ఎస్.వేణుగోపాలచారి–కామారెడ్డి, నాగమళ్ల శ్రీకర్–రాయికల్,జవ్వాడి చంద్రశేఖర్–మల్యాల : వాతావరణ పరిస్థితులు అనుకూలించక.. పండించిన కొద్దిపాటి పంటకు కూడా గిట్టుబాటు ధర రాకపోవడంతో సొంత ఊరిని వదిలి బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన రైతులకు ‘రైతు బీమా’ పథకం వర్తించడం లేదు. ఉపాధి కోసం గల్ఫ్‌తో పాటు వివిధ దేశాలకు వెళ్లిన వారిలో భూమి ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు ఉంటారని అంచనా. వీరికి రైతు బీమా పథకం అందకుండా పోతోంది. దీంతో పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లిన రైతులకు నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకం ద్వారా భూ యజమానులకు కొత్త పట్టా పాస్‌పుస్తకాలు, ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయంతో పాటు రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించింది. అయితే, స్వయంగా భూ యజమాని వచ్చి తమ పేరిట ఉన్న పాసు పుస్తకాన్ని, రైతు బంధు చెక్కు అందుకోవాలని, బీమా ఫారంపై సంతకం చేయాలనే నిబంధనలు వలస రైతుల పాలిట శాపంగా మారాయి. రైతు బీమా, రైతు బంధు పథకం వర్తించడానికి విదేశం నుంచి స్వదేశానికి రావాలంటే ఖర్చుతో కూడుకున్న పని.
రైతుబంధు పథకం ప్రవేశపెట్టిన మొదట్లో విదేశాల్లో ఉన్నవారికి రైతుబంధు ప్రయోజనాలను వర్తింపజేయకపోవడం వల్ల ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో రైతుబంధు పథకాన్ని గల్ఫ్‌లో ఉన్న సన్న, చిన్నకారు రైతులకు వర్తింపజేయాలని ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం(ప్రవాసీ సంక్షేమ వేదిక) ఆధ్వర్యంలో ప్రవాసులు వారి కుటుంబ సభ్యులు సైతం పోరాటాలు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది జూలై 7న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతి పత్రం సమర్పించారు. అయినా, ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ అధ్యక్షుడు మంద భీంరెడ్డి, మాజీ భారత రాయబారి బి.ఎం.వినోద్‌కుమార్‌లు ప్రవాసంలో ఉన్న తెలంగాణ రైతుల పక్షాన ఉమ్మడి హైకోర్టులో గతేడాది జూలై 20న ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాది బొల్లు రచనారెడ్డి వాదించారు. పిటిషనర్ల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని, రెండు నెలల్లో గల్ఫ్‌లోని ప్రవాసీలకు ‘రైతుబంధు’ వర్తింపును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యన్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని గతేడాది జూలై 24న ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఎన్నారై కుటుంబ సభ్యులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాలని అప్పట్లో ఉత్తర్వులు జారీచేసింది. అయితే, రూ.5లక్ష బీమా వర్తింపు విషయంలో ఇప్పటివరకు సానకూల నిర్ణయం తీసుకోకపోవడంతో వలస రైతు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నిబంధనలను సడలించి వలస వెళ్లిన ప్రవాసీ రైతులకు రైతుబీమా వర్తింపజేయాలని వారి కుటుంబీకులు కోరుతున్నారు.
విదేశాలకు వెళ్లిన రైతులను కూడా ఆదుకోవాలి
విదేశాల్లో ఉన్న రైతులపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రైతులకు బీమా పథకాన్ని వర్తింజేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. స్వదేశంలో ఉన్న రైతులతో సమానంగా విదేశాలలో ఉన్న రైతులకు ఎల్‌ఐసీ వారి రూ.5లక్షల గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ (బృంద జీవిత బీమా)ను మెయిల్ ఆర్డర్ బిజినెస్ పద్ధతిలో వర్తింపజేయాలని కోరాం. విదేశాల్లో తెలంగాణ రైతులకు కూడా అన్ని రకాల ‘రైతు బంధు’ ప్రయోజనాలను కల్పించడానికి ఒక సిస్టమ్‌ను రూపొందించాలి. ఎన్నారై రైతుల వ్యవహారాలను పర్యవేక్షించడానికి వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. –మంద భీంరెడ్డి, ప్రవాసీ కార్మికుల హక్కుల కార్యకర్త
వ్యవసాయం సరిగా లేకనే గల్ఫ్‌కు..
నా భర్త అయిత భూమయ్య పేరిట కట్కాపూర్ గ్రామంలో రెండున్నర ఎకరాల భూమి ఉంది. ఇక్కడ వ్యవసాయం సరిగా లేకనే ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లాడు. యూఏఈలోని పుజీరాలో ఓ కంపెనీలో పనికి కుదిరాడు. అయితే, కంపెనీ యాజమాన్యం కొన్నేళ్లు జీతం ఇవ్వకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురై తన రూమ్‌లో ఉరివేసుకొని మృతిచెందాడు. నా కొడుకు శశికుమార్ బీడీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కూతురు ప్రవళిక డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. వీరి చదువుల కోసం మా ఆయన ఎంతో కష్టపడేవారు. ఇక్కడ సరైన నీటి సదుపాయం లేకపోవడంతో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని ఏదో విధంగా సాగుచేశాం. అయినా, పంటలు సరిగా పండలేదు. పంటకు చేసిన అప్పుల గురించి, పిల్లల పోషణ గురించి భూమయ్య ఎప్పుడూ ఆలోచించేవాడు. ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని గల్ఫ్‌కు వెళ్లిన వారికి కూడా వర్తింపజేస్తే మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుంది. – సునీత, కట్కాపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా
పెట్టుబడి సాయం అందినా.. బీమా రాలేదు
నా భర్త రవీందర్ పేరిట 21గుంటల భూమి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కింద రెండు పర్యాయాలు బ్యాంకు ఖాతాలో నగదు జమ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కూడా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. కానీ, స్థానికంగా లేడని.. రైతు బీమా బాండు ఇవ్వలేదు. ఉపాధి కోసం నా భర్త సౌదీ అరేబియాకు వెళ్లాడు. కొన్ని రోజుల క్రితం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. మాకు రైతు బీమా వర్తించకపోవడంతో నష్టపోయాం. ఆపద్బంధుకు దరఖాస్తు చేసుకోలేదు.–నల్లపు మణెమ్మ, సర్వాపూర్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment