Purification Plant
-
కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రోత్సాహం
పటాన్చెరు: రాష్ట్రంలో కాలుష్య రహిత పరిశ్రమలను ప్రోత్సహిస్తామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సోమవారం ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారంలో పరిశ్రమల వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పర్యావరణ విధ్వంసం జరిగిందన్నారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ పారిశ్రామిక పెట్టుబడులను స్వాగతిస్తున్నాయని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పారిశ్రామికాభివృద్ధిని కాంక్షిస్తోందన్నారు. అయితే తమ ప్రభుత్వం కాలుష్యాన్ని అరికట్టేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పారిశ్రామికవాడలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న పరిశ్రమలను తరలించేందుకు సిద్ధంగా ఉన్నా మన్నారు. 1,120 పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలికి తరలించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల తరలింపుపై అధ్యయనం చేయాల్సిందిగా ఈపీటీఆర్ఐ సంస్థకు సూచించినట్లు తెలిపారు. సంస్థ నివేదిక ప్రకారం సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రకరణ్, జహీరాబాద్‌లోని బూచనెల్లి, పటాన్‌చెరులోని లక్డారం, పాశమైలారం, సిద్దిపేటలోని వెల్దుర్తి, రంగారెడ్డిలోని నవాబ్‌పేట, హుస్సేన్‌బాద్, అరకట్ల, రాకంచర్ల ప్రాంతాలకు ఓఆర్ఆర్ లోపలున్న పరిశ్రమలను తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఆ పారిశ్రామికవాడలకు వెళ్లాలని హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలోని పారిశ్రామికవేత్తలకు సూచిస్తామన్నారు. కాలుష్య నివారణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగా కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసివేస్తామని తెలిపారు. కొందరు కాలుష్య వ్యర్థాలను పాడైన బోరు బావుల గొట్టాల ద్వారా భూమి పొరల్లోకి పంపిస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాశమైలారంలో ఉన్న అన్ని కాలుష్య పరిశ్రమలకు చెందిన ఘన, ద్రవ వ్యర్థాలను ట్రీట్ చేసే జీరో డిశ్చార్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను రూ.104 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాల మల్లు తదితరులు పాల్గొన్నారు. రెండు విచిత్రాలు.. భాష విషయంలో మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. ‘నాకు విచిత్రం అనిపిస్తుంది. ఒకటి కాదు.. రెండు విచిత్రాలు. కొందరేమో తెలుగువారై ఉండీ తెలుగులో మాట్లాడలేరు. తెలుగు మాతృభాష కాని వారు వచ్చి తెలుగులో అనర్గళంగా మాట్లాడుతు న్నారు. మరొకటి.. మనవాళ్లు దుబాయ్, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్తున్నారు. కానీ, హైదరాబాద్‌లో ఏ పెద్ద భవంతి నిర్మాణం పను ల్లోనైనా చూడండి.. అంతా ఇతర రాష్ట్రాల వారే. కనీసం 70 శాతం మంది బయటి వాళ్లే. మన వాళ్లే మో విదేశాల్లో ఒళ్లు వంచి పనిచేస్తారు. ఇక్కడ మాత్రం చేయరు’ అని వ్యాఖ్యానించారు. -
రెవె‘న్యూ’ లీలలు!
నారాయణపేట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం పక్కదారి పడుతోంది. మామూళ్లకు రుచిమరిగిన రెవెన్యూ యంత్రాంగం వ్యవహరిస్తున్న లీలలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే పాలమూరు జిల్లాలోని మద్దూరు, గండీడ్ మండలాల్లో చోటుచేసుకున్న అక్రమాలకు తోడు పేట మండలంలో కూడా వరుస ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పేట మండలంలోని సింగారంలో రాళ్లగుట్టకు రైతుబంధు చెక్కులు పంపిణీ చేసిన సంఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. మండలంలోని చిన్నజట్రంలో ఏకంగా 20 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తి పేరుతో రైతుబంధు చెక్కును సృష్టించడం వాటిని కాజేయడం కూడా జరిగిపోయింది. సదరు చనిపోయిన వ్యక్తిది నకిలీ ఆధార్‌కార్డుతో బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. చిన్నజట్రం గ్రామానికి చెందిన ఎంఏ వహీద్‌కు సర్వే నం. 327లో 8.78ఎకరాల వ్యవసాయ పొలం ఉండేది. ఆయనకు ఇద్దరు సంతానం కాగా వారిలో ఒకరు ఖాజాబేగం 20 ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తర్వాత రజియాబేగం ఇటీవల పిల్లల చదువుల కోసం మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుంది. అయితే 1998లోనే ఎంఏ వహీద్ అనారోగ్యంతో చనిపోయారు. అటు తర్వాత వారసత్వంగా మొత్తం 8.78 ఎకరాల పొలం కూతురు రజియాబేగం పేరుతో మార్పు చేయించుకున్నారు. దాదాపు 2017 వరకు ఖాస్రా, పహాణి రజియాబేగం పేరుతోనే తహసీల్ కార్యాలయంలో నమోదైంది. అనంతరం ల్యాండ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ నమోదులో రెవెన్యూ అధికారులు తమ చేతివాటం ప్రదర్శించి కూతురు పేరును మార్చి తిరిగి తండ్రి ఎంఏ వహీద్ పేరును చేర్చారు. అదే పేరుతో పట్టాపాసు పుస్తకంతోపాటు రైతుబంధు చెక్కు మంజూరైంది. జిల్లా కేంద్రంలో ఉన్న ఆమె కొత్త పాసుపుస్తకం, చెక్కు తీసుకుని వెళ్లేందుకు గ్రామానికి వస్తే తన పేరుపై లేదని, తండ్రి వహీద్ పేరుతో పాసుపుస్తకం, చెక్కు రావడంతో ఆయన చనిపోయినందుకు ఇవ్వడం కుదరదని వెనక్కి పంపించారు. తన పేరుతో విరాసత్ అయ్యిందని పత్రాలు చూపించినా.. రూల్స్ ఒప్పుకోవని.. తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. జూన్ 29న భూమి తమ పేరుపై రాలేదని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత పరిశీలిస్తే అప్పటికే వహీద్ పేరుతో నకిలీ ఆధార్‌కార్డు సృష్టించి పాసుబుక్ (701220130667) ద్వారా ఎస్బీఐ బ్యాంకులో చెక్ నం.512255 పేరుతో రూ.27,100 జూన్ 25న డబ్బులు డ్రా చేసుకున్నట్లు వెలుగుచూసింది. వీఆర్ఓపై ఫిర్యాదు స్థానికంగా లేని విషయాన్ని గుర్తించి తన పేరుపై ఉన్న వారతస్వ పొలాన్ని తన తండ్రి పేరుపైకి మార్చి ఫోర్జరీ చేసి రైతుబంధు పథకం చెక్కు డబ్బులను చిన్నజట్రం వీఆర్ఓ కృష్ణారెడ్డి డ్రా చేసుకున్నారని రజియాబేగం సోమవారం నారాయణపేట తహసీల్దార్ పార్థసారథికి ప్రజావాణిలో ఫిర్యాదు చేసింది. గతంలో కూడా ఆయన పనిచేసిన చోట ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడని, సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతిలో కోరారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. -
అమృతధారతో వచ్చిన ఆపద్బాంధవుడు
చెన్నై: భీకర వరదల్లో చిక్కుకొని ఆకలిదప్పికలతో అలమటిస్తున్న చెన్నైవాసులు.. అన్నంమాట దేవుడెరుగు, గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క అల్లాడిపోతుంటే ఆపద్బాంధవుడిలా వచ్చాడు బెంగళూరుకు చెందిన దినేశ్ జైన్. ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చే ‘ప్యూరిఫికేషన్ ప్లాంట్’ ట్రక్కును తనతో తీసుకొచ్చాడు. ఔత్సాహిక వ్యాపారవేత్త అయిన దినేశ్ జైన్ వ్యాపారం కోసం కాకుండా కేవలం మానవతా దృక్పథంతోనే ఇక్కడికి వచ్చానని మీడియాకు తెలిపాడు. ‘అమ్మ’ పెట్టదూ.. పెట్టనివ్వదు..: రివర్స్ ఓస్మోసిస్ (ఆర్ఓ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే తన ప్యూరిఫికేషన్ ప్లాంట్ ద్వారా 20 వేల లీటర్ల మురికి నీటిని మంచినీటిగా మార్చవచ్చని ఆయన తెలిపారు. వివిధరకాల ఫిల్టర్లు, ప్రెషర్ మెకానిజం ద్వారా వివిధ దశల్లో మురికిని తొలిగించి, మంచినీటిగా మారుస్తామన్నారు. అందులో 99.1 శాతం కలుషితాలు ప్రాసెస్ దశలోనే తొలగిపోతాయని చెప్పారు. బెంగళూరు నుంచి శుక్రవారమే చెన్నై నగరానికి చేరుకున్నప్పటికీ వరదనీటిని మంచినీరుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే నీటిని శుద్ధిచేసి వరద బాధితులకు ఉచితంగానే సరఫరా చేస్తానని చె ప్పాడు. స్థానికుల ఒత్తిడితో రంగంలోకి..: ఎంతకూ ప్రభుత్వ అధికారుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో స్థానికుల ఒత్తిడి మేరకు శనివారం నీటిశుద్ధిని ప్రారంభించాడు. తొలుత కొన్నిలీటర్ల వరద నీటిని మంచినీటిగా మార్చి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించానని, ల్యాబ్ రిపోర్టు రాగానే నీటిని ఉచితంగా అందజేస్తానని చెప్పాడు. వరదనీటిలో డ్రైనేజీ నీరు కూడా కలిసినందున పరీక్షలకు పంపి, సురక్షితమని తేలిన తర్వాతే బాధితులకు అందజేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ప్యూరిఫికేషన్ ప్లాంటుకు ‘అమృత్ ధార’ అనే పేరు పెట్టుకున్నానని చెప్పాడు.