టెక్కలి:ఉద్దానం ప్రాంత కిడ్నీ రోగుల ఆశలు తీరలేదు. వారికష్టాలు చూసి చలించిన ట్రైమాక్స్ సంస్థ ఆర్థిక సాయం చేసినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇక్కడివారికి ఆ ఫలం అందలేదు. అధిక మొత్తాలు వెచ్చించి సుదూర ప్రాంతానికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఈ ప్రాంత కిడ్నీ రోగుల బాధలు తీర్చడానికి 2012 అక్టోబర్ లో ట్రైమాక్స్ సంస్థ అధినేత కోనేరు ప్రసాదరావు టెక్కలి ఏరియా ఆసుపత్రిని సందర్శించి డయాలసిస్ ప్రాజెక్టు కోసం కోటి రూపాయలు వెచ్చిస్తామని ప్రకటించారు. డయాలసిస్ యూనిట్ ఏర్పాటు విషయంలో జిల్లా స్థాయి అధికారులు, స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు, ఆసుపత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రకటించిందే తడవుగా కోటి రూపాయల విలువైన పరికరాలను ఆసుపత్రికి అందజేశారు.
అయితే నెఫ్రాలజీ వైద్యులు, మిగిలిన సిబ్బంది నియామకం, డయాలసిస్ నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం పూర్తిగా దృష్టి సారించకపోవడంతో, సుమారు రెండు సంవత్సరాల నుంచి ఆ పరికరాలన్నీ ఆస్పత్రిలో నిర్లక్ష్యంగా మూలుగుతున్నాయి. 2013 సంవత్సరంలో కోనేరు ప్రసాదరావు మరోసారి ఆస్పత్రిని సందర్శించి పరికరాల పరిస్థితి చూసి నివ్వెరపోయారు. అంతేగాకుండా జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో, ఆసుపత్రిలో ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ లక్ష్మణరావుకు విశాఖ కేజీహెచ్‌లో 20 రోజుల పాటు డయాలసిస్‌పై శిక్షణనిచ్చారు. మరో ఇద్దరు స్టాఫ్ నర్స్‌లకు శ్రీకాకుళం రిమ్స్‌లో శిక్షణ ఇచ్చారు. కానీ ఏడాది పూర్తయినా యూనిట్ ప్రారంభం కాకపోవడంతో వారి శిక్షణ కూడా వృధా అయింది. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో ఈ డయాలసిస్ కేంద్రం తెరిపిస్తానంటూ ప్రకటనలు చేశారు. కానీ అది కూడా అమలు కాలేదు. శ్రీకాకుళం రిమ్స్‌లో డయాలసిస్ నిర్వహిస్తున్న ‘బీబ్రాన్’ సంస్థకు టెక్కలి డయాలసిస్ నిర్వాహణ బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేశారు.
వారు నిరాకరించడంతో ‘శాండర్’ అనే సంస్థకు ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆస్పత్రి ఉన్నతాధికారులు వెల్లడించారు. అది కూడా విఫలమవ్వడంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఓ వితరణశీలి సామాజిక స్పృహతో కిడ్నీ రోగుల కోసం కోటి రూపాయల విలువైన డయాలసిస్ పరికరాలు అందజేస్తే వాటిని నిర్వహించడంలో అటు ప్రజాప్రతినిధులు గాని అధికార యంత్రాంగం గాని పూర్తిగా విఫలం కావడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో మాత్రమే ఈ డయాలసిస్ కేంద్రం ఉండడంతో, జిల్లా నలుమూలలకు చెందిన కిడ్నీ రోగులు డయాలసిస్‌కోసం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు మూలకు చేరిన డయాలసిస్‌ను ప్రారంభించే ప్రయత్నాలు చేపడితే మంచిది.
ఆశలు తీరేదెప్పుడు?
Published Sun, May 24 2015 12:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM
Advertisement
Advertisement