అమృతధారతో వచ్చిన ఆపద్బాంధవుడు
చెన్నై: భీకర వరదల్లో చిక్కుకొని ఆకలిదప్పికలతో అలమటిస్తున్న చెన్నైవాసులు.. అన్నంమాట దేవుడెరుగు, గుక్కెడు మంచినీళ్లు కూడా దొరక్క అల్లాడిపోతుంటే ఆపద్బాంధవుడిలా వచ్చాడు బెంగళూరుకు చెందిన దినేశ్ జైన్. ఎలాంటి మురికి నీటినైనా మంచినీటిగా మార్చే ‘ప్యూరిఫికేషన్ ప్లాంట్’ ట్రక్కును తనతో తీసుకొచ్చాడు. ఔత్సాహిక వ్యాపారవేత్త అయిన దినేశ్ జైన్ వ్యాపారం కోసం కాకుండా కేవలం మానవతా దృక్పథంతోనే ఇక్కడికి వచ్చానని మీడియాకు తెలిపాడు.
‘అమ్మ’ పెట్టదూ.. పెట్టనివ్వదు..: రివర్స్ ఓస్మోసిస్ (ఆర్‌ఓ) సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే తన ప్యూరిఫికేషన్ ప్లాంట్ ద్వారా 20 వేల లీటర్ల మురికి నీటిని మంచినీటిగా మార్చవచ్చని ఆయన తెలిపారు. వివిధరకాల ఫిల్టర్లు, ప్రెషర్ మెకానిజం ద్వారా వివిధ దశల్లో మురికిని తొలిగించి, మంచినీటిగా మారుస్తామన్నారు. అందులో 99.1 శాతం కలుషితాలు ప్రాసెస్ దశలోనే తొలగిపోతాయని చెప్పారు. బెంగళూరు నుంచి శుక్రవారమే చెన్నై నగరానికి చేరుకున్నప్పటికీ వరదనీటిని మంచినీరుగా మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే నీటిని శుద్ధిచేసి వరద బాధితులకు ఉచితంగానే సరఫరా చేస్తానని చె ప్పాడు.
స్థానికుల ఒత్తిడితో రంగంలోకి..: ఎంతకూ ప్రభుత్వ అధికారుల నుంచి కనీస స్పందన రాకపోవడంతో స్థానికుల ఒత్తిడి మేరకు శనివారం నీటిశుద్ధిని ప్రారంభించాడు. తొలుత కొన్నిలీటర్ల వరద నీటిని మంచినీటిగా మార్చి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించానని, ల్యాబ్ రిపోర్టు రాగానే నీటిని ఉచితంగా అందజేస్తానని చెప్పాడు. వరదనీటిలో డ్రైనేజీ నీరు కూడా కలిసినందున పరీక్షలకు పంపి, సురక్షితమని తేలిన తర్వాతే బాధితులకు అందజేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ప్యూరిఫికేషన్ ప్లాంటుకు ‘అమృత్ ధార’ అనే పేరు పెట్టుకున్నానని చెప్పాడు.