే రామతీర్థంలో మూడున్నర ఎకరాలను కూడా గుర్తించారు. ఇక్కడ ప్రభుత్వ విలువ అతి తక్కువగా ఉన్నప్పటికీ అక్కడ కూడా ఎకరా రూ.20 లక్షలుగా ప్రతిపాదనలు పంపారు. దీంతోపాటు ముదివర్తి గ్రామంలో కూడా 6 ఎకరాలను గుర్తించారు. ఇక్కడ కూడా ప్రభుత్వ విలువ తక్కువగా ఉన్నప్పటికీ ఎకరా రూ.23 లక్షలుగా ఉందని ప్రతిపాదనలు పంపారు. ఇలా ప్రభుత్వ విలువ ఎక్కువగా ఉన్నచోట తక్కువ గానూ, తక్కువగా ఉన్న చోట ఎక్కువ గానూ ప్రతిపాదనలు పంపడంలో ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ముదివర్తి గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ సాహెబ్‌కు సర్వే నంబర్ 306–బీ లో 1.17 ఎకరాలు, 306–సీ లో 0.6 ఎకరాలు, 306–డీ1లో 0.22 ఎకరాల భూమి(మొత్తం 1.45 ఎకరాలు) ఉంది. ఇందుకు సంబంధించిన ఈ–పాస్ బుక్ కూడా సంబంధిత రైతు వద్ద ఉంది. అయితే గత నెల 8వ తేదీన ఈ రైతు పేరుతో కేవలం 0.39 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు చూపుతున్నారు. దీనిని తహసీల్దార్ మార్చి వేశారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. తన మిగిలిన పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాలకు గుర్తించిన వాటిలో కలిపి ఎక్కువ పొలంగా చూపి మోసం చేసేందుకు తహసీల్దార్ సిద్ధమైనట్లు బాధిత రైతు వాపోయాడు. న్యాయం చేయండి నాకున్న 1.45 ఎకరాల భూమిలో దాదాపు 1.06 ఎకరాల భూమిని మరో రైతు పేరు మీదకు మార్చారు. ఇది కూడా గత నెల 8వ తేదీన జరిగింది. నా పొలాన్ని ప్రస్తుతం ఇళ్ల స్థలాల కోసం గుర్తించి, ఎక్కువ భూమిగా చూపి తహసీల్దార్ మోసం చేయడానికి సిద్ధపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నాకు న్యాయం చేయాలి. – షేక్ మస్తాన్‌సాహెబ్ -
ఏకంగా డీఎస్పీ భూమినే..
అనంతపురం సెంట్రల్ : ఇతరుల భూములను తమ పేరు మీదుగా చిత్రీకరించి విక్రయించాలని చూశారు.. కొందరు ప్రబుద్ధులు. అయితే ఆ స్థలం పోలీస్ డీఎస్పీది అని గుర్తించలేకపోయారేమో.. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్ సీఐ రాఘవన్‌తో కలిసి డీఎస్పీ మల్లికార్జున వర్మ గురువారం విలేకరులకు వివరించారు. కె.రవికుమార్ తిరుపతిలో డీఎస్పీగా పనిచే స్తున్నారు. ఆయన తండ్రి నారాయణస్వామి పేరిట నగరంలో బైరవనగర్‌లో (సర్వేనెంబర్ 400లోని 36, 37)లో పది సెంట్ల స్థలం ఉంది. ఇటీవల తన భూమిని ఎవరో చదును చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని డీఎస్పీ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కూపీ లాగితే అసలు విషయం బయటపడింది. ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి డాక్యుమెంట్ రైటర్ కోటప్పతో కలిసి చాలా కాలంగా లావాదేవీలు జరగని ప్లాట్లను తమవిగా చిత్రీకరించి విక్రయించడానికి యత్నించారు. వీరంతా ధర్మవరానికి చెందిన నారాయణస్వామి, అతని కొడుకు ఈశ్వరయ్యను పిలిచుకుని అక్కడి డాక్యుమెంట్ రైటర్ శివశంకర్ సాయంతో శాశ్వత ఖరారునామా చేయించారు. తర్వాత ఆ ప్లాట్లను తాడిపత్రి మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన లింగుట్ల నరసింహులుకు రూ.14.52 లక్షలకు అమ్మి ఈ ఏడాది జూన్ 9న రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన నరసింహులు స్వాధీనం చేసుకునే క్రమంలో విషయం డీఎస్పీ దృష్టికి వెళ్లింది. విచారణ చేయగా అసలు నిందితులు బయటపడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐలు వెంకటరమణ, రంగడు, సిబ్బంది పాల్గొన్నారు.