వరదల్లో విశేష సేవలందించిన డ్రోన్లు
బాధితులకు ఆహారం, తాగునీరు, లైఫ్ జాకెట్లు చేరవేత
వరదల్లో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగినా ఫలితం కానరాని వేళ... డ్రోన్లు అండగా నిలుస్తున్నాయి. బాధితుల ఆచూకీ గుర్తించడం, వారికి ఆహారం, తాగునీరు, లైఫ్ జాకెట్లు చేరవేయడంతో డ్రోన్ల సాయం తీసుకుంటున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లాలో వచి్చన వరదలో వీటిపాత్ర కీలకంగా మారింది. 20 కేజీల బరువును మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ డ్రోన్లతో బాధితులకు లైఫ్ జాకెట్లు, ఆహారం, తాగునీరు చేరవేశారు. – ఖమ్మం మయూరిసెంటర్
ఆ తొమ్మిది మందికి..
గత ఆదివారం మున్నేరుకు వచ్చిన భారీ వరదతో ప్రకాశ్‌నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది చిక్కుకుపోయారు. వరద భారీగా పెరగడంతో బ్రిడ్జిపై ఓ పక్క ఎత్తయిన స్థలానికి చేరి బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. ఉదయం 9గంటలకు వరదనీరు మరింత పెరగడంతో బ్రిడ్జిపైకి చేరుకున్న వీరిని రక్షించేందుకు ఎలాంటి మార్గం కానరాలేదు. మధ్యాహ్నం 2గంటల సమయాన అధికారులు రెండు డ్రోన్లు పంపి వీరి పరిస్థితిని తెలుసుకున్నారు.
అనంతరం డ్రోన్ల ద్వారానే లైఫ్ జాకెట్లు, ఆహారం, తాగునీరు పంపించారు. రాత్రి వరకు సహాయక చర్యలు ప్రారంభం కాకపోవడంతో కుటుంబ సభ్యులు అదే డ్రోన్ల సాయంతో బ్యాటరీ లైట్లు చేరవేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వారు డ్రోన్ అందించిన లైఫ్ జాకెట్లు, ఆహారం, తాగునీటితో బాధితులు గడిపారు.
అక్కడ కూడా..
కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పాలేరు అలుగుల ప్రాంతంలో షేక్ యాకూబ్ , సైదాబి, షరీఫ్ వరదలో చిక్కుకున్నారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వారి నివాసాన్ని వరద చుట్టుముట్టడంతో ఇంటి పైభాగంలో ఉండిపోయారు. వారి వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోగా సాయం చేసే అవకాశం కనిపించలేదు.
వీరికి డ్రోన్ ద్వారా లైఫ్ జాకెట్లు, ట్యూబ్‌లు, ఆహారం, తాగునీరు అందించాలనే ఆలోచనకు వచ్చారు. ఆ వెంటనే మోతె నుంచి డ్రోన్లు తెప్పించి యాకూబ్ కుటుంబ సభ్యులకు లైఫ్‌జాకెట్లు, ఆహారం, తాగునీరు పంపించారు. అయితే, జాకెట్ ధరించిన షరీఫ్ ప్రాణాలను దక్కించుకోగా.. యాకూబ్, సైదాబీలు మాత్రం వరదలో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment